ప్రకృతి బీభత్సం జపాన్‌తో కంటతడి పెట్టిస్తోంది. రాజధాని టోక్యోలో నివాస ప్రాంతాలను బురద ప్రవాహం తుడిచిపెట్టేసింది. రిసార్ట్ టౌన్ అతామీలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. బురద ప్రవాహం ముంచెత్తడంతో జాడ లేకుండా పోయారు పదుల సంఖ్యలో జనాలు. ఇక తుపాన్.. భారీ వర్షాలు అతలాకుతలం చేస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
టోక్యో: జపాన్‌లో ప్రకృతి బీభత్సం కొనసాగుతోంది. రిసార్ట్ టౌన్ అతామీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. భారీ వర్షాల కారణంగా కొండల నుంచి పెద్ద ఎత్తున జారిన బురద ఇళ్లను ముంచెత్తింది. ఎన్నో ఇళ్లు, కార్లు నామరూపాల్లేకుండా పోయాయి. బురద ధాటికి ఇప్పటిదాకా ఇద్దరు మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. మరో 20 మంది జాడ లేకుండా పోయారు. దీంతో ఆ ప్రాంతంలో ఎటుచూసినా రోదనలే కనిపిస్తున్నాయి. కనిపించకుండా పోయినవాళ్ల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని.. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు అంచనాకి వచ్చారు.
పరిస్థితి చేజారిపోతుండడంతో.. ఆదివారం సహాయక చర్యలను ముమ్మరం చేశారు అధికారులు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 1,000 మందికిపైగా సైనికులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగారు. బురదను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. కనిపించకుండా పోయినవారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇప్పటిదాకా 19 మందిని రక్షించినట్లు సహాయక బృందాలు ప్రకటించాయి. కార్యక్రమాలపై జపాన్ ప్రధానమంత్రి యోషిహిడే సుగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
Japan floods: 20 people missing after landslide sweeps through Atami, a coastal city 65 miles southwest of Tokyo. #Shizuokapic.twitter.com/4pFl3Fa1dh
— Ian Fraser (@Ian_Fraser) July 3, 2021
ఇక అతామీ పట్టణంలో 130 మంది ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయని చెప్పారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన అత్యవసరంగా కేబినెట్ సమావేశం నిర్వహించారు. భారీగా వర్షాలు కురుస్తున్నప్పటికీ సహాయక చర్యలను ఆపడం లేదని అన్నారు. బురద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు సాధ్యమైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని కోరారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
భీకర తుపాను
‘ఎల్సా’ తుపాను హైతీ దక్షిణ తీర ప్రాంతాన్ని, డొమినికన్ రిపబ్లిక్ దేశాన్ని కుదిపేస్తోంది. పెనుగాలుల ధాటికి చెట్లు నేలకూలుతున్నాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోతున్నాయి. ఎల్సా తుపాను వల్ల ఇప్పటిదాకా ముగ్గురు మరణించారు. జమైకాలోని మాంటెగో బే నుంచి 175 మైళ్ల దూరంలో సముద్రంలో పుట్టిన ఎల్సా కరీబియన్ దీవులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment