ఖమ్మంక్రైం: పెళ్లికూతురు ఇంట్లో భోజనాలు సరిగా పెట్టలేదని, మాంసం వడ్డించలేదని.. మర్యాద సరి గ్గా చేయలేదని గొడవలు జరుగుతుంటాయి. కానీ టీ పోయలేదని ఇరువర్గాలు గొడవ పడ్డ ఘటన సోమవారం వెలుగుచూసింది. ఖమ్మం ప్రకాష్‌నగర్ ప్రాంతానికి చెందిన యువతికి చెరువుబజార్‌కు చెందిన యువకుడితో ఈనెల 21న ఆదివారం రెడ్డిపల్లిలో వివాహం జరగాల్సి ఉంది. దీంతో శనివారం సాయంత్రం పెళ్లి కూతురి ఇంటి వద్ద పూజలకు పెళ్లికొడుకు తరఫు బంధువులు వెళ్లారు. అయితే, అక్కడ వారికి టీ పోయలేదని చిన్నబుచ్చుకుని మనసులో పెట్టుకున్నారు. అనంతరం అందరూ భోజనా లు చేశాక ఊరేగింపులో నృత్యాలు చేస్తున్నారు. ఆ సమయంలోనే సాయంత్రం తమకు టీ పోయలేదని, మర్యాద చేయడం రాదంటూ వరుడి తరఫు వారు పేర్కొనగా.. ప్రతిగా వధువు బంధువులు ‘టీ ఎందుకు.. ఏకంగా మందు పోశాం.. భోజనాలు కూడా పెట్టాం’ అని వాగ్వాదానికి దిగడంతో పరస్పరం దాడి చేసుకుంటూ బీరు సీసాలతో కొట్టుకోగా ఇద్దరి తలలు పగిలి నలుగురి గాయాలయ్యాయి. చివరకు ఖమ్మం త్రీటౌన్ పోలీసులు చేరుకుని సర్దిచెప్పేందుకు యత్నించగా వారి ముందు కూడా కర్రలతో కొట్టుకుపోవడంతో పోలీసులు చేసేదేం లేక వెళ్లిపోయారు. కాగా, ఆదివారం పెళ్లి ఎలా జరుగుతుందో, ఏదైనా గొడవ జరుగుతుందా అని అంతా ఆందోళనకు గురికాగా ఇరువైపుల పెద్దలు సర్దిచెప్పటంతో ప్రశాంతంగా వేడుక ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
గొడవలో ఇరువర్గాల వారికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment