లండన్‌లో మరో భారతీయ విద్యార్థిని దుర్మరణం | Sakshi
Sakshi News home page

లండన్‌లో మరో భారతీయ విద్యార్థిని దుర్మరణం

Published Mon, Mar 25 2024 10:13 AM

Indian PHD Student Cheistha Kochhar passed away tragically Accident at London - Sakshi

లండన్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని చేసితా కొచర్‌ దుర్మరణం పాలయ్యారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో  పీహెచ్‌డీ చేస్తున్నకొచర్‌ వర్శిటీ నుంచి తిరిగి వెళుతూండగా ప్రమాదానికి గురయ్యారు. సైకిల్‌పై వెళుతూండగా ట్రక్‌ ఒకటి ఆమెను బలంగా ఢీకొంది. దీంతో కోచర్‌ అక్కడికక్కడే మరణించారు. కోచర్‌ భర్త ప్రశాంత్‌ ఆమెను రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. చేసితా ఆకస్మిక మరణంపై ఆమె తండ్రి, విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎస్‌పీ కోచర్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చేసితా మరణం కుటుంబంతోపాటు స్నేహితులను కూడా విషాదంలోకి నెట్టేసిందని ఆయన వ్యాఖ్యానించారు. అత్యంత ప్రతిభావంతురాలైన చేసితా మరణంపై సన్నిహితులు, సహవిద్యార్థులు కూడా సంతాపం వ్యక్తం చేశారు.

నీతీ ఆయోగ్‌ మాజీ సీఈవో అమితాబ్‌ కూడా కొచర్‌తో తన అనుబంధాన్ని ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పంచుకున్నారు. కొచర్‌ అకాల మరణంపై  సంతాపం ప్రకటించిన ఆయన ఆమె నీతి ఆయోగ్‌లో తనతో కలిసి పనిచేశారని, ధైర్యవంతురాలని  గుర్తు చేసుకున్నారు. 

ఢిల్లీ యూనివర్సిటీ, అశోకా యూనివర్సిటీ, పెన్సిల్వేనియా, చికాగో యూనివర్సిటీల్లో పలు కోర్సులు చేసిన చేసితా కోచర్‌ 2021-23 మధ్య కాలంలో నీతి ఆయోగ్‌లోని నేషనల్ బిహేవియరల్ ఇన్‌సైట్స్ యూనిట్ ఆఫ్ ఇండియాలో సీనియర్ అడ్వైజర్‌గా పనిచేశారు. అంతేకాదు ఆధార్‌ ప్రాజెక్టు వ్యవస్థాపక బృందంలో ఒకరు కూడా సెంటర్ ఫర్ సోషల్ అండ్ బిహేవియర్ చేంజ్‌లో పని చేస్తూండగా బిల్ అండ్‌  మిలిండా గేట్స్ ఫౌండేషన్‌తో కూడా కలిసి పనిచేశారు. ఆర్గనైజేషనల్బిహేవియర్ మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీకోసం గత ఏడాది సెప్టెంబరులోనే లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో చేరారు. నాలుగేళ్ల ఈ పీహెచ్‌డీ కోర్సుకు పూర్తిస్థాయి స్కాలర్‌షిప్‌ లభించడం  గమనార్హం. 

ఫీడ్‌ ఇండియా బిజినెస్‌ 
చదువులో కొచర్‌ ఎపుడూ టాపర్‌.  గణితం, ఎకానమిక్స్‌ అంటే చాలా ఇష్టం.  ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకునే సమయంలో తొలి బిజినెస్‌ ‘ఫీడ్ ఇండియా’ను ప్రారంభించింది. విశ్వవిద్యాలయ క్యాంటీన్లలో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి నామమాత్రపు ధరకు విక్రయించేది. తద్వారా క్యాంటీన్లలో వృథా అవుతున్న ఆహారాన్ని సద్వినియోగం చేయడంతోపాటు... పేద మహిళలు వంట చేసుకునే శ్రమను తగ్గించి ఎక్కువ సమయం పనిచేసి మరింత సంపాదించుకునేలా చేసింది. ఈ వ్యాపారాన్ని కొనసాగించాలని చేసితా అనుకున్నా.. కుటుంబ సభ్యుల సూచనల మేరకు చదువులు పూర్తి చేయాలన్న దిశగా అడుగులు వేసింది.  కానీ ఆమె కలలు, ఆశయాలు నెరవేరకుండానే ఈ లోకాన్ని వీడడం విషాదం.

Advertisement
 
Advertisement
 
Advertisement