వీళ్లూ భారతీయులే..! | Sakshi
Sakshi News home page

వీళ్లూ భారతీయులే..!

Published Sat, Dec 16 2023 12:54 AM

- - Sakshi

శివాజీనగర: కర్ణాటకలోని ఉత్తర కన్నడ, బెళగావి, ధార్వాడ్‌ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు మొదటిసారి వెళ్లినవారికి ‘మనం భారత్‌లో ఉన్నామా ఆఫ్రికాలోనా’ అన్న సందేహం వస్తుంది. ఎందుకంటే అక్కడ పెద్ద సంఖ్యలో ఆఫ్రికా జాతీయులు కనిపిస్తారు. అక్కడే కాదు దేశంలో మరికొన్ని చోట్లా వీరుంటారు. వీరంతా ఇక్కడికి ఎప్పుడు వచ్చారో. ఎలా వచ్చారో తెలుసుకోవాలని ఉందా! కర్ణాటకలోని కార్వార్‌, ఖానాపూర్‌, ఎల్లాపూర్‌, హులియాల్‌ అటవదీ ప్రాంతాల్లోని కొన్ని పల్లెల్లో ప్రజల రూపురేఖలు ఆఫ్రికా మూలాల్ని గుర్తుచేస్తుంటే...వారి కట్టూ బొట్టూ మాత్రం భారతీయతను ప్రతిబింబిస్తాయి. వారంతా అక్కడ అటవీ ప్రాంతంలో వ్యవసాయం చేస్తూ అడవిలో లభించే తేనె, ఔషధ మొక్కల్ని సేకరిస్తూ జీవనోపాధి పొందుతారు. కొన్ని ఊళ్లలోనైతే పూర్తిగా వీరే ఉంటారు. వీరికి సిద్దీలని పేరు. వీరందరికీ భారతీయ పౌరసత్వం ఉంది. కర్ణాటకలోనే సుమారు 50 వేల మందికి పైగానే ఉంటారనేది అంచనా.

బానిసల నుంచి పాలకులుగా...
400 ఏళ్ల కిందట పోర్చుగీసు, బ్రిటీషు అరబ్‌ వర్తకులు తమ ఓడలకు రక్షణగా తమతోపాటు ఆఫ్రికన్లని భారత్‌కు తీసుకు వచ్చారనేది చరిత్ర. వీరిలో ఎక్కువగా బానిసలే. తమ అవసరం తీరాక వీరిని నవాబులకి, సంస్థానాదీశులకి అమ్మేసేవారు. మన దేశంలో పశ్చిమ తీర రాష్ట్రాలైన గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటకలో వీరు ఎక్కువగా కనిపిస్తారు. యూరోపియన్లు స్వేచ్ఛనివ్వడంతో కొందరూ, తమ యజమానులు పెట్టే మానసిక, శారీక హింసల్ని తట్టుకోలేక మరి కొందరూ ఒకప్పుడు అటవీబాట పట్టారని చెబుతారు. పోర్చుగీసువారు వీరిని పెద్ద సంఖ్యలో జునాగడ్‌ రాజుకి బానిసలుగా అమ్మారు. వారి వారసులు ప్రస్తుతం గుజరాత్‌లో ఉంటున్నారు. వీరు తాముండే ప్రాంతాన్నిబట్టి కొంకణీ, మరాఠి, ఉర్దూ, గుజరాతీ, హిందీ భాషల్ని మాట్లాడుతుంటారు. ఆఫ్రికన్‌ భాషని మాత్రం మర్చిపోయారు.

కానీ ఆఫ్రికా ‘మార్చ’ సంప్రదాయం, సంగీతం, నృత్యం మాత్రం వీరినుంచి దూరం కాలేదు. కాలక్రమంలో వీరు క్రిస్టియన్లు, ముస్లీంలు, హిందువులుగా మారిపోయారు. ఆఫ్రికా వేషధారణ కాకుండా భారతీయుల మాదరిగానే మగవాళ్లు లుంగీలూ, ధోవతులూ కడతారు. చొక్కాలూ వేసుకుంటారు. మహిళలు చీరలు కట్టుకుంటారు. సిద్దీల్లో అధిక శాతం నిరక్షరాస్యులే. పెళ్లిళ్లు వాళ్లే చేసుకుంటారు తప్ప బయటవారితో సంబంధాలు కలుపుకోరు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సిద్దిల్నీ 2003లో షెడ్యూల్డు తెగగా గుర్తించింది. నేటి తూర్పు, ఆఫ్రికా దేశాలైన ఇథియోపియా, సోమాలియా, కెన్యాల నుంచి సిద్దీలు వచ్చుంటారని పరిశోధనలు చెబుతున్నాయి. ఆఫ్రికన్ల దేహదారుఢ్యాన్ని గుర్తించిన చాలామంది నవాబులూ, సంస్థానాదీశులూ అప్పట్లో వారిని తమ సైన్యంలో చేర్చుకునేవారు.

ఆరేబియా తీరంలోని ‘మురుద్‌–జంజీరా’ని రాజ్యంగా చేసుకొని 400 ఏళ్లపాటు దాన్ని సిద్దీ పాలకులు పాలించారు. మన దేశం స్వతంత్రం పొందేవరకూ గుజరాత్‌లోని ‘సచిన్‌’ సంస్థానానికి పాలకులుగానూ ఉండేవారు. బహమనీ, అహమ్మద్‌నగర్‌, బీజాపూర్‌, గోల్కొండ రాజ్యాల సైన్యంలోనూ ఉండేవారు. సిద్దీ తెగకు చెందిన ‘మాలిక్‌ అంబర్‌ అహమ్మద్‌నగర్‌’ పాలకుడిగా ఉన్నాడు. నిజాం పాలకుల సైన్యంలోనూ సిద్దీలు ఉండేవారు. భారత్‌లోనే దాదాపు లక్ష మందికి పైగా సిద్దీలు ఉంటారు. ఇప్పుడు వారి మతాలు మారాయి. భాషలూ వేరయ్యాయి. అయినా మూలాలు ఒక్కటే. దాన్ని గుర్తు చేయడానికంటూ ఏటా సిద్దీలంతా కలసి ‘నాష్‌’ ఉత్సవం జరుపుతారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement