రేషన్‌ కార్డులేని కుటుంబాల పరిస్థితి అధోగతేనా? | Sakshi
Sakshi News home page

రేషన్‌ కార్డులేని కుటుంబాల పరిస్థితి అధోగతేనా?

Published Tue, Dec 26 2023 5:06 AM

- - Sakshi

 హైదరాబాద్: కాంగ్రెస్‌ ప్రభుత్వం అభయ హస్తం (ఆరు గ్యారంటీ) పథకాల అర్హతకు తెల్లరేషన్‌ (ఆహార భద్రత) కార్డు ప్రామాణికం కానుంది. దారిద్య్ర రేఖకు దిగవనున్న (బీపీఎల్‌) కుటుంబం గుర్తింపు కార్డుగా రేషన్‌ కార్డు పని చేయనుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుపేద కుటుంబాల కోసం అమలు తలపెట్టనున్న ఆరు గ్యారంటీ పఽథకాలైన మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూత పథకాల్లో మహా నగారానికి రైతు భరోసా మినహా మిగతా ఐదు పథకాలు వర్తించనున్నాయి. ఈ నెల 28 నుంచి ప్రజా పాలనలో భాగంగా వార్డుల వారీగా ఐదు పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు రంగం సిద్ధమవుతోంది.

సమగ్ర కుటుంబ సర్వే తరహాలోనే స్వీకరించే దరఖాస్తుల్లో కుటుంబ పూర్తి వివరాలను తీసుకోనున్నారు. కుటుంబానికి సంబంధించి ఇళ్లు, ఆదాయం, గ్యాస్‌ కనెక్షన్‌, వాహనాలు, రేషన్‌ కార్డు, ఉద్యోగం ఇతరత్రా అన్ని వివరాలను దరఖాస్తులో స్వీకరిస్తారు. ఈ దరఖాస్తుల ఆధారంగానే గ్యారంటీ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. దరఖాస్తుల వెంట తప్పనిసరిగా రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డులను జత చేయాల్సి ఉంటుంది. రెండింటిలో ఏది లేకున్నా ఆదిలోనే దరఖాస్తులను తిరస్కరించనున్నారు. దీంతో పదేళ్ల పాటు కేవలం బియ్యం కార్డుగా పని చేసిన రేషన్‌ కార్డు బహుళ ప్రయోజనకారిగా మారి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

వడపోసి.. ఏరివేసి..
గ్రేటర్‌లోని హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా , మేడ్చల్‌ జిల్లా పరిధిలో ప్రస్తుతం మొత్తం రేషన్‌ కార్డులు 17,21,994 ఉన్నాయి. ఇందులో గత పదేళ్లలో కొత్తగా మంజూరైన కార్డులు 1.21 లక్షలు మాత్రమే. వాస్తవానికి తెలంగాణ రాష్ట ఆవిర్భావం అనంతరం తెల్లరేషన్‌ కార్డులను ఆహార భద్రత కార్డులుగా మార్పు చేయడంతోపాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇబ్బడిముబ్బడిగా కొత్త కార్డులను ప్రభుత్వం మంజూరు చేసింది. కొంత కాలానికి అనర్హుల పేరిట కొన్ని కార్డులను ఏరి వేసి 15,99,639కి పరిమితం చేసింది. దీంతో తిరిగి కొత్త కార్డుల కోసం పెద్ద ఎత్తున సుమారు 3.40 లక్షల కుటుంబాలు దరఖాస్తులు చేసుకోగా మూడేళ్ల క్రితం 360 డిగ్రీల స్థాయిలో వడపోసి కేవలం 1.21 లక్షల దరఖాస్తులను మాత్రమే ఆమోదించి కొత్త కార్డులు మంజూరు మంజూరు చేసింది.

వైఎస్‌ హయంలోనే 16.98 లక్షల కార్డులు
తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున నిరు పేదలందరికి తెల్లరేషన్‌ కార్డుల భాగ్యం కలిగింది. అప్పట్లో హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం మీద తెల్ల రేషన్‌ కార్డుల సంఖ్య 16,98,982లకు చేరింది. అప్పట్లో చౌకధరల దుకాణాల ద్వారా అమ్మహస్తం పథకం కింద రూ.185కే తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు రూ.1 కిలో బియ్యంతోపాటు కందిపప్పు, చింతపండు, గోధుమలు, గోధుమ పిండి, కారంపొడి, నూనె తదితర సరుకులు పంపిణీ జరిగేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం తెల్లరేషన్‌ కార్డు ఆహార భద్రత కార్డుగా మారి కేవలం బియ్యానికే పరిమితమైంది.

ఎదురుచూపుల్లో 10 లక్షల కుటుంబాలు..
మహానగరంలో మరో 10 లక్షల కుటుంబాలు కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయి. సుమారు కోటిన్నర జనాభా కలిగిన నగరంలో సుమారు 40 లక్షల కుటుంబాలు ఉండగా అందులో దారిద్య్రరేఖకు దిగువ నున్న కుటుంబాలు 27.21 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం 17.21 లక్షల కుటుంబాలు మాత్రమే తెల్ల రేషన్‌ కార్డులు కలిగి ఉన్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్యారంటీ సంక్షేమ పథకాలకు రేషన్‌ కార్డు ప్రామాణికంగా ప్రకటించడంతో తెల్ల రేషన్‌ కార్డుకు మరింత డిమాండ్‌ పెరిగింది. కొత్త తెల్ల రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డుల దరఖాస్తుల స్వీకరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. గ్యారంటీ సంక్షేమ పథకాలకు దరఖాస్తులు స్వీకరించనున్నడంతో రేషన్‌ కార్డులు లేని కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

గ్యారంటీ పథకాలివే
కాంగ్రెస్‌ గ్యారంటీ పథకాల కోసం వార్డుల వారీగా ఈ నెల 28 నుంచి ధరఖాస్తులు స్వీకరించనుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం దారిద్య్రరేఖకు దిగువనున్న పేద కుటుంబాలకు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 సాయం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500కే వంట గ్యాస్‌ సిలిండర్‌ వర్తించనుంది. గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ వర్తించనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి స్థలం, నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం, ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గ. స్థలం అందిస్తారు. యువ వికాసం పథకం కింద విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు. ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తారు. చేయూత పథకం కింద వృద్ధులు, వితంతువులకు నిరుపేదలకు సామాజిక పెన్షన్‌ నెలకు రూ.4,000 చొప్పున అందిస్తారు. వారికి రూ. 10 లక్షల వరకు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా వర్తించనుంది.

గ్రేటర్‌ పరిధిలో రేషన్‌ కార్డుల పరిస్ధితి ఇలా....

జిల్లా పదేళ్ల క్రితం ప్రస్తుతం

హైదరాబాద్‌ 6,91,618 6,39,609

ఉమ్మడి రంగారెడ్డి 10,07,354 10,82,382

Advertisement
Advertisement