డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల్లో వాహనదారులపై ఆర్టీఏ కొరడా  | Sakshi
Sakshi News home page

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల్లో వాహనదారులపై ఆర్టీఏ కొరడా 

Published Tue, Mar 5 2024 7:20 AM

- - Sakshi

ఇప్పటి వరకు గ్రేటర్‌లో 6,395 డ్రైవింగ్‌ లైసెన్సులపై వేటు

మొబైల్‌ డ్రైవింగ్‌, ఓవర్‌స్పీడ్‌ వంటి కేసుల్లో లైసెన్సుల సస్పెన్షన్‌

సస్సెన్షన్‌ కాలంలో బండి నడిపితే మరో ఉల్లంఘన

సాక్షి, హైదరాబాద్: వాహనచోదకులారా... బాగా ‘కిక్కు’లో ఉండి బండికి ‘కిక్‌’కొట్టారో.. ఇక అంతే! మీతోపాటు మీ లైసెన్స్‌ చిక్కులో పడ్డట్టే. మీరు మరోసారి బండి నడిపేందుకు అవకాశం కూడా ఉండదు. మద్యం సేవించి వాహనం నడిపితే, కొంతకాలంపాటు డ్రైవింగ్‌ అర్హత కోల్పోతారు జాగ్రత్త! లైసెన్స్‌ లేకుండా బండి నడిపితే ఆర్టీఏ అధికారులు మరో కేసు నమోదు చేసి న్యాయస్థానం ఎదుట నిలబెట్టే ప్రమాదం కూడా ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో డ్రంకెన్‌ డ్రైవ్‌ కింద పట్టుబడిన 6,395 మంది డ్రైవింగ్‌ లైసెన్సులపై ఆర్టీఏ తాజాగా వేటు వేసింది. 6 నెలలపాటు డ్రైవింగ్‌ లైసెన్సులను సస్పెండ్‌ చేసింది.

గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు డ్రంకన్‌ డ్రైవ్‌తోపాటు వివిధ రకాల ఉల్లంఘనల కింద 10 వేల మందికిపైగా వాహనదారుల డ్రైవింగ్‌ లైసెన్సులను సస్పెండ్‌ చేయడం గమనార్హం. ఓవర్‌ స్పీడ్‌, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనం నడపడం, సరుకు రవాణా వాహనాల్లో ప్రయాణికులను తరలించడం వంటి వివిధ రకాల ఉల్లంఘనల కింద పోలీసులు, రవాణా అధికారులు కేసులు నమోదు చేశారు. ఇలా నిబంధనలు ఉల్లంఘించే వాహన‘రాయుళ్ల’పై ఆర్టీఏ కొరడా ఝళిపించింది.

ఒక్కసారి పట్టుబడినా అంతే సంగతులు
మద్యం నడిపి వాహనాలు నడపడం, పరిమితికి మించిన వేగం, అధికబరువుతో వాహనాలను నడుపుతూ వేగాన్ని అదుపు చేయలేకపోవడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు క్రమం తప్పకుండా డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహించడం వల్ల రోడ్డు ప్రమాదాలు కొంతమేరకు తగ్గుముఖం పట్టాయి.

ఈ క్రమంలో రహదారి భద్రతా నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు డ్రైవింగ్‌ లైసెన్సులపై 6 నెలలపాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు హైదరాబాద్‌ జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌(జేటీసీ) రమేష్‌ తెలిపారు. వాహనదారులు వివిధ రకాల ఉల్లంఘనల కింద ఒక్కసారి పట్టుబడినా డ్రైవింగ్‌ లైసెన్సుపై వేటు పడే ప్రమాదముంది. ‘ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలి.

వాహనం నడిపే సమయంలో తమ భద్రతతోపాటు ఇతరుల భద్రతకు కూడా వాహనదారులు బాధ్యత వహించవలసి ఉంటుంది’అని పేర్కొన్నారు. మరోవైపు రవాణా శాఖ డ్రైవింగ్‌ లైసెన్సులపై సస్పెన్షన్‌ విధించిన కాలంలో బండి నడిపితే అధికారులు మరో తీవ్రమైన తప్పిదంగా భావించి కేసు నమోదు చేస్తారు. ఇలాంటి ఉల్లంఘనల్లో పట్టుబడినవాళ్లు కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని మూడు జిల్లాల పరిధిలో వివిధ రకాల ఉల్లంఘనల కింద గత ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు నమోదైన కేసుల్లో సస్పెండైన లైసెన్సుల వివరాలు కింది విధంగా ఉన్నాయి.

Advertisement
Advertisement