● మంత్రి పదవికి రాజీనామా చేసిరా.. ఎవరికి ప్రజాదరణ ఉందో తేల్చుకుందాం ● బండి సంజయ్‌ తరఫున నామినేషన్‌ దాఖలు చేసిన బీజేపీ లీడర్లు | Sakshi
Sakshi News home page

● మంత్రి పదవికి రాజీనామా చేసిరా.. ఎవరికి ప్రజాదరణ ఉందో తేల్చుకుందాం ● బండి సంజయ్‌ తరఫున నామినేషన్‌ దాఖలు చేసిన బీజేపీ లీడర్లు

Published Sat, Apr 20 2024 1:45 AM

నామినేషన్‌ వేసిన అనంతరం మాట్లాడుతున్న బీజేపీ నేతలు - Sakshi

కరీంనగర్‌టౌన్‌: గత కొద్ది రోజులుగా బీజేపీ, బండి సంజయ్‌పైన మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ నాయకు లు తీవ్రంగా స్పందించారు. ఇకనైనా పిచ్చివాగుడు మానుకోవాలని హెచ్చరించారు. పొన్నంకు దమ్ముంటే నేరుగా పార్లమెంట్‌ ఎన్నికల్లో కరీంనగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండి సంజయ్‌ కుమార్‌ తరఫున పార్టీ కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, ప్రతాప రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ మేయర్‌ డి.శంకర్‌, కార్పొరేటర్‌ రమణారెడ్డి తదితరులు శుక్రవారం మధ్యాహ్నం కరీంనగర్‌ కల్టెకరేట్‌ కార్యాలయానికి వచ్చి నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాననే విషయాన్ని పొన్నం మరిచిపోయారని అన్నారు. చివరకు న్యాయస్థానాలపై కూడా ఆరోపణలు చేస్తూ లిక్కర్‌స్కాం నిందితుడు శరత్‌ చంద్రారెడ్డి బీజేపీకి రూ.500 కోట్ల ఎలక్ట్రోబాండ్స్‌ ఇయ్యగానే... కోర్టు ఆయనకు బెయిల్‌ ఇచ్చిందని వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. శరత్‌ చంద్రారెడ్డికి బెయిల్‌ ఇచ్చింది గౌరవ సుప్రీంకోర్టు అని, బెయిల్‌కు, బాండ్స్‌కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. వెంటనే సుప్రీంకోర్టు పొన్నం వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని నోటీసులు జారీ చేయాలని కోరారు. ఏ సర్వే చూసినా బండి సంజయ్‌ బంపర్‌ మెజారిటీతో గెలవబోతున్నరని తేలడంతో పొన్నంకు ఫ్రస్టేషన్‌ ఎక్కువైందని, అందుకే కరీంనగర్‌ నుంచి అభ్యర్థి ఎవరో కూడా తేల్చలేకపోతున్నరని విమర్శించారు. ఘోరంగా కాంగ్రెస్‌ ఓడిపోతే మంత్రి పదవికే ఎసరొస్తుందనే భయం పొన్నంకు పట్టుకుందన్నారు. మంత్రిని అని మరిచిపోయి పొన్నం అడ్డగోలుగా ఆరోపణలు చేస్తూ సభ్యసమాజం అసహ్యించుకునేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పొన్నం ప్రభాకర్‌ ఇకనైనా బండి సంజయ్‌పై అవాకులు చవాకులు మానుకోవాలని ఈ సందర్భంగా హితవు పలికారు.

Advertisement
 
Advertisement
 
Advertisement