హీరోల్‌.. ఫర్‌ ఎ చేంజ్‌ కథానాయకులుగా  | Sakshi
Sakshi News home page

హీరోల్‌.. ఫర్‌ ఎ చేంజ్‌ కథానాయకులుగా 

Published Wed, Apr 24 2024 4:35 AM

Tollywood comedians who turn into heroes - Sakshi

హస్య నటులు, ప్రతినాయకులు, సహాయ నటులుగా కనిపించి, ఆకట్టుకునే నటులు ఫర్‌ ఎ చేంజ్‌ కథానాయకులుగా కనిపిస్తే ఆ సినిమాకి కావాల్సినంత క్రేజ్‌ ఏర్పడుతుంది. ఆ నటులకు కూడా రొటీన్‌ క్యారెక్టర్స్‌ నుంచి కాస్త మార్పు దక్కుతుంది. ఎక్కువగా కమెడియన్లు, విలన్లు, క్యారెక్టర్లు ఆర్టిస్టులుగా చేసే ఆ నటులు ఇప్పుడు హీ‘రోల్‌’లో కనిపించనున్నారు. ఆ ‘హీరో’ల్‌ చేస్తున్న చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. 

తొలిసారి నేపాలీ భాషలో... 
తెలుగు పరిశ్రమలో హాస్యబ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. దాదాపు నలభై ఏళ్లుగా తనదైన హాస్యంతో ప్రేక్షకులను నవ్విస్తున్న ఆయన అడపాదడపా హీరోగానూ చేశారు. ‘బాబాయ్‌ హోటల్‌’ (1992), ‘జోకర్‌ మామ సూపర్‌ అల్లుడు’ (1992) వంటి చిత్రాల్లో సోలో హీరోగా చేసిన బ్రహ్మానందం ‘సూపర్‌ హీరోస్‌’ (1997), ‘హ్యాండ్సప్‌’ (2020) వంటి మరికొన్ని చిత్రాల్లో ఓ హీరోగా నటించారు. తాజాగా ‘హ్రశ్వ దీర్ఘ’ చిత్రంలో ఆయన ఓ లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. చంద్ర పంత్‌ దర్శకత్వంలో తెలుగు, నేపాలీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. బ్రహ్మానందం నటిస్తున్న ఈ తొలి నేపాలీ చిత్రం  సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ కానుంది.  

ఆరు పదులలో ప్రేమ 
ఆరు పదుల వయసులో ప్రేమలో పడ్డారు రాజేంద్రప్రసాద్, జయప్రద. ఈ ఇద్దరూ జంటగా నటించిన చిత్రం ‘లవ్ః65’. వీఎన్‌ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్‌ ఆ మధ్య విడుదలైంది. ‘ఈ ప్రపంచాన్నే బహిష్కరిద్దాం’ (రాజేంద్ర ప్రసాద్‌), ‘నాకోసం ఏడ్చింది నువ్వు ఒక్కడివే’ (జయప్రద) వంటి డైలాగులు టీజర్‌లో ఉన్నాయి. త్వరలో ఈ చిత్రం రిలీజ్‌ రానుంది.

వినోదాల సుబ్రమణ్యం 
కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా రావు రమేశ్‌ ఏ రేంజ్‌లో విజృంభిస్తారో వెండితెరపై చూస్తుంటాం. ‘మారుతినగర్‌ సుబ్రమణ్యం’ చిత్రంలో తొలిసారి ఆయన హీరోగా కనిపించనున్నారు. లక్ష్మణ్‌ కార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రావు రమేశ్‌ సరసన ఇంద్రజ నటించారు. పూర్తి స్థాయి వినోదంతో, భావోద్వేగాలతో రూపొందిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది.   

మధ్యవయస్కుడి కథ 
తెలుగులో దాదాపు 36 ఏళ్లుగా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మెప్పిస్తున్నారు రాజా రవీంద్ర. పలు చిత్రాల్లో లీడ్‌ రోల్స్‌లోనూ నటించిన ఆయన తాజాగా ‘సారంగదరియా’ సినిమాలో లీడ్‌ రోల్‌ చేశారు. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. మధ్యవయస్కుడైన ఓ వ్యక్తి పరువుగా బతికితే చాలనుకుంటాడు. అయితే అతనికి తన కొడుకులు, కూతురు వల్ల సమాజం నిలదీసే పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు అతను ఏం చేశాడు? అనే కథాంశంతో ‘సారంగదరియా’ చిత్రం రూపొందింది. మేలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. 

తండ్రి విలువ తెలిపేలా... 
తెలుగులో శివాజీ రాజాది మూడు దశాబ్దాలకు పైగా ప్రయాణం. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, హీరోగా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారాయన. ఇటీవల సినిమాలకు కొంచెం గ్యాప్‌ ఇచ్చిన శివాజీ రాజా ‘నాన్నా మళ్లీ రావా..!’లో లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. ఆయనకు జోడీగా ప్రభావతి నటిస్తున్నారు. నిర్దేష్‌ దర్శకుడు. మనసుని హత్తుకునే బలమైన సెంటిమెంట్, భావోద్వేగాల నేపథ్యంలో తండ్రి విలువ తెలిపేలా ఈ చిత్రం రూపొందుతోంది.  

మ్యూజిక్‌ షాప్‌లో... 
‘ప్రస్థానం’ (2010) సినిమాతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ప్రస్థానం మొదలుపెట్టారు అజయ్‌ ఘోష్‌. కమెడియన్, విలన్, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌.. ఇలా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నటించి, మెప్పించారాయన. తాజాగా ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’లో హీరోగా చేశారు. శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో రిలీజ్‌ కానుంది. మన జీవితాల్లో మనం ఏం కోల్పోయి ఏ స్థితిలో ఉన్నామో చూపించేలా ఈ చిత్రం ఉంటుందని యూనిట్‌ పేర్కొంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement