అర్జున్‌ ఆరో స్థానంలో... హారిక ఏడో స్థానంలో | Sakshi
Sakshi News home page

అర్జున్‌ ఆరో స్థానంలో... హారిక ఏడో స్థానంలో

Published Sun, Dec 31 2023 4:20 AM

Arjun is at the sixth position and Harika is at the seventh position - Sakshi

సమర్‌కండ్‌ (ఉజ్బెకిస్తాన్‌): ప్రపంచ బ్లిట్జ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు విశేషంగా రాణించినా పతకాలు మాత్రం సాధించలేకపోయారు. శనివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో ఓపెన్‌ విభాగంలో భారత్‌ నుంచి తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ అత్యుత్తమంగా ఆరో స్థానాన్ని సాధించాడు. నిర్ణీత 21 రౌండ్ల తర్వాత అర్జున్‌ 14 పాయింట్లతో మరో ముగ్గురితో (నెపోమ్‌నిషి, లెవాన్‌ అరోనియన్, డెనిస్‌ లాజావిక్‌) కలిసి ఉమ్మడిగా ఐదో స్థానంలో నిలిచాడు.

అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా నెపోమ్‌నిషికి ఐదో ర్యాంక్, అర్జున్‌కు ఆరో ర్యాంక్, అరోనియన్‌కు ఏడో ర్యాంక్, డెనిస్‌కు ఎనిమిదో ర్యాంక్‌లు ఖరారయ్యాయి. భారత్‌కే చెందిన ఇతర గ్రాండ్‌మాస్టర్లు అరవింద్‌ చిదంబరం 14వ ర్యాంక్‌లో, ప్రజ్ఞానంద 28వ ర్యాంక్‌లో, నారాయణన్‌ 35వ ర్యాంక్‌లో, గుకేశ్‌ 38వ ర్యాంక్‌లో నిహాల్‌ సరీన్‌ 43వ ర్యాంక్‌లో నిలిచారు. 

మహిళల విభాగంలో భారత్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక అత్యుత్తమ ప్రదర్శన చేసింది. నిర్ణీత 17 రౌండ్ల తర్వాత హారిక 11 పాయింట్లతో ఏడో ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. హారికతోపాటు మరో ఎనిమిది మంది క్రీడాకారిణులు కూడా 11 పాయింట్లు స్కోరు చేశారు. మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా హారికకు ఏడో ర్యాంక్‌ దక్కింది. భారత్‌కే చెందిన దివ్య దేశ్‌ముఖ్‌ 13వ ర్యాంక్‌లో, కోనేరు హంపి 17వ ర్యాంక్‌లో, సాహితి వర్షిణి 27వ ర్యాంక్‌లో, వైశాలి 36వ ర్యాంక్‌లో, ప్రియాంక నూతక్కి 46వ ర్యాంక్‌లో నిలిచారు.  

Advertisement
Advertisement