#MemanthaSiddham : జైత్రయాత్ర ఆరంభం  | Sakshi
Sakshi News home page

#MemanthaSiddham : జైత్రయాత్ర ఆరంభం 

Published Thu, Mar 28 2024 5:05 AM

CM Jagans election campaign with a bus trip from Idupulapaya - Sakshi

ఇడుపులపాయ నుంచి బస్సుయాత్రతో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార భేరి 

వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద తల్లి విజయమ్మతో కలిసి నివాళులు

సర్వమత ప్రార్థనల అనంతరం బస్సు యాత్రకు శ్రీకారం 

భారీగా కదలివచ్చిన నేతలు, కార్యకర్తలు, అభిమానుల 

హర్షధ్వానాల మధ్య యాత్ర ప్రారంభం

ప్రొద్దుటూరు వరకూ రహదారిపై కిలో మీటర్ల కొద్దీ బారులు తీరిన జనం 

అడుగడుగునా అపూర్వ ఆదరణతో ఆలస్యంగా సాగిన బస్సు యాత్ర 

మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: మండుటెండనూ లెక్క చేయకుండా కి.మీ. కొద్దీ రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనం.. నిప్పులు చిమ్ముతున్న సూరీడుతో పోటీపడుతూ చంటిబిడ్డలను చంకనేసుకుని బస్సు వెనుక పరుగులు తీసిన ఆడబిడ్డలు.. రోడ్డుకు ఇరువైపులా గ్రామాల్లో టెంట్‌లు వేసి వంటలు వండుకుని, సామూహికంగా భోజనాలు చేసి గంటల తరబడి నిరీక్షించిన ప్రజానీకం..! వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌ ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో తొలి­రోజు కనిపించిన దృశ్యాలు ఇవి.

సీఎం జగన్‌ నాయకత్వంపై ప్రజల్లో బలంగా నాటుకుపోయిన నమ్మకానికి ఈ దృశ్యాలు ప్రతీకగా నిలిచాయి.  వైఎస్సార్‌ జిల్లాలోని ఇడుపులపాయ నుంచి వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార భేరిని సీఎం జగన్‌ బుధవారం  మోగించారు. తాడేపల్లి నివాసం నుంచి ఉదయం 11.50 గంటలకు బయలుదేరిన సీఎం జగన్‌ ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్దకు మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకున్నారు. తన మాతృమూర్తి వైఎస్‌ విజయమ్మతో కలిసి వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు.

అనంతరం తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించి భారీ ఎత్తున తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల నినాదాల నడుమ బస్సు యాత్రను సీఎం జగన్‌ ప్రారంభించారు. ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి వద్దకు బస్సు యాత్ర చేరుకునే సరికి రోడ్డుకు ఇరువైపులా భారీ ఎత్తున జనం బారులు తీరారు. భారీ క్రేన్‌తో గజమాల వేసి సీఎం జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు.

 జనసంద్రమైన వేంపల్లి..
ప్రజలు భారీ ఎత్తున తరలిరావడంతో వేంపల్లి జనసంద్రంగా మారింది. వేంపల్లి అడ్డ రోడ్డు నుంచి హనుమాన్‌ సర్కిల్‌ వరకూ సీఎం జగన్‌ రోడ్‌ షో నిర్వహించారు. సీఎం జగన్‌ను చూడగానే అవ్వాతాతల నుంచి చిన్న పిల్లల వరకూ హర్షద్వానాలతో ఘనస్వాగతం పలికారు. హనుమాన్‌ సర్కిల్‌ వరకూ కి.మీ. కొద్దీ ఇసుకేస్తే రాలనంత స్థాయిలో రోడ్డుపై కిక్కిరిసిన జనం సీఎం జగన్‌ బస్సు యాత్రకు నీరాజనాలు పలికారు.

మండటెండను కూడా లెక్క చేయకుండా చంటిబి­డ్డలను ఎత్తుకుని బస్సు వెంట నడుస్తూ సీఎం జగన్‌ను చూసేందుకు పోటీప­డ్డారు. బస్సు యాత్ర సాగుతున్న రహదారికి ఇరువైపులా మారుమూల గ్రామాల ప్రజలు భారీ ఎత్తున రోడ్డుపైకి తరలివచ్చి టెంట్లు వేసుకుని, వంటలు వండుకుని, సామూహికంగా భోజనాలు చేస్తూ సీఎం జగన్‌ రాక కోసం గంటల కొద్దీ నిరీక్షించారు. బస్సు యాత్ర తమ వద్దకు చేరుకోగానే  సీఎం జగన్‌పై బంతిపూల వర్షం కురిపిస్తూ అడుగడుగునా నీరాజనాలు పలకడంతో యాత్ర ఆలస్యంగా ముందుకు సాగింది.

అమ్మ భావోద్వేగం...
పులివెందుల: ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభం సందర్భంగా వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రార్థన నిర్వహించిన వైఎస్‌ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. ‘నా బిడ్డను నీకే అప్పజెబుతున్నా దేవుడా..! నా బిడ్డ కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉన్నావు..! ప్రతి బాధలోనూ తోడుగా ఉన్నావు..! నా బిడ్డ తలపెట్టిన కార్యక్రమాలను జయప్రదం చేయాలి..! నా బిడ్డను మళ్లీ సీఎంగా చేయాలని కోరుకుంటున్నా..!’ అంటూ ప్రార్థన చేసిన అనంతరం సీఎం జగన్‌ను ఆప్యాయంగా ముద్దాడగా.. ఆయన భావోద్వేగంతో తన తల్లిని ఆలింగనం చేసుకున్నారు.

వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన వారిలో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, మేడా రఘునాథరెడ్డి, ఎంపీలు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, చింతా అనూరాధ, ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి, సుధాకర్‌బాబు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రమేష్‌యాదవ్, రామచంద్రారెడ్డి, ప్రభాకర్, తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షులు సురేష్‌ బాబు, జడ్పీ ఛైర్మన్‌ అమర్నాథరెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ సతీష్‌రెడ్డి, వైఎస్‌ కొండారెడ్డి, సీఎం కార్యాలయ కోఆర్డినేటర్‌ జనార్దన్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ రత్నాకర్‌ తదితరులున్నారు. 

జిల్లా చరిత్రలో అతి పెద్ద ప్రజాసభ..
ప్రొద్దుటూరులో బహిరంగ సభ షెడ్యూలు ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కావాలి. కానీ.. రహదారి పొడవునా జనం బారులు తీరి స్వాగతం పలకడంతో బైపాస్‌ రోడ్డు సమీపంలోని సభా ప్రాంగణానికి సాయంత్రం 6.30 గంటలకు సీఎం చేరు­కున్నారు. అప్పటికే 30 ఎకరాల్లో ఏర్పాటు చే­సి­న సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసి­పోయింది.

సీఎం జగన్‌ వేదికపైకి చేరుకుని ర్యాంప్‌ వాక్‌ చేస్తూ అభివాదం చేస్తున్నంత సేపు ప్రాంగణం ప్రజల హర్షధ్వానాలతో మారుమోగిపోయింది. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో చేసి­న మంచిని వివరిస్తూ.. టీడీపీ– జన­సేన–బీ­జేపీ కూటమి సర్కార్‌ 2014–19 మధ్య చేసిన మోసాలను ఎండగడుతూ సీఎం జగన్‌ చేసిన ప్రసంగానికి విశేష స్పందన లభించింది. ప్రొద్దుటూరులో సీఎం జగన్‌ నిర్వహించిన సభ వైఎస్సార్‌ కడప జిల్లా చరిత్రలో అతి పెద్ద ప్రజాసభగా నిలిచింది.

ప్రచండ భానుడితో పోటీపడుతూ..
నిప్పులు గక్కుతున్న సూరీడుతో పోటీపడుతూ సీఎం జగన్‌ కోసం రహదారిపై భారీ ఎత్తున జనం గంటల కొద్దీ నిలబడ్డారు. కమలాపురం నియోజకవర్గంలో వీరపునాయునిపల్లె, గంగిరెడ్డిపల్లి, సంగాలపల్లిలో బస్సు యాత్రకు  నీరాజనాలు పలికారు. మండల కేంద్రమైన వీరపునాయునిపల్లిలో సీఎం జగన్‌ నిర్వహించిన రోడ్‌ షోకు విశేష స్పందన లభించింది. జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్లలోని మెయిన్‌ రోడ్డు జనసంద్రంగా మారింది. ఎర్రగుంట్లలో సీఎం జగన్‌ నిర్వహించిన రోడ్‌ షో సూపర్‌ హిట్‌ అయ్యింది.

రాత్రి పూట జన నీరాజనం..
ప్రొద్దుటూరు సభ రాత్రి 8 గంటలకు ముగిసింది. అనంతరం బస్సు యాత్ర మైదుకూరు నియోజకవర్గం దువ్వూరుకు చేరుకునే సమయంలో దారిలో రాత్రి పూట కూడా జనం భారీ ఎత్తున రహదారిపై గంటల తరబడి నిరీక్షించారు. సీఎం జగన్‌పై బంతి పూలవర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు.

వైఎస్సార్‌ కడప జిల్లాలో బస్సు యాత్ర ముగిసి బుధవారం రాత్రి 9.20 గంటలకు నంద్యాల జిల్లా చాగలమర్రిలో ప్రవేశించింది. చాగలమర్రిలో జనం సీఎం జగన్‌కు నీరాజనాలు పలికారు. దారి పొడవునా ఘనస్వాగతాల నడుమ ఆళ్లగడ్డ క్రాస్‌లో బస చేసేందుకు ఏర్పాటు చేసిన శిబిరానికి రాత్రి 10 గంటలకు చేరుకున్నారు. బస్సు యాత్ర తొలి రోజు గ్రాండ్‌ సక్సెస్‌ కావడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నయా జోష్‌ నెలకొంది.

నేడు నంద్యాలలో సీఎం జగన్‌ సభ
ఆళ్లగడ్డ నుంచి రెండో రోజు మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభం
సాక్షి, అమరావతి: మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజైన గురువారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నైట్‌ హాల్ట్‌ ప్రాంతం నుంచి ప్రారంభంకానుంది. యాత్ర గురు వారం షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. ఉదయం 9 గంటలకు ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి నల్లగట్ల, బత్తలూరు, ఎర్రగుంట్ల చేరుకొని గ్రామ స్థులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొంటారు.

అనంతరం గోవిందపల్లి మీదుగా ప్రయాణించి చాబోలు శివారులో భోజన విరామం తీసుకుంటారు. తర్వాత నూనేపల్లి మీదుగా నంద్యాల చేరుకుని గవర్నమెంట్‌ ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సే­నా­పురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్నకొట్టాల, కె.మార్కాపురం క్రాస్, నాగలాపురంలో ప్రజలతో మమేక­మవుతూ పెంచికలపాడులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.  

Advertisement
Advertisement