ఎన్నికల్లో డిపాజిట్లు దక్కితేనే అభ్యర్థులకు గౌరవప్రదమైన ఓటమి | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో డిపాజిట్లు దక్కితేనే అభ్యర్థులకు గౌరవప్రదమైన ఓటమి

Published Wed, Nov 15 2023 1:44 AM

- - Sakshi

కథలాపూర్‌(వేములవాడ): ఎదుటి పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావు.. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు తరుచూ అంటున్న మాటలివి. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం అభ్యర్థులకు తమ డిపాజిట్‌ డబ్బులు తిరిగి వస్తే అది గౌరవప్రదమైన ఓటమిగా భావిస్తారు. ఆ డబ్బులు తిరిగి రాకపోతే అభ్యర్థి చిత్తుగా ఓడిపోయినట్లే లెక్క.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే..
శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే రూ.10 వేలు డిపాజిట్‌గా ఎన్నికల సంఘం అధికారులు నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రం రూ.5 వేలు చెల్లిస్తే సరిపోతుంది. నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్‌ అధికారి వద్ద ఈ డబ్బులను డిపాజిట్‌ చేస్తారు. సదరు అధికారి ఈ మొత్తాన్ని ఎస్టీవోలోని ప్రత్యేక ఖాతాలో జమ చేస్తారు.

నామినేషన్‌ దాఖలు చేసినప్పటి నుంచి అభ్యర్థుల వ్యక్తిగత వివరాల పరిశీలన, సర్టిఫికెట్లు, ఈవీఎంలపై గుర్తుల కేటాయింపు, సర్వీస్‌ ఓటర్లకు బ్యాలెట్‌ పేపర్లపై గుర్తులను ముద్రించడం వంటి ప్రతీ అంశంపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంటుంది. అభ్యర్థికి సంబంధించిన ప్రచార ఖర్చులు, ప్రతీ కదలికపై ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక అధికారుల బృందాలు నిశిత పరిశీలన చేస్తారు. అభ్యర్థులు ఏదో నామమాత్రంగా పోటీ చేస్తే ఎన్నికల సంఘానికి అనవసర ఖర్చు పెరగడంతోపాటు అధి కారుల విలువైన సమయం వృథా అవుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పోటీచేసే అభ్యర్థుల నుంచి షరతులతో కూడిన తిరిగి చెల్లించే సెక్యూరిటీ డిపాజిట్లను స్వీకరిస్తోంది.

ఆరోవంతు ఓట్లు సాధిస్తేనే..
ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థి నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్లలో ఆరో వంతు ఓట్లను సాధించాల్సి ఉంటుంది. ఆరో వంతు ఓట్లు వచ్చిన అభ్యర్థికి ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం రిటర్నింగ్‌ అధికారి డిపాజిట్‌ తిరిగి చెల్లిస్తారు. లేకపోతే ఆ డబ్బులను ఎన్నికల సంఘం అధికారులు స్వాధీనం చేసుకుంటారు.

విత్‌ డ్రా, స్క్రూటినిలో తిరస్కరించినవారికి..
అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేసినప్పటికీ పలు కారణాలతో విత్‌ డ్రా చేసుకుంటే వారు చెల్లించిన డిపాజిట్‌ తిరిగి చెల్లిస్తారు. నామినేషన్ల పరిశీలనలో తిరస్కరణకు గురైన వారికి డిపాజిట్‌ డబ్బులు తిరిగి చెల్లిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఏదేమైనా ఎన్నికల్లో బరిలో నిలవడం ఒక ఎత్తయితే.. డిపాజిట్‌ గల్లంతు అనేది అభ్యర్థులను కొన్నిరోజులపాటు నిరాశ చెందేలా చేస్తుందని నాయకులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement