Year End 2023: ప్రపంచాన్ని వణికించిన భూకంపాలు ఇవే..! | Sakshi
Sakshi News home page

Year End 2023: ప్రపంచాన్ని వణికించిన భూకంపాలు ఇవే..!

Published Mon, Dec 25 2023 3:03 PM

Year Ender 2023 Major Earthquakes In The World - Sakshi

ప్రపంచంలో 2023లో భారీ స్థాయిలో భూకంపాలు సంభవించాయి. వీటివల్ల అపార ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఏడాది ప్రపంచంలో వచ్చిన కొన్ని ప్రధాన భూకంపాల గురించి తెలుసుకుందాం..!

ఫిబ్రవరి 6: టర్కీ-సిరియా భూకంపం

ఈ ఏడాది ఫిబ్రవరి 6న టర్కీ, సిరియాలో భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. టర్కీ దక్షిణ,  మధ్య ప్రాంతంలో భూమి రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో కంపించింది. సిరియాలో ఉత్తర, పశ్చిమ ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. కొన్ని గంటల వ్యవధిలోనే 7.8 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. భూమిలోపల 95 కిమీ లోపల భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది. ఈ విపత్తులో అపార ఆస్తి నష్టం జరిగింది. 

 ఈ భూకంపంలో 59,259 మంది ప్రాణాలు కోల్పోయారు. టర్కీలో 50,783 మంది కాగా.. సిరియాలో 8,476 మంది మృత్యువాతపడ్డారు. టర్కీ జనాభాలో 1.4 కోట్ల మంది ప్రభావితమయ్యారని అంచనా. సుమారు 1.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐరాస అంచనా వేసింది. 


మార్చి 18: గుయాస్ భూకంపం, ఈక్వెడార్

దక్షిణ ఈక్వెడార్‌లో 2023 మార్చి 18న భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ఎల్ ఓరో, అజువే, గుయాస్ ప్రావిన్స్‌లలో భారీ నష్టాన్ని కలిగించింది. దాదాపు 446 మంది గాయపడ్డారు. 16 మంది మరణించారు. ఈక్వెడార్ జనాభాలో దాదాపు సగం మంది 8.41 మిలియన్ల మంది ప్రజలు ఈ భూకంపంతో ప్రభావితులయ్యారు.  దేశంలోని మొత్తం 24 ప్రావిన్సుల్లోని 13 ప్రావిన్సుల్లో భూమి కంపించింది. 

మార్చి 21: ఆఫ్ఘనిస్థాన్ భూకంపం

2023, మార్చి 21న ఆఫ్ఘనిస్థాన్‌లోని బదక్షన్ ప్రావిన్స్‌లో భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో భూమి కంపించింది. దాదాపు 1000 కిలోమీటర్ల వైశాల్యంలో భూమి కంపించింది.  ఆప్ఘనిస్థాన్‌లోని 9 ప్రావిన్స్‌లలో ప్రజలు ఈ భూకంపంతో ప్రభావితమయ్యారు. కనీసం 10 మంది మరణించారు. 80 మంది గాయపడ్డారు. 665 కంటే ఎక్కువ ఇళ్లు ధ్వంసమయ్యాయి.

ఈ భూకంపం కారణంగా పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, క్వెట్టా, పెషావర్‌లలో ప్రకంపనలు వచ్చాయి. కొండచరియలు విరిగిపడటంతో కారకోరం హైవే మూసుకుపోయింది. బునెర్ జిల్లాలో డజన్ల కొద్దీ ఇళ్లు కూలిపోయి 40 మంది గాయపడ్డారు. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా జమ్ము కశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. 

సెప్టెంబరు 8: మొరాకో భూకంపం 

2023 సెప్టెంబరు 8న మొరాకోలోని మరకేష్-సఫీ ప్రాంతంలో భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8-6.9 తీవ్రతతో భూమి కంపించింది. దాదాపు 2,960 మంది ప్రాణాలు కోల్పోయారు. మరకేష్‌లోని చరిత్రాత్మక ప్రదేశాలు ధ్వంసమయ్యాయి. స్పెయిన్, పోర్చుగల్, అల్జీరియాలో కూడా భూప్రకంపనలు కనిపించాయి. 

మొరాకో చరిత్రలో నమోదు చేయబడిన అత్యంత బలమైన భూకంపాల్లో ఇది ప్రధానమైంది. 1960 అగాదిర్ భూకంపం తర్వాత దేశంలో అత్యంత ఘోరమైన భూకంపం ఇదే. 2023లో టర్కీ-సిరియా భూకంపం తర్వాత ఇందులోనే అత్యంత ఎక్కువ ప్రాణ నష్టం సంభవించింది. 1,00,000 మంది పిల్లలతో సహా మరకేష్, అట్లాస్ పర్వతాల పరిసర ప్రాంతాల‍్లో 2.8 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. 

అక్టోబర్ 7: హెరాత్ భూకంపం, ఆఫ్ఘనిస్తాన్

2023 అక్టోబర్ 7న పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లోని హెరాత్ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో భూమి కంపించింది. గంటల వ్యవధిలో వరుసగా నాలుగు సార్లు భూకంపం రావడం భారీ నష్టాన్ని కలిగించింది. మొదటి రెండు భూకంపాలు అక్టోబర్ 7న హెరాత్ నగరానికి సమీపంలో సంభవించాయి.  అక్టోబర్ 11, 15 తేదీల్లో అదే ప్రాంతంలో మరో రెండు భూకంపాలు 6.3 తీవ్రతతో సంభవించాయి.
 
ఈ భూకంపాల్లో 1,482 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,100 మందికి గాయాలయ్యాయి. 43,400 మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. 1,14,000 మందికి మానవతా సహాయం అవసరమైందని అంచనా. క్షతగాత్రుల సంఖ్య ఎక్కువ స్థాయిలో ఉండటంతో సరైన ఆస్పత్రి సౌకర్యాలు అందలేదు. ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 

నవంబర్ 3: నేపాల్ భూకంపం

2023 నవంబర్ 3న నేపాల్‌ కర్నాలీ ప్రావిన్స్‌లోని జాజర్‌కోట్ జిల్లాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో భూమి కంపించింది. 154 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 375 మంది గాయపడ్డారు. పశ్చిమ నేపాల్, ఉత్తర భారతదేశం అంతటా భూప్రకంపనలు కనిపించాయి. 2015 నుంచి నేపాల్‌లో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం ఇదే కావడం గమనార్హం. 

మరణాల్లో జాజర్‌కోట్ జిల్లాలో 101 మంది ప్రాణాలు కోల్పోగా.. పశ్చిమ రుకుమ్ జిల్లాలో 52 మంది మరణించారు. మరణించిన వారిలో 78 మంది పిల్లలు కూడా ఉ‍న్నారు. నేపాల్‌లోని పదమూడు జిల్లాల్లో దాదాపు 62,039 ఇళ్లు ప్రభావితమయ్యాయి. వాటిలో 26,550 ఇళ్లు కుప్పకూలాయి. 

నవంబర్ 17: మిండనావో భూకంపం, ఫిలిప్పీన్స్

2023 నవంబర్ 17న ఫిలిప్పీన్స్‌ మిండనావో ద్వీపంలోని సారంగని ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూమి కంపించింది. ఈ విపత్తులో 11 మంది మరణించారు. 730 మంది తీవ్రంగా గాయపడ్డారు. పొరుగున ఉన్న ఇండోనేషియాలో కూడా ప్రకంపనలు వచ్చాయి. 644 ఇళ్లు కూలిపోగా.. 4,248 ఇళ్లు దెబ్బతిన్నాయి.

ఇదీ చదవండి: Year End 2023: అన్నీ మంచి శకునములే!

Advertisement
Advertisement