ఢిల్లీ: ఉత్తరాదిలో వర్షాలు కాస్త తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పుంజుకున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలు పలు రాష్ట్రాలను మళ్లీ వణికిస్తున్నాయి. ఇప్పటివరకు సంభవించిన వరదల భీబత్సం నుంచి తేరుకోకముందే మరోమారు ముప్పు పొంచి ఉంది. నిన్న రాత్రి ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో వానలు దంచికొట్టాయి. దీంతో ప్రయాగ్‌రాజ్ వద్ద గంగా, యమునా నది ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. వర్షాలకు తోటు రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి.
ఉత్తరప్రదేశ్‌లో గంగ, యమునా నది ప్రవాహం ఉద్దృతంగా ప్రవహిస్తోంది. ఫఫమౌ వద్ద గంగా నది ప్రవాహం 11 సెంటీమీటర్ల నుంచి 24 సెంటీమీటర్ల వరకు పెరిగిపోయింది. నైనీ వద్ద యమునా నది 29 సెంటీమీటర్ల మేర పెరిగింది. ఉత్తరఖండ్‌లో చమోలీ జిల్లాలో జాతీయ రహదారి 7పై కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షాలతో రాష్ట్రంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. అటు అసోంలోనూ వరదలు సంభవించాయి. దాదాపు 47 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. 32,400 మంది ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారు.
గత 24 గంటల్లో కురిసిన వర్షాలకు ఉత్తరప్రదేశ్‌లో 10 మంది వరకు మరణించారు. పంజాబ్, హర్యానాల్లో వర్షాలకు దాదాపు 55 మంది మృతి చెందినట్లు సమాచారం. ఇక వరదలతో అతలాకుతలం అయిన హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికే రూ.8000 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
గత మూడు రోజులుగా యమునా నది ప్రవాహం పెరగడంతో ఢిల్లీ వణికిపోయింది. ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగుపడినా ఇంకా కొన్ని ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. త్రాగునీటి వ్యవస్థ, విద్యుత్ సరఫరాకు ఇంకా కొన్ని ప్రాంతాల్లో అంతరాయం కొనసాగుతోంది. మళ్లీ ఇప్పుడు వర్షాల రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాజ్‌ఘాట్ నుంచి నిజాముద్దీన్ మార్గంలో ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఐపీ ఫ్లైఓవర్ రింగ్ రోడ్డు కాకుండా వేరే మార్గంలో రావాలని వాహనదారులకు సూచనలు చేస్తున్నారు పోలీసులు.
ఇదీ చదవండి: వరద గుప్పిట ఉండగానే మళ్లీ అందుకున్న భారీ వర్షం.. ఢిల్లీలో స్తంభించిన జనజీవనం
Comments
Please login to add a commentAdd a comment