Wesley Rosario From Philippines How to Grow Veteran Integrated Farm - Sakshi
Sakshi News home page

ఇంటిల్లపాది పౌష్టికాహారాన్ని ఆస్వాదించేలా ..వెటరన్‌ ఇంటిగ్రేటెడ్‌ ఫామ్‌

Published Mon, Aug 21 2023 1:50 PM

Wesley Rosario From Philippines How To Grow Veteran Integrated Farm - Sakshi

ఉద్యోగ విరమణ అనంతరం విశ్రాంత జీవితంలో తనకు నైపుణ్యం ఉన్న రంగంలో కృషిని కొనసాగించడం ఇటు తనకు, అటు సమాజానికి మేలు జరుగుతుందని నమ్మే వ్యక్తి వెస్లీ రొసారియో. తన నమ్మకాన్ని ఆచరణలో పెట్టి వాహ్‌ అనిపించుకుంటున్నారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన వెస్లీ చేపలు, రొయ్యల పెంపకంలో నిపుణుడు. బ్యూరో ఆఫ్‌ ఫిషరీస్‌ అండ్‌ ఆక్వాటిక్‌ రిసోర్సెస్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అధ్యక్షుడిగా ఉన్నత స్థాయిలో సేవలందించి దగుపన్‌ నగరంలో మూడేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. ఉద్యోగ బాధ్యతల రీత్యా బదిలీల వల్ల టపుయాక్‌ జిల్లాలోని తమ పూర్వీకుల ఇంటిని ఖాళీగా ఉంచాల్సి వచ్చింది. అక్కడ ఎవరూ లేకపోయేసరికి ఆ ఇంటితో పాటు వెయ్యి చదరపు మీటర్ల పెరడు కూడా నిరుపయోగంగా పాడు పడింది.

రిటైరైన తర్వాత ఆయన ఇంటికి చేరుకొని కొద్ది నెలల్లోనే ఫిష్‌టెక్‌ అర్బన్‌ ఇంటిగ్రేటెడ్‌ అర్బన్‌ ఫార్మింగ్‌ శిక్షణ  కేంద్రాన్ని నెలకొల్పటంతో ఇంటికే కాదు పెరటికి కూడా కళ వచ్చింది. ఇంటిపట్టునే కూరగాయలు, ఆకుకూరలు, కోళ్లతో పాటు చేపలను కూడా నిశ్చింతగా ఎవరికివారు పెంచుకొని ఇంటిల్లపాదీ పౌష్టికాహారాన్ని ఆస్వాదించవచ్చని వెస్లీ రొసారియో తన అర్బన్‌ ఇంటిగ్రేటెడ్‌ ఫామ్‌లో ఆచరించి చూపుతున్నారు. యూత్, సెకండ్‌ యూత్‌ అన్న తేడా లేకుండా బ్యాచ్‌ల వారీగా అందరికీ శిక్షణ ఇస్తున్నారాయన. 


ట్యాంకు నుంచి అజోలాను వెలికితీస్తున్న రొసారియో  

వెస్లీ రొసారియో పెరటి తోటలో మొత్తం ఎనిమిది (మీటరు వెడల్పు, మూడు మీటర్ల పొడవైన) చిన్న చెరువులు ఉన్నాయి. నేలపై తవ్విన చెరువుతో పాటు సిల్పాలిన్‌ షీట్, ఫైబర్‌తో చేసిన కృత్రిమ చెరువులు కూడా ఉన్నాయి. రీసర్కులేటరీ ఆక్వా చెరువు కూడా అందులో ఒకటి. కూరగాయలు, ఆకుకూరలు సాగయ్యే మడులతో పాటు కంటెయినర్లు ఉన్నాయి. హైడ్రోపోనిక్స్‌ వ్యవస్థలో ఆకుకూరలు, ఔషధ మొక్కలు పెంచుతున్నారు. 


ఆక్వాపోనిక్స్‌ వ్యవస్థ

అదేవిధంగా ఆక్వాపోనిక్స్‌ వ్యవస్థ ఉంది. చేపల విసర్జితాలు, వాటికి వేసే మేత వ్యర్థాలతో కూడిన ఆ నీరు పోషకవంతమై ఆకుకూరలకు ఉపయోగపడుతోందని వెస్లీ రొసారియో తెలిపారు. నేలపై ఉన్న చెరువులో జెయింట్‌ గౌరామి, తిలాపియా, ఫంగాసియస్, క్యాట్‌ఫిష్‌లు పెరుగుతున్నాయి. నాటు కోళ్లు, బాతులకు ఆయన ప్రధానంగా అజోలాని పండించి మేతగా వేస్తున్నారు. అజోలాను నీటిలో వేస్తే చాలు, పెరుగుతుంది. ప్రాసెసింగ్‌ అవసరం లేదు. నేరుగా చేపలు, జంతువులకు, పక్షులకు మేతగా వేయొచ్చని ఆయన అన్నారు. అజోలా పెరిగే చెరువుల్లో దోమలు గుడ్లుపెట్టే అవకాశం ఉండబోదన్నారు. చెరువు నీటిలో చేపలు పెంచుతూనే, ఆ చెరువు నీటిపై తేలాడే మడు(ఫ్లోటింగ్‌ బెడ్‌)లను ఏర్పాటు చేసి అజోలాను పెంచుతుండటం విశేషం.


సందర్శకులకు హైడ్రోపోనిక్స్‌ గురించి వివరిస్తున్న వెస్లీ రొసారియో 

చేపల తలలు, తోకలు, రెక్కలు, పొలుసులు, లోపలి భాగాలు వంటి వ్యర్థాలను సేకరించి మీనామృతం తయారు చేసి, పంటలపై పిచికారీ చేస్తే బలంగా పెరుగుతాయని రోసారియో తెలిపారు. వంకాయలు, మిరపకాయలు, బెండకాయకాయలు తదితర కూరగాయలను పండిస్తాం. బాతులు, నాటు కోళ్లు గుడ్లు పెడుతున్నాయి. పట్టణ ప్రజలు పెరట్లో చేపలు, కూరగాయలు పెంచుకోవడానికి శ్రద్ధ కావాలే గానీ పెద్దగా పెట్టుబడి అవసరం లేదు అంటున్నారు రొసారియో.

అనుభవాలను పంచుకోవడం చాలా రిలాక్సింగ్‌గా ఉంది
నేను పదవీ విరమణ తర్వాత జీవితం ఉండేలా చూడాలనుకున్నాను. నన్ను బిజీగా ఉంచుకోవడానికి ఏమి చేయాలో ముందుగానే ప్లాన్‌ చేసాను. నా వృత్తిపరమైన జీవితమంతా ఫిషరీస్‌లో పనిచేశాను కాబట్టి ఫిష్‌టెక్‌ ఇంటిగ్రేటెడ్‌ అర్బన్‌ ఫామ్‌ని ఏర్పాటు చేశాను. నా అనుభవాలను పంచుకోవడం చాలా రిలాక్సింగ్‌గా ఉంది. అలాగే, వచ్చి సలహాలు అడిగే మాజీ సహోద్యోగులతో సంబంధాలు కొనసాగటం సంతోషంగా ఉంది. 


– వెస్లీ రొసారియో, దగుపన్‌ నగరం, ఫిలిప్పీన్స్‌  

(చదవండి: పెద్ద విస్తీర్ణంలో ప్రకృతి సేద్యం ఎలా చేయాలంటే..!)

Advertisement
Advertisement