కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో 10 నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, రెండోసారి అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. 108 మున్సిపాల్టీలకు గాను ఏకంగా 102 మున్సిపాల్టీలను తన ఖాతాలో వేసుకుంది. ప్రతిపక్షాలను చావుదెబ్బ కొట్టింది. పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. మొత్తం 2,170 వార్డులకు గాను టీఎంసీ 1,870 వార్డులను దక్కించుకుంది. పోలైన మొత్తం ఓట్లలో ఆ పార్టీ 63.45 శాతం ఓట్లను సాధించింది.
నాలుగు మున్సిపాల్టీల్లో హంగ్ ఏర్పడింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆరాటపడుతున్న ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి ఈ ఫలితాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు. నందిగ్రామ్ ఎమ్మెల్యే, బీజేపీ నేత సువేందు అధికారికి కంచుకోట అయిన కాంతీ మున్సిపాల్టీలో టీఎంసీ విజయం సాధించడం గమనార్హం. కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన హమ్రో పార్టీ డార్జీలింగ్ మున్సిపాల్టీని దక్కించుకుంది. తాహెర్‌పూర్ పురపాలక సంఘంలో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ జెండా ఎగురవేసింది. బీజేపీ కనీసం ఒక్క మున్సిపాల్టీని కూడా దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవమే మిగిలింది.
వారణాసిలో నేడు, రేపు మమతా ప్రచారం
ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం సాయంత్రం కోల్‌కతా నుంచి బయలుదేరి వెళ్లారు. ఆమె రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో గురువారం, శుక్రవారం ప్రచారం నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment