పొత్తులే కత్తులై.. | Sakshi
Sakshi News home page

పొత్తులే కత్తులై..

Published Fri, Mar 15 2024 4:10 AM

Tdp cadre angry on Chandrababu and his son Lokesh behavior - Sakshi

సాక్షి, అమరావతి/ సాక్షి నెట్‌వర్క్‌ : పొత్తుల కోసం వెంపర్లాడిన తెలుగుదేశం పార్టీ పుట్టి మునుగుతోంది. పొత్తుల పోటు గట్టిగా తగలడంతో సీనియర్ల సీట్లకు అధిష్టానం ఎసరుపెట్టింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. సీనియర్లు బజారుకెక్కి పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం టికెట్‌ వసంత కృష్ణప్రసాద్‌కేనని అధిష్టానం చెప్పడంతో ఉమా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలిసింది.

పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కూ టికెట్‌ లేదని పార్టీ సంకేతాలిచ్చింది. దీంతో ఆయన తన అనుచరులతో సమావేశమయ్యారు. రాజీనామాకు సిద్ధమవుతున్నారు. తనను కాదని పార్టీ ఎలా గెలుస్తుందో చూస్తానని సవాల్‌ విసిరారు. అవసరమైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానంటూ హెచ్చరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని తొలుత జనసేనకు కేటాయించినట్టు పార్టీ సమాచారం ఇవ్వడంతో బుద్దా వెంకన్న, జలీల్‌ఖాన్, ఎంకే బేగ్‌ ఖంగుతిన్నారు.

బుద్దా వెంకన్న అనుచరులతో సమావేశం నిర్వహించి మరీ పార్టీకి పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. జలీల్‌ఖాన్‌ పార్టీ వీడతానని బెదిరించారు. ఇప్పుడు ఈ సీటును బీజేపీ కోరుతున్నట్టు తెలియడంతో సీటుపై ఆశలు పెట్టుకున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్‌కూ షాక్‌ తగిలింది. అవనిగడ్డ సీటును జనసేనకు కేటాయించడంతో మండలి బుద్ధప్రసాద్‌ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.  

బండారుకు చుక్కెదురు  
మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి గట్టి షాక్‌ తగిలింది. విశాఖ జిల్లా పెందుర్తి సీటును జనసేనకు కేటాయించడంతో ఆయన రగిలిపోతున్నారు. ఈ సీటును పంచకర్ల రమేష్‌బాబుకు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ప్రకటించడంతో బండారు ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఇంటికే పరిమితమయ్యారు. దీంతో పంచకర్లను ఓడిస్తామని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.  

టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కళావెంకట్రావుకు ఎచ్చెర్ల సీటు ఖరారు చేయకుండా ఇంకా గాల్లోనే పెట్టారు. వయసు రీత్యా ఆయనను పక్కనపెట్టాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్రకు చెందిన మరో కీలక నేత గంటా శ్రీనివాసరావు సీటును ఇంకా ఖరారు చేయలేదు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు సీటు నిరాకరించి ఆ స్థానాన్ని జనసేనకు ఇవ్వడంపై ఆయన రంకెలు వేస్తున్నారు. మెలవరం సీటు గందరగోళంగా మారింది.  

పల్నాడు జిల్లాలో ఆశావహుల డీలా 
పల్నాడు జిల్లాలో సైకిల్‌ పార్టీ డీలా పడింది. నరసరావుపేట అసెంబ్లీ సీటుపై ఇంకా సందిగ్ధం వీడలేదు. టీడీపీ నేత చదలవాడ అరవిందబాబు ఆందోళన చెందుతున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తనకు సీటు దక్కకుండా చేస్తున్నారని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు సమాచారం.

మరోవైపు ఈ సీటులో బీజేపీ పోటీ చేస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. గురజాల అభ్యర్థిగా యరపతినేని శ్రీనివాసరావు పేరు ఖరారు కావడంతో వైఎస్సార్‌సీపీకి దూరం జరిగి టీడీపీతో సన్నిహితంగా ఉంటున్న జంగా కృష్ణమూర్తి డైలమాలో పడ్డారు.  

జవహర్‌కు అవమానం 
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సీటు కోసం ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ను ఆ పార్టీ అధిష్టానం ఘోరంగా అవమానించింది. ఈ సీటును గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు కేటాయించింది. దీంతో జవహర్‌ వర్గీయులు అధిష్టానం తీరుపై మండిపడుతున్నారు.

నిడదవోలు సీటు ఆశిస్తున్న శేషారావుకు శరాఘాతం తగిలింది. ఈ సీటును జనసేనకు కేటాయించడంతో ఆయన వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. గోపాలపురం సీటును మద్దిపాటు వెంకట్రాజుకు కేటాయించడంతో అక్కడ పార్టీ శ్రేణుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. మాజీ జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు వర్గం వెంట్రాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తోంది. 

పరిటాలకు బాబు ఝలక్‌ 
అనంతపురం జిల్లా ధర్మవరం సీటు ఆశించిన పరిటాల శ్రీరామ్‌ చతికిలపడ్డారు. సీటును బీజేపీకి కేటాయించడంతో వరదాపురం సూరి ఎగరేసుకుపోయారు. దీంతో  ఏం చేయాలో పాలుపోక శ్రీరామ్‌ తల్లడిల్లుతున్నారు.  పుట్టపర్తి సీటును పల్లె రఘునాథరెడ్డి కోడలు సింధూరరెడ్డికి కేటాయించడంతో బీసీ వర్గాలు భగ్గుమంటున్నాయి. ఇక్కడ వడ్డెర సామాజికవర్గ నేతలు టికెట్‌ ఆశించారు.  

కదిరిలో 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కందికుంట వెంకట ప్రసాద్‌కు డీడీల కేసులో శిక్ష పడింది. ఆయన భార్యకు ఇప్పుడు పార్టీ టికెట్‌ ఇవ్వడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అనంతపురం, గుంతకల్లు సీట్లపై టీడీపీ ఇంకా సస్పెన్స్‌ కొనసాగిస్తోంది. 

జనసేనకు అన్ని టికెట్లా.. తీవ్ర అసంతృప్తి 
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకు ఆరు టికెట్లు కేటాయించడంపై టీడీపీ కేడర్‌ రగిలిపోతోంది. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పోలవరాన్ని కూడా జనసేనకు కేటాయిస్తున్నట్టు సమాచారం.  

 ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు, కోవూరు, కావలి, ఉదయగిరి, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాలలో టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో సీనియర్‌నేతలు కొమ్మి లక్ష్మయ్యనాయుడు, కన్నబాబు అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ వలస నేత ఆనం రామనారాయణరెడ్డికి టికెట్‌ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్,  కోవూరు, కావలిల్లోనూ ఆ పార్టీ ఆశావహులు టికెట్ల కేటాయింపుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోవూరు సీటును ఇటీవలే టీడీపీలో చేరిన  ప్రభాకర్‌రెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డికి ఇవ్వడంతో ఇన్నాళ్లూ అక్కడ పార్టీ కోసం పనిచేసిన పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి కుటుంబం రగిలిపోతోంది. సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని పార్టీ అధిష్టానం పూర్తిగా పక్కన పెట్టేసింది.  

 ఉమ్మడి చిత్తూరులో చిచ్చు రేగింది. సత్యవేడు సీటును టీడీపీలో కూడా చేరని ఆదిమూలంకు ఇవ్వడంపై తెలుగుదేశం ఆశావహుల్లో ఆగ్రహ జ్వాలలు రేగాయి. గతంలో బాబు నుంచి హామీ పొందిన మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె డాక్టర్‌ హెలెన్, జేడీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు స్థానాన్ని వరదరాజులరెడ్డికి కేటాయించడం పట్ల లింగారెడ్డి, సురేష్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

 తిరుపతి సీటును ఆరణి శ్రీనివాసులుకు జనసేన కేటాయించడంపై ఆ పార్టీలో అసంతృప్తి రగులుతోంది. దీంతో ‘ఆరణి’ గో బ్యాక్‌’ అనే నినాదాలతో నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. చంద్రగిరి సీటును పులవర్తి నానికి కేటాయించడంతో రియల్టర్‌ డాలర్‌ దివాకర్‌రెడ్డి నీరుగారారు.  

  వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నుంచి ప్రతిసారీ ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటావని నారాయణరెడ్డి తనయుడు, పార్టీ ఇన్‌చార్జి భూపేష్‌రెడ్డిని ఊరించి, చివరికి జమ్మలమడుగు సీటు బీజేపీ(ఆదినారాయణరెడ్డి)కి కేటాయించినట్లు వెల్లడించడంతో నారాయణరెడ్డి కుటుంబం సంకట స్థితిలో పడింది.  

Advertisement
Advertisement