గెలుపుపై ధీమా | Sakshi
Sakshi News home page

గెలుపుపై ధీమా

Published Wed, May 15 2024 8:45 AM

గెలుప

సాక్షి, ఆదిలాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఇన్ని రోజుల పాటు ప్రచారంలో బిజీబిజీగా గడిపిన అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు సేద తీరారు. బూత్‌ల వారీగా పార్టీకి పోలైన ఓట్ల విషయంలో నియోజకవర్గం వారీగా విశ్లేషణ సాగుతోంది. వాటి ఆధారంగా తమ పార్టీ ఆయా నియోజకవర్గాల్లో లీడ్‌లో ఉందని, మరికొన్ని చోట్ల ప్రత్యర్థి పార్టీతో పోటాపోటీగా ఉందని చెబుతున్నారు. ఈ లెక్కన ఎవరి అంచనాలు వారు వ్యక్తం చేస్తున్నారు. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ రోజు పార్టీల భవితవ్యం తేలిపోనుంది.

ఎవరి ధీమా వారిదే..

ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆసిఫాబాద్‌ మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఓటర్లు కమలం పార్టీకే పట్టం కట్టారని విశ్లేషిస్తున్నారు. ఆసిఫాబాద్‌లో ప్రత్యర్థి పార్టీలతో పోటీ ఉందని పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్‌ పరిధిలో ఒకే ఒక స్థానం ఖానాపూర్‌లో గెలిచి మొత్తంగా బీఆర్‌ఎస్‌, బీజేపీల కంటే 2లక్షల ఓట్లు వెనుకబడ్డ తాము ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ లోటును భర్తీ చేసుకోవడమే కాకుండా అదనంగా ఓట్లు సాధించి గెలుపు వాకిట్లో ఉన్నామని కాంగ్రెస్‌ ఢంకా బజాయించి చెబుతోంది. ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌, బోథ్‌ నియోజకవర్గాల్లో తమకు లీడ్‌ వస్తుందని బీఆర్‌ఎస్‌ అంటోంది. మిగతా నియోజకవర్గాల్లోనూ ఫైట్‌ ఇచ్చామని పేర్కొంటున్నారు. కొద్దిపాటి మెజార్టీతో తమ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇదీ పరిస్థితి..

● అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ ఆదిలాబాద్‌, నిర్మల్‌, ముధోల్‌, సిర్పూర్‌ నియోజకవర్గాల్లో గెలుపొందింది. ఈ ఎన్ని కల పరంగా ఆయా నియోజకవర్గాల్లో పో లింగ్‌ శాతం పరిశీలిస్తే పార్లమెంట్‌ సెగ్మెంట్‌లో ముధోల్‌ రెండో స్థానంలో, ఆదిలాబాద్‌ నాలుగో స్థానం, నిర్మల్‌ ఆరో స్థానం, సిర్పూర్‌ ఏడో స్థానంలో నిలిచాయి.

●శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆసిఫాబాద్‌, బోథ్‌ నియోజకవర్గాల్లో గెలుపొందింది. ఈ నియోజకవర్గాల్లో ఈ పార్లమెంట్‌ ఎన్నికల పరంగా పోలింగ్‌ శాతాన్ని పరిశీ లిస్తే.. ఈ మొత్తం సెగ్మెంట్‌లోనే బోథ్‌ అధిక పోలింగ్‌ శాతంతో మొదటి స్థానంలో నిలుస్తుంది. ఆసిఫాబాద్‌ మూడో స్థానంలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు బీఆర్‌ఎస్‌కు తోడ్పడినట్టే ఈ ఎన్నికల్లో ఆదరించా రో.. లేదో అనేది ఫలితాల రోజే తేలనుంది.

● అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్‌ నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్‌ గెలిచింది. ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పరంగా సెగ్మెంట్‌లో ఐదో స్థానంలో నిలిచింది. ఇది హస్తం పార్టీకి ఎంత మేరకు ఉపయుక్తంగా ఉంటుందో తేలాల్సి ఉంది.

అప్పుడు.. ఇప్పుడు

2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో 14లక్షల 88వేల 353 ఓట్లకు గాను 10లక్షల 62వేల 895 ఓట్లు పోలయ్యాయి. అప్పుడు 71.41 పోలింగ్‌ శాతం నమోదైంది. ఈసారి 1లక్ష 61వేల 822 కొత్త ఓటర్లు నమోదయ్యారు. ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో 74.03 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ లెక్కన కొత్త ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గుచూపారనేది ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ ఎన్నికల్లో పురుషులు, మహిళల మొత్తం ఓట్లలో పోలైన ఓట్ల పరంగా శాతంలో కొంత పురుష ఆధిక్యం ఉంది. అయితే సంఖ్యా పరంగా మహిళా ఓటర్లు అధికంగా ఓట్లు వేశారు. ఈ లెక్కన వారి ఆదరణ కూడా ఎవరికి దక్కిందనేది ఈ ఎన్నికల్లో విజయానికి కీలకం కానుంది.

ఎవరి అంచనాలు వారివే

పోలింగ్‌ సరళిపై పార్టీల్లో మొదలైన విశ్లేషణ

లక్ష మెజార్టీ సాధిస్తామంటున్న బీజేపీ

గెలుపు ఖాయమంటున్న కాంగ్రెస్‌

ఆ లీడ్‌ కలిసివస్తుందంటున్న బీఆర్‌ఎస్‌

జూన్‌ 4న తేలనున్న భవితవ్యం

పార్లమెంట్‌ నియోజకవర్గ పోలింగ్‌ వివరాలు

మొత్తం ఓటర్లు : 16,50,175

పోలైన ఓట్లు: 12,21,563 (74.03 శాతం)

పురుష ఓటర్లు: 8,04,875

పోలైన ఓట్లు: 5,99,108 (74.43 శాతం)

మొత్తం మహిళా ఓటర్లు : 8,45,213

పోలైన ఓట్లు : 6,22,420 (73.64 శాతం)

ఇతరులు: 87

పోలైన ఓట్లు: 35 (40.23 శాతం)

నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ శాతం..

సిర్పూర్‌ : 71.56

ఆసిఫాబాద్‌ : 75.49

ఖానాపూర్‌ : 72.20

ఆదిలాబాద్‌ : 73.89

బోథ్‌ : 78.16

నిర్మల్‌ : 71.68

ముధోల్‌ : 75.63

గెలుపుపై ధీమా
1/2

గెలుపుపై ధీమా

గెలుపుపై ధీమా
2/2

గెలుపుపై ధీమా

Advertisement
 
Advertisement
 
Advertisement