Cyclone Asani: IMD Warns Andaman Nicobar Islands Over Heavy Rainfalls, Details Inside - Sakshi
Sakshi News home page

Cyclone Asani Update: దూసుకోస్తున్న 'అసని తుపాను'...భారీ నుంచి అతి భారీ వర్షాలు

Published Sun, Mar 20 2022 5:41 PM

IMDC Warning Cyclone Asani Approach Andaman Nicobar Islands - Sakshi

న్యూఢిల్లీ: ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరో 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) ఆదివారం తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా మారే క్రమంలో తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయని వెల్లడించింది.  దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా కదులుతున్న అల్ప పీడనం తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ మరింతగా బలపడింది. ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతంలో వాయుగుండంగా మారనుంది.

దీని ప్రభావం అండమాన్ నికోబార్ దీవులపై అధికంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అక్కడ బలమైన ఈదురుగాలులు, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తుఫాను బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ వైపు కదులుతుందని గత వారం ఐఎండీ అంచనా వేసింది. ఏదేమైనా తుపాన్ ప్రభావం తూర్పు, ఈశాన్య భారతంపై ఉండే అవకాశం కనిపిస్తోంది.  అండమాన్ నికోబార్ దీవులలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా.

ఇది మార్చి 20న అల్ప పీడనంగా మారి..మార్చి 21వ తేదీన 'అసని' తుఫానుగా రూపాంతరం చెందుతుందని అధికారులు పేర్కొన్నారు. మత్స్యకారులు మార్చి 22 వరకు బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్  నికోబార్ దీవులతో పాటు తూర్పు-మధ్య ఈశాన్య బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని వాతావారణ శాఖ సూచించింది. అండమాన్ నికోబార్ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నారాయణ్ తుఫాను దృష్ట్యా మార్చి 22 వరకు - నాలుగు రోజుల పాటు అన్ని పర్యాటక కార్యకలాపాలను నిలిపివేశారు.

(చదవండి: దేశంలోనే ఫస్ట్.. కేజ్రీవాల్‌ సంచలన నిర్ణయం.. అది జరిగితే..)

Advertisement
 
Advertisement
 
Advertisement