కరెన్సీ నగర్ సినిమా రివ్యూ.. ఎలా ఉందంటే? | Sakshi
Sakshi News home page

Currency Nagar Telugu Movie Review: కరెన్సీ నగర్ సినిమా రివ్యూ.. ఎలా ఉందంటే?

Published Fri, Dec 29 2023 8:04 PM

Currency Nagar Telugu Movie Review - Sakshi

టైటిల్: కరెన్సీ నగర్
నటీనటులు: యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని , సుదర్శన్, గౌతమ్
నిర్మాత సంస్థ: ఉన్నతి ఆర్ట్స్
నిర్మాతలు: ముక్కాముల అప్పారావు , డా కోడూరు గోపాల కృష్ణ
దర్శకుడు: వెన్నెల కుమార్ పోతేపల్లి 
సంగీతం: సిద్ధార్థ్ సదాశివుని
ఎడిటర్: కార్తిక్ 
సినిమాటోగ్రఫీ: సతీష్
విడుదల తేదీ: 2023 డిసెంబర్ 29

యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని , సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కరెన్సీ నగర్ . ఈ సినిమా ద్వారా వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఉన్నతి ఆర్ట్స్ బ్యానర్‌పై ముక్కాముల అప్పారావు , డా కోడూరు గోపాల కృష్ణ నిర్మించారు. ఆంతాలజీ థ్రిల్లర్ నేపథ్యంలో డిసెంబర్ 29న థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

అసలు కథేంటంటే..

సత్య (సుదర్శన్)కు ఐదు లక్షల రూపాయలు అవసరం అవుతాయి. దొంగతనం చేసి అయినా సరే డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఒక చోట బంగారం ఉందని తెలుసుకున్న సత్య అక్కడికి వెళతాడు. అక్కడ సత్యకు ఒక విచిత్రమైన సంఘటన ఎదురవుతుంది. మాట్లాడే ఒక ఇనుప పెట్టలో బంగారం ఉంటుంది, ఆ బంగారం తీసుకోవాలనే క్రమంలో ఇనుము పెట్ట సత్యతో మూడు కథలు చెబుతుంది. అందులో మొదటి కథ మానవ సంబంధాల గురించి, రెండో కథ ప్రేమ , మోసం గురించి, మూడో కథ అమ్మాయి ప్రేమను దక్కించుకోవడం కోసం అబ్బాయి చేసే తప్పులు.. ఇలా మూడు కథలు విన్న తరువాత సత్య ఏం చేశాడు ? అతను అసలు అక్కడికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అతనికి కావాల్సిన ఐదు లక్షలు దొరికాయా ? నిజంగానే ఇనపెట్టే మాట్లాడిందా ? వంటి విషయాలు తెలియాలంటే కరెన్సీ నగర్ సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
దర్శకుడు వెన్నెల కుమార్ పోతేపల్లి తాను తీసిన మొదటి సినిమానే అయినా చాలా అద్భుతంగా తీశాడు. తాను రాసుకున్న కథను తెరమీద చక్కగా చూపించాడు. కేశవ ,చాందిని ఎపిసోడ్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. మొదటి కథ పెయిన్‌లో అమ్మ క్యారెక్టర్ చిన్నది అయినా బాగా వర్కవుట్ అయింది. ప్రీ క్లైమాక్స్ సినిమాకు ప్లస్ అయింది. క్లైమాక్స్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. 

ఇలాంటి కథ, కథనాలతో థియేటర్‌కు వచ్చిన మొదటి సినిమాగా కరెన్సీ నగర్‌ అని చెప్పొచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా దర్శకుడు వెన్నెల కుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా చూస్తుంటే మన చిన్నప్పుడు చదివిన బేతాళ కథలు గుర్తుకు వస్తాయి. కానీ కథలు మాత్రం చాలా కొత్తగా ఉన్నాయి. తెరమీద చూసి అనుభూతి చెందాల్సిన సినిమా కరెన్సీ నగర్.

ఎవరెలా చేశారంటే... 

యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని , సుదర్శన్, గౌతమ్ వారి పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. సాంకేతికత విషయానికొస్తే సినిమా టెక్నికల్ వ్యాల్యూస్ బాగున్నాయి. నిర్మాతలు ముక్కాముల అప్పారావు , డా కోడూరు గోపాల కృష్ణ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. సిద్ధార్థ్ సదాశివుని సంగీతం బాగుంది. కార్తిక్ తన కత్తెరకు ఇంకాస్తా పని చెప్పాల్సింది. సతీశ్ సినిమాటోగ్రఫీ ఫరవాలేదు.

Advertisement
 
Advertisement
 
Advertisement