సమస్యలపై దద్దరిల్లిన కౌన్సిల్‌ | Sakshi
Sakshi News home page

సమస్యలపై దద్దరిల్లిన కౌన్సిల్‌

Published Tue, Jun 27 2023 1:10 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలపై అధికారులను కౌన్సిలర్లు నిలదీయడంతో కౌన్సిల్‌ దద్దరిల్లింది. సోమవారం మధ్యాహ్నం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో అత్యవసర సమావేశం జరిగింది. చాలా వార్డుల్లో మిషన్‌ భగీరథ పథకం తాగునీరు సరిపోవడం లేదని, వీధిలైట్లు 24 గంటల పాటు వెలుగుతున్నాయని కౌన్సిలర్లు ఏకరువు పెట్టారు. వర్షాకాలం ఆరంభమైనందున పారిశుద్ధంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎజెండాలోని వివిధ అంశాలపై వాడివేడీగా చర్చ సాగింది. ముందుగా 32వ వార్డు కౌన్సిలర్‌ సాదతుల్లా మాట్లాడుతూ చాలా గల్లీలలో వీధి దీపాలు, ముఖ్య కూడళ్లలో హైమాస్ట్‌ లైట్లు సరిగా పనిచేయడం లేదన్నారు. దోమల బెడద ఎక్కువగా ఉందని రసాయన మందులు పిచికారీ చేయించాలన్నారు. ఇవే విషయాలను 19వ వార్డు కౌన్సిలర్‌ షబ్బీర్‌ అహ్మద్‌ ప్రస్తావించారు. అంబేడ్కర్‌ చౌరస్తా సమీపంలోని ఎక్స్‌పో–ప్లాజా తొలగించినందున అక్కడి సామగ్రిని మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోవాలన్నారు.

24వ వార్డు కౌన్సిలర్‌ అబ్దుల్‌ రషీద్‌ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతం రామయ్యబౌలిలో వర్షపు నీరు నిల్వకుండా చూడాలన్నారు. బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ అంజయ్య మాట్లాడుతూ కాంట్రాక్టు పనులు అన్ని మహిళా సంఘాల గ్రూపులకు ఇవ్వాలన్నారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తికాకుండానే దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు అందరినీ ఆహ్వానించాలన్నారు. అప్పన్నపల్లిలో రెండో ఆర్‌ఓబీ ప్రారంభమైనందున కింది భాగంలో అటు, ఇటువైపు వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు.

వీధుల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, అంతర్గత రోడ్లు దెబ్బ తిన్నాయని 21, 37వ వార్డు కౌన్సిలర్లు అనంతరెడ్డి, స్వప్న సమావేశం దృష్టికి తెచ్చారు. కొందరు ఇంటి యజమానులు రోడ్డును ఆనుకొని ర్యాంపులు నిర్మించడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, వాటిని తొలగించాలని 13, 21వ వార్డు కౌన్సిలర్లు లక్ష్మీదేవి, అనంతరెడ్డి డిమాండ్‌ చేశారు. పెద్దనాలాలలో మురుగును ఎప్పటికప్పుడు తొలగించాలని 33, 34వ వార్డు కౌన్సిలర్లు మునీరుద్దీన్‌, నర్సింహులు కోరారు. కొందరు వ్యక్తులు వాహనాల్లో కోయిల్‌కొండ ఎక్స్‌రోడ్డు సమీపంలో అర్ధరాత్రి చికెన్‌ వ్యర్థ పదార్థాలను పడేసిపోతున్నారని సభ దృష్టికి తెచ్చారు. వీరితో పాటు కౌన్సిలర్లు సంధ్య, శ్రీనివాసులు, ముస్కాన్‌ సుల్తానా, రామాంజనేయులు తమ వార్డుల్లోని సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు.
వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం..  – చైర్మన్‌, కమిషనర్‌

సభ్యులు ప్రస్తావించిన ఈ సమస్యలను వీలైనంతవరకు పరిష్కరిస్తామని మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, కమిషనర్‌ డి.ప్రదీప్‌కుమార్‌ బదులిచ్చారు. పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని, అందుకు అందరూ సహకరించాలన్నారు. ఇదిలా ఉండగా ఎజెండాలోని కొన్ని పద్దుల్లో తప్పులు దొర్లడంతో అధికారులపై చైర్మన్‌ మండిపడ్డారు. ఇక ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో వైస్‌చైర్మన్‌ తాటి గణేష్‌కుమార్‌, టీపీఓ లక్ష్మీపతి, డిప్యూటీ ఈఈ బెంజిమన్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు రవీందర్‌రెడ్డి, గురులింగం, ఏఓ ఉమాకాంత్‌, ఆర్‌ఓ నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement