స్లోవేక్‌ ప్రధానిపై హత్యాయత్నం ఎందుకు జరిగిందంటే.. | Slovakia PM Robert Fico Shot: Latest News | Sakshi
Sakshi News home page

Slovak PM Shot: స్లోవేకియా ప్రధానిపై కాల్పుల ఘటన: హత్యాయత్నం ఎందుకు జరిగిందంటే..

Published Thu, May 16 2024 9:29 AM | Last Updated on Thu, May 16 2024 9:59 AM

Slovakia PM Robert Fico Shot: Latest News

ప్రేగ్‌: స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్‌ ఫికో (59)పై జరిగిన హత్యాయత్నాన్ని ప్రపంచ దేశాల అధినేతలు ముక్తకంఠంతో ఖండించారు. అయితే ఆయనకు సర్జరీ విజయవంతంగా పూర్తైందని,  ప్రాణాపాయ స్థితి తప్పిందని ఆ దేశ ఉప ప్రధాని, పర్యావరణ శాఖ మంత్రి టోమస్‌ తరాబా మీడియాకు తెలిపారు.

దేశ రాజధాని బ్రటిస్లావాకు దాదాపు 140 కిలోమీటర్ల దూరంలోని హాండ్లోవా పట్టణంలో నిన్న మధ్యాహ్నాం ఫికో తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. సమావేశ ముగిశాక బయటకు వచ్చిన ఆయన.. అక్కడ బారికేడ్ల వద్ద ఉన్న కొందరు వృద్ధులతో కరచలనం చేశారు. ఈలోపు ఓ వృద్ధుడు ఆయనపై కాల్పులు జరుపుతూ మెరుపు దాడికి దిగాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బందిని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.  

 

 

 ఆ వెంటనే ఆలస్యం చేయకుండా ప్రధాని ఫికోను అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. బన్‌స్కా బైస్ట్రికాలోని ఓ ఆసుపత్రిలో ఫికోను సర్జరీ జరిగింది. మొత్తం ఐదు రౌండ్ల కాల్పులు జరిగాయని, ప్రధాని కడుపులో బుల్లెట్లు దిగి తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు.

 

 

ఇక కాల్పులకు సంబంధించి స్పాట్‌లోనే నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక మీడియా సంస్థల కథనం ప్రకారం.. నిందితుడ్ని జురాజ్‌ సింటులా(71)గా నిర్ధారించారు. అయితే దాడికి ఎందుకు పాల్పడ్డాడనేదానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. గత నెలలో జరిగిన స్లోవేకియా అధ్యక్ష ఎన్నికలు, ఇతరత్ర రాజకీయ కారణాలు హత్యాయత్నానికి కారణాలై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
 

రాబర్ట్‌ ఫికో గురించి.. 

  • 1964 చెకోస్లోవేకియాలో రాబర్ట్‌ ఫికో జన్మించారు.

  • ఫికోకు భార్యా, కొడుకు ఉన్నారు. 

  • ఫికో రష్యా అనుకూలవాది. ఉక్రెయిన్‌ యుద్ధం నుంచి పుతిన్‌కు మద్దతు ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుతం నాలుగో దఫా ప్రధాని పీఠంపై కొనసాగుతున్నారు.

  • కమ్యూనిస్ట్‌ భావజాలానికి ఆకర్షితుడై.. 1992లో డెమొక్రటిక్‌ లెఫ్ట్‌ పార్టీ తరఫున తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యాడు. 

  • 1990లో.. యూరోపియన్‌ మానవ హక్కుల సంఘాలకు స్లోవేకియా తరఫున ప్రాతినిధ్యం వహించారు. 

  • 1999లో.. స్మెర్‌(Direction – Social Democracy) పార్టీని నెలకొల్పారు. అప్పటి నుంచి ఆ పార్టీకి ఆయనే ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. 

  • 2006 నుంచి 2010 దాకా, ఆపై 2012 నుంచి 2016, 2016 నుంచి 2018 ప్రధానిగా పని చేశారు. 2014లో అధ్యక్ష ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేసి ఓడారు.

  • ఈయన హయాంలోనే స్లోవేకియా నాటోతో పాటు యూరోపియన్‌ యూనియన్‌లో సభ్య దేశంగా మారింది. 

  • అధికారంలో ఉండగా.. పత్రికా స్వేచ్ఛను అణగదొక్కారనే విమర్శ ఒకటి ఫికోపై బలంగా వినిపిస్తుంది. జర్నలిస్టులపై దాడులు చేసేందుకు క్రిమినల్‌ గ్యాంగ్‌లను సైతం ప్రొత్సహించారనే అభియోగాలు ఆయనపై నమోదు అయ్యాయి కూడా. 

  • అధికారం కోసం సిద్ధాంతాలు మార్చుకునే అవకాశవాదంటూ ప్రతిపక్షాలు ఆయన్ని విమర్శిస్తుంటాయి. 

  • స్లోవేకియా ఇన్వెస్టిగేషన్‌ జర్నలిస్ట్‌ జాన్‌ కుసియాక్‌తో పాటు అతనికి కాబోయే భార్య హత్య కేసు దుమారం రేపడంతో.. 2018లో ఫికో ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వచ్చింది. 

  • ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో కొనసాగిన ఫికో.. కిందటి ఏడాది జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో రష్యా అనుకూలవాదం, అమెరికా వ్యతిరేక నినాదాలతో జనంలోకి వెళ్లి ఘన విజయం సాధించారు. 

  • ఆ సమయంలో తాను అధికారంలోకి వస్తే.. ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయం అందించడం ఆపేస్తానని చెబుతూ.. ఈ యుద్ధ సంక్షోభానికి నాటో, అమెరికాకే కారణమంటూ విమర్శలు గుప్పించారు. 

  • రాజకీయ హింస స్లోవేకియాకు కొత్తేం కాదు. అందుకే ఆ దేశ ప్రజలకు ప్రధానిపై జరిగిన దాడి పెద్దగా ఆశ్చర్యానికి గురి చేయలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement