Russian Strikes Kill at Least 8 Civilians as Fierce Fighting Continues in Ukraine - Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. 8 మంది మృతి

Published Sun, Jul 23 2023 6:16 AM

Russia-Ukraine war: Russian strikes kill at least 8 civilians as fierce fighting continues in Ukraine - Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌ వ్యాప్తంగా రష్యా సాగించిన దాడుల్లో 8 మంది పౌరులు మృతి చెందగా పలువురు గాయాలపాలయ్యారు. డొనెట్‌స్క్‌లోని నియు–యోర్క్‌పై రష్యా సైన్యం జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోగా మరో ముగ్గురు గాయపడ్డారని ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు. కొస్టియాంటీనివ్కాపై జరిగిన రాకెట్ల దాడిలో 20 వరకు ఇళ్లు, కార్లు, గ్యాస్‌ పైప్‌లైన్‌ ధ్వంసం కాగా ఇద్దరు మృతి చెందారు. ఒకరు గాయపడ్డారు.

చెరి్నహివ్‌పై రష్యా క్రూయిజ్‌ మిస్సైళ్లు పడటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. జపొరిఝియా అణు ప్లాంట్‌ పొరుగునే ఉన్న పట్టణంపై రష్యా దాడిలో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. ఇలా ఉండగా, నల్ల సముద్రం ధాన్యం రవాణా ఒప్పందాన్ని రద్దు చేసిన రష్యా ఉక్రెయిన్‌ నౌకా తీర ప్రాంతం ఒడెసాను లక్ష్యంగా చేసుకుంది. రష్యా మిలటరీ ప్రయోగించిన రెండు క్రూయిజ్‌ మిస్సైళ్లు గిడ్డంగులపై పడటంతో మంటలు చెలరేగి పరికరాలు ధ్వంసమయ్యాయని, 120 మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలు బూడిదయ్యాయని ఉక్రెయిన్‌ తెలిపింది. క్రిమియాపై దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులకు పాల్పడినట్లు రష్యా తెలిపింది. 

ఈ పరిణామంపై తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్‌ స్పందించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ డిమాండ్లను పశ్చిమదేశాలు నెరవేర్చి, ధాన్యం రవాణా కారిడార్‌ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలని సూచించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌ చేసి మాట్లాడతానని, వచ్చే నెలలో తుర్కియేలో ఆయనతో భేటీ ఉంటుందని ఆశిస్తున్నానన్నారు. కాగా, రష్యా ఆక్రమిత క్రిమియాలో వారం వ్యవధిలో రెండోసారి డ్రోన్‌ పేలింది. క్రాస్నోవార్డిస్క్‌లోని ఆయిల్‌ డిపో, ఆయుధ గిడ్డంగిలను డ్రోన్‌ బాంబులతో పేల్చేసినట్లు ఉక్రెయిన్‌ తెలిపింది.  సోమవారం ఉక్రెయిన్‌ జరిపిన దాడిలో రష్యాను కలిపే కీలకమైన క్రిమియా వంతెన కొంతభాగం దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇలా ఉండగా, జపొరిఝియా ప్రాంతంలో ఉక్రెయిన్‌ శతఘ్ని కాల్పుల్లో రియా వార్తా సంస్థకు చెందిన రష్యా జర్నలిస్టు ఒకరు మృతి చెందారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement