‘‘రాళ్లతో కొట్టండి.. మసి చేయండి!’’.. ఇంత జరిగినా మారని బాబు తీరు | KSR Comments On Chandrababu Naidu Behavior Regarding The Attack On CM YS Jagan, Details Inside - Sakshi
Sakshi News home page

Attack On CM Jagan: ‘‘రాళ్లతో కొట్టండి.. మసి చేయండి!’’.. ఇంత జరిగినా మారని బాబు తీరు

Published Mon, Apr 15 2024 11:53 AM

Ksr Comments On Chandrababu's Behavior Regarding The Attack On YS Jagan - Sakshi

ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక ప్రచార సభలో మాట్లాడుతూ ఏమన్నారో గమనించారా! తనకు ప్రత్యర్ధిగా ఉన్న వేరే పార్టీ నేతను రాళ్లతో కొట్టండి అని చెబుతున్నారు. పైగా ఆ నేతను ఉద్దేశించి దున్నపోతు అని కూడా సంబోధిస్తున్నారు. మరో సందర్భంలో ఏమన్నారంటే తమ్ముళ్లూ మనం కొట్టే దెబ్బకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మసి అయిపోవాలి.. తెలుగుదేశం కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుంది అని కూడా ఆయన చెప్పారు. దీనిని బట్టి ఏమి అర్దం అవుతుంది. టీడీపీ కార్యకర్తలు ప్రత్యర్దులపై రాళ్లతో దాడి చేయాలనే చెప్పడమే కదా! వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిను పట్టుకుని అంతమాట అన్నారంటే మనసులో ఉన్న ఉద్దేశం ఏమిటో తెలుస్తుంది కదా!

ఈ వీడియోని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు చూపించారు. ఇవి విన్న తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది. చంద్రబాబు మాటలకు రెచ్చిపోయిన ఎవరో టీడీపీ దుండగులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయి విసిరారని వైఎస్సార్‌సీపీ వారు అనుకోవడంలో తప్పు ఏమి ఉంటుంది? ఆ అనుమానం నిజమా? కాదా? అన్నది పోలీసులు నిర్ధారిస్తారు. ప్రాథమికంగా చూస్తే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికు రాజకీయంగా ఉన్న ప్రధాన ప్రత్యర్ధి పార్టీపైనే సందేహాలు వస్తాయి. దానికి తగినట్లుగానే ఈ ఘటన జరిగిన తర్వాత చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు స్పందించిన తీరు కూడా పలు సంశయాలు కలిగిస్తుంది.

చంద్రబాబేమో కొంత తెలివిగా దాడిని ఖండిస్తూ నిష్పాక్షిక విచారణ చేయించి నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్య తీసుకోవాలని కోరారు. అంటే దాని అర్దం ఏమిటి? ఇది దుండగులు చేసిన పని అయినా, అధికారులను తప్పు పట్టే రీతిలో ఆయన మాట్లాడారు. ఓకే! అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరడం తప్పుకాదు. కానీ అందులో కూడా అంతర్లీనంగా మొత్తం నెపాన్ని పోలీసులపై నెట్టేసి, రాయి వేసిన వారిని కాపాడాలన్న భావన ఆయనలో ఉన్నట్లు అనిపించదా! మరుసటి రోజుకు మాట మార్చి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై వచ్చి పడింది గులకరాయి అని నీచ ప్రచారం ఆరంభించారు. చంద్రబాబు అలా మాట్లాడితే అధికారిక ఎక్స్‌లో తెలుగుదేశం పార్టీ చేసిన వ్యాఖ్య దారుణంగా ఉంది. "కమలాసన్" అంటూ ఎద్దేవ చేస్తూ ఇదంతా డ్రామా అన్నట్లుగా వ్యాఖ్యానించింది. దీనికి ,చంద్రబాబుకు సంబంధం ఉండదా? అంటే.. కచ్చితంగా ఉంటుంది.

ప్రతి దానిలోను ఆయన డబుల్ గేమ్ ఆడుతుంటారు. అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం అయినా, వలంటీర్ల సంగతి అయినా, మోదీ, సోనియాలపై వ్యాఖ్యలు అయినా ఎప్పటికి ఏది అవసరమైతే అది మాట్లాడి యుటర్న్ తీసుకోవడం ఆయనకు సర్వసాధారణం. చంద్రబాబు దాదాపు పద్నాలుగేళ్లపాటు సీఎంగా ఉన్నారు. పదిహేనేళ్లపాటు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అంత సీనియర్ ఎంత మర్యాదగా, ఎంత హుందాగా ఉండాలి! కానీ తన రాజకీయ స్వార్దం ముందు ఆయనకు అవేవి అక్కర్లేదు. అదే తనను ఎవరైనా పొరపాటున ఏమైన అంటే మాత్రం అమ్మో.. నన్ను అన్నారు.. నేను ప్రజల కోసం పడతాను అంటూ డ్రామా రక్తి కట్టిస్తారు. ఆయనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇతర ఎల్లో మీడియా అంతా తబలా వాయిస్తాయి. ఆయన మాత్రం ఎదుటి వ్యక్తిని ఎంత మాట పడితే అంత అనేస్తారు. కొన్నిసార్లు అసలు ఈయన మతి ఉండి మాట్లాడుతున్నారా అన్న సంశయం కూడా వస్తుంది.

టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు అయితే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద జరిగిన దాడిని డ్రామాగా అభివర్ణిస్తూ ప్రకటనలు చేశారు. కోడికత్తి-2 అంటూ వ్యంగ్య వ్యాఖ్యనాలు చేశారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ ఏకంగా ఆ రాయి తాడేపల్లి పాలస్ నుంచి వచ్చిందంటూ ఒక పిచ్చి వ్యాఖ్య చేసి తన రాజకీయ అపరిపక్వతను, పిల్ల చేష్టను తెలియచేసుకున్నారు. జనసేన నేత నాగబాబు మాత్రం తొలుత అభ్యంతర వ్యాఖ్య చేసి తదుపరి దానిని తీసివేసి పద్దతిగా ఖండించారు. కానీ పవన్‌ కల్యాణ్‌ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు.. ఏ నాయకుడి మీద ఎలాంటి దాడి జరిగినా, ముందుగా అంతా ఖండించాలి. తమ పార్టీపై ఏదైనా ఆరోపణ వస్తే అది నిజం కాకపోతే అంతవరకు చెప్పవచ్చు. మరి అధికార పార్టీ తమపై ఆరోపణ చేయవచ్చా అని ఎవరైనా అడగవచ్చు.

ఇప్పుడు వైఎస్సార్‌సీపీ బాధిత స్థానంలో ఉంది. తన అనుమానాన్ని వెల్లడించింది. అందుకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. పోలీసుల దర్యాప్తులో ఇలాంటివన్నీ తేలే అవకాశం ఉంటుంది. అంతెందుకు! ఏపీలో ఎక్కడ ఏ ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డా, వారిలో ఒకరిని వైఎస్సార్‌సీపీ పార్టీ అని పులిమి ఈనాడు మీడియా ప్రచారం చేయడం లేదా? రాష్ట్రంలో జరిగే చిన్న నేరమైనా, పెద్ద నేరమైనా, దానిని వైఎస్సార్‌సీపీకి అంటకట్టే విధంగా అది వైఎస్సార్‌సీపీ నేతల పనే అనుకుంటున్నారని ఈనాడు మీడియా ఎందుకు నిర్లజ్జగా రాస్తోంది. దానిని తప్పు అని తెలుగుదేశం వారు అనడం లేదే! పైగా ఈనాడు మీడియా వాగడం, టీడీపీ ప్రచారానికి పెట్టడం, రాష్ట్రంలో ఏదో అయిపోయిందన్న తప్పుడు భావన కలిగించే యత్నం చేయడం నిత్యకృత్యం అయిందే. అందువల్ల వైఎస్సార్‌సీపీ నేతలు తమకు ఉన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. దానికి ఆధారంగా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేష్ వంటివారు తన ప్రసంగాలలో చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యల వీడియోలను చూపిస్తున్నారు.

ఈ ముగ్గురు నేతలు వైఎస్సార్‌సీపీవారిని బట్టలూడదీసి కొడతాం అని ఎన్నిసార్లు అన్నారో గుర్తు చేసుకోండి. అందువల్లే టీడీపీ అభిమాని లేదా, కార్యకర్త, లేదా మూర్ఖుడు ఎవరైనా మానసికంగా పర్వర్ట్ గా మారి ఇలా దాడి చేశారు అన్న అభిప్రాయం కలగదా! గతంలో ఏ ముఖ్యమంత్రికి రాని విధంగా విజయవాడ నగర వీధులలో వేలాది జనం తండోపతండాలుగా తరలి వచ్చి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికు మద్దతు ప్రకటిస్తుంటే చూసి ఓర్వలేనివారు ఇలాంటి ఘాతుకానికి పాల్పడినట్లు అర్థం అవడం లేదా!రాయలసీమలో ఆరంభం అయిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బస్ యాత్ర మొదటి నుంచి ఒక రికార్డు స్థాయిలో జనాదరణ పొందుతోంది. రాయలసీమ ఆయనకు బాగా పట్టుఉన్న ప్రాంతం కనుక వచ్చారులే అనుకుంటే గుంటూరు, విజయవాడ ప్రాంతాలలో అదే స్థాయిలో జనం రావడం టీడీపీ వారికి ఆశ్చర్యం కలిగిస్తుంది. దాంతో వారికి మైండ్ బ్లాంక్ అయింది.

ఇంతవరకు తమకు కూడా విజయావకాశాలు ఉంటాయని ఆశతో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి నిరాశ ఆవరించే పరిస్థితి నెలకొంది. ప్రత్యేకించి బలహీనవర్గాలవారు, మహిళలు, పిల్లలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బస్ యాత్రలో పాల్గొని ఆయనకు సంఘీబావం ప్రకటిస్తున్న వైనం వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. గతంలో ఏ ముఖ్యమంత్రికి ఐదేళ్ల పాలన తర్వాత ఈ స్థాయిలో ఇలాంటి జన స్పందన రాలేదు. ఎన్‌టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు పెద్ద ఎత్తున జనం వీదులలోకి వచ్చి స్వాగతం చెప్పారు. కానీ ఏడేళ్ల పాలన తర్వాత ఎన్‌టీఆర్ జనంలోకి వెళితే స్పందన అంతంతమాత్రంగానే కనిపించింది.

ఆయన 1989లో తొలుత ఉమ్మడి ఏపీలో మేడ్చల్ వద్ద సభ పెడితే కేవలం కొద్ది వందల మంది మాత్రమే సభకు వచ్చారు. అప్పుడే టీడీపీ ఆ ఎన్నికలలో ఓడిపోతుందని అర్దం అయింది. చివరికి ఎన్‌టీఆర్‌ సైతం కల్వకుర్తిలో ఓటమి చెందారు. అదే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విషయం చూస్తే ఆయనేమీ సినీ నటుడు కాదు. పెద్ద అందగాడు కాదు. గొప్ప వక్త అని కూడా చెప్పలేం. కానీ తాను చెప్పదలచుకున్నది ప్రజలకు అర్దం అయ్యేలా స్పష్టంగా చెబుతూ, ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ స్పీచ్ ఇస్తుంటారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పాలనలో తీసుకువచ్చినన్ని సంస్కరణలు మరే సీఎం తీసుకురాలేదన్నది పచ్చి నిజం. అలాగే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన తొలి ముఖ్యమంత్రి కూడా ఈయనే. ఇన్ని అభివృద్ది పనులు చేపట్టింది కూడా జగనే. వీటన్నిటి ఫలితమే ఐదేళ్ల పాలన తర్వాత స్వచ్ఛందంగా ప్రజలు ఆయనను చూడడానికి తరలివస్తున్నారు. దీనిని గమనించే చంద్రబాబు నాయుడు తాను కూడా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాదిరే చేస్తానని చెప్పవలసి వచ్చింది.

ఒకదఫా సీఎంగా జగన్‌ పాలనను.. డెబ్బై ఐదేళ్ల వృద్దుడు అయిన చంద్రబాబు తాను కూడా కొనసాగిస్తానని చెప్పడమే పెద్ద విజయం కాదని ఎవరైనా అనగలరా! వలంటీర్ల మొదలు, అమ్మ ఒడి వంటి స్కీముల వరకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డినే చంద్రబాబు ఫాలో అయ్యే పరిస్థితి రావడమే ఇందుకు నిదర్శనం. ఈ పరిస్థితిలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సానుభూతి కోసం నాటకాలు ఆడవలసిన అవసరం లేదని తేటతెల్లం అవుతోంది. టీడీపీ వారు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే వారి కంగాళీతనం బయటపడుతోందన్నమాట.

గత ఎన్నికల ప్రచారం సమయంలో విశాఖ ఎయిర్ పోర్టులో ఒక కత్తితో ఒక యువకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి చేశాడు. అప్పుడు కూడా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇప్పుడు అంతకన్నా పెద్ద ప్రమాదమే తప్పిందని అనుకోవాలి. ఎందుకంటే ఎయిర్ గన్ లేదా కాట్ బాల్ పంగలకర్ర వంటి దానితో రాయి లేదా పెల్లెట్ పెట్టి కొట్టి ఉండాలి. అందువల్లే అంత పదునుగా గాయం అయింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంటి పై భాగాన తగిలి గాయం అయింది. అదే పొరపాటున నవరగంత వద్ద తగిలి ఉంటే ఎంత ప్రమాదమో ఊహించుకోవడమే కష్టం. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఆయన ప్రాథమిక చికిత్స తీసుకుని మళ్లీ జనానికి అభివాదం చేస్తూ వెళ్లారు. జనం ఆయన బస్ వెంట పరుగులు తీస్తూ అన్నా.. ఆరోగ్యం జాగ్రత్త.. అని చెప్పారంటేనే ఆయనపై వారిలో ఎంత ప్రేమ ఏర్పడిందో తెలుస్తుంది. అంతగా ప్రజలతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కనెక్ట్ అయ్యారని అర్దం. సానుభూతి కోసం ఎవరైనా కన్ను పోగొట్టుకుంటారా? ప్రాణం పోగొట్టుకుంటారా? ఇంత నీచంగా మాట్లాడతారా?

2003లో చంద్రబాబు నాయుడు తిరుమల వెళుతుండగా, అలిపిరి వద్ద బాంబులు పేలాయి. ఆయన అదృష్టవశాత్తు బతికి బయటపడ్డారు. అప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా పరామర్శకు వెళ్లి, తిరుపతిలో ఈ దాడికి నిరసనగా దీక్ష చేశారు. ఆ రోజు ఆయన అంత హుందగా ఉంటే, ఈరోజున తెలుగుదేశం పార్టీ ఇంత ఘోరంగా వ్యవహరించింది. అప్పుడు అదంతా నక్సల్స్ పని అని పెద్ద ఎత్తున కథనాలు ఇచ్చారు కానీ, పోలీసుల నిర్లక్ష్యం అంటూ డైవర్ట్ చేసే యత్నం చేయలేదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం కానీ, ఆ పార్టీ మీడియా ఈనాడు, ఆంద్రజ్యోతి వంటివి మొత్తం నెపాన్ని పోలీసులపై నెట్టేసి, దుండగులను కాపాడే యత్నం చేయడం దుర్మార్గంగా కనిపిస్తుంది.

నిజానికి ఇలాంటి ఘటనలు సృష్టించడంలో కానీ, సానుభూతి డ్రామాలు ఆడడంలో కానీ టీడీపీకి ఉన్న అనుభవం తక్కువేమీ కాదు. అప్పట్లో ఎన్‌టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్‌పుడు ఎల్.బి స్టేడియంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఎన్‌టీఆర్‌పై మల్లెల బాబ్జి అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అదంతా చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన డ్రామా అని ప్రచారం జరిగింది. ఆ తర్వాత మల్లెల బాబ్జి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అలిపిరి బ్లాస్ట్ తర్వాత చాలా రోజులు చంద్రబాబు కట్టు కట్టుకుని తిరిగే వారు. సానుభూతి వస్తుందని అనుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆ క్రమంలో చంద్రబాబు ఒక్కోసారి ఒక్కో చేతికి కట్టు తగిలించుకుంటున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత రోశయ్య గమనించి, నిమ్స్ డాక్టర్‌లను ఉద్దేశించి చమత్కారంగా ఒక వ్యాఖ్య చేశారు. చంద్రబాబుకు పొరపాటున ఒక చేతికి బదులు మరో చేతికి కట్టు తగిలిస్తున్నారని అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు కట్టు లేకుండానే తిరిగారు.

ప్రజలలో అలజడి కోసం ఎలాంటి అశాంతి నైనా సృష్టించాలన్నది చంద్రబాబు విధానంగా ఉంటుందని పలువురు టీడీపీ నేతలు చెబుతుంటారు. మాజీ మంత్రి పరిటాల రవి హత్యకు గురైనప్పుడు జిల్లాలకు ఫోన్‌లు చేయించి బస్‌లు దగ్దం చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. బంద్ అంటే బస్‌ల అద్దాలు పగలకొట్టడమో, బస్‌లు దగ్ధం చేయడమో జరగకపోతే ఎలా అని.. ఈ చంద్రబాబు అంటారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన పుస్తకంలో కూడా ప్రస్తావించారు. అమిత్ షా పై టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. ప్రధాని మోదీ వచ్చినప్పుడు నల్ల బెలూన్లు సెక్యూరిటీకి విఘాతం కలిగించేలా ఎగురవేశారు. పుంగనూరు, ఆంగళ్లు వద్ద టీడీపీ కార్యకర్తలను దాడులు చేయాలని రెచ్చగొట్టారు. టీడీపీ కార్యకర్తలు పోలీసు వ్యాన్ దహనం చేయడమే కాకుండా, రాళ్లు విసరడంతో ఒక పోలీసు కానీస్టేబుల్ కన్ను కూడా పోయింది. ఇదంతా చంద్రబాబు నైజం అని అంతా తెలుసుకున్నారు.

రాజమండ్రి, కందుకూరు, గుంటూరులలో తన వల్ల తొక్కిసలాట జరిగి అనేక మంది తెలిసినా, మొత్తం పోలీసులపై తోసేసి చంద్రబాబు తప్పించుకున్నారు. ఆయన కుట్రదారుడిగా ముద్ర పొందినా, దానిని కనిపించనివ్వకుండా, రామోజీ, రాధాకృష్ణ వంటి మీడియా ప్రముఖులు కవర్ చేసేసి చాలా పవిత్రుడుగా చూపించే యత్నం చేస్తుంటారు. అయినా కొన్నిసార్లు దొరికిపోతుంటారు. అందుకు ఉదాహరణే తాజాగా రాళ్లతో కొట్టండి.. మసి చేయండి అని అన్న చంద్రబాబు వ్యాఖ్యల వీడియోలు. సోషల్ మీడియా రాబట్టి ఈ మాత్రం అయినా ప్రజలకు తెలుస్తోంది. లేకుంటే ఎల్లో మీడియా ప్రజలను ఎప్పటికి మోసం చేస్తూనే ఉండేది.

ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడిని పక్కదారి పట్టించడానికి టీడీపీ కూటమి ఏదైనా ప్లాన్ చేస్తుందా అన్న డౌటు కూడా చాలమందిలో ఉంది. అనుకున్నట్లే ఆదివారం సాయంత్రానికి తనపైన రాళ్లు పడ్డాయని చంద్రబాబు సీన్ సృష్టించారు. అది నిజమా? కాదా? అన్నది తేలవలసి ఉంటుంది. పవన్ కల్యాణ్‌పై కూడా దాడి జరిగిందని చంద్రబాబు చెప్పేశారు. తీరా చూస్తే పవన్ కల్యాణ్‌పై ఎలాంటి దాడి జరగలేదని స్పష్టం అయింది. దీనిని బట్టే వీరు ఎలా ప్రవర్తిస్తున్నది అర్థం కావడం లేదా! అందువల్ల వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులు అనండి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అనండి.. చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చాలా సంయమనంతో వ్యవహరించారు. తన నొప్పిని భరిస్తూ జనంతో మమేకం అయిన తీరు అభినందనీయం.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Advertisement
Advertisement