Sakshi News home page

వయసు@ 70..సోలో ట్రావెలర్‌

Published Wed, Apr 17 2024 1:53 AM

Neeru Saluja: 70 Year Old Retired Professor Who Travels Solo Accomplishing 80 Countries - Sakshi

‘‘వయసు కాదు ప్రతి ఒక్కరూ తమ హృదయ లయను అర్ధం చేసుకొని, దానిని అనుసరించాలని  నమ్ముతాను. ఇతరుల గుండె చప్పుడులో జీవించాలని ఎప్పుడూ అనుకోవద్దు’’ అంటోంది రిటైర్డ్‌ ప్రోఫెసర్‌ జైపూర్‌వాసి నీరూ సలూజా. జీవితం ఎప్పుడూ ఒక కంఫర్ట్‌ జోన్‌ బయటే ఉంటుందనే వాస్తవాన్ని గట్టిగా నమ్మే ఈప్రోఫెసర్‌ డెభ్లై ఏళ్ల వయసులో సోలో ట్రావెలర్‌గా 80 దేశాలు చుట్టొచ్చింది. భిన్న సంస్కృతులను, పర్యావరణాన్ని అర్థం చేసుకోవడానికి, ఎంతో మందిని కలుసుకొని కొత్త ఉత్తేజాన్ని ΄పొందడానికి ఈ  ప్రయాణం ఎంతగానో తోడ్పడింది అని చెబుతుంది. 

‘‘ఫసిపిక్‌లోని గాలా పాగోస్‌ దీవుల నుండి అట్లాంటిక్‌ మంచుతో నిండిన క్షితిజాల వరకు చేసిన పర్యటనల ద్వారా ఎన్నో స్మారక చిహ్నాలను సేకరించాను. వాటితో అలంకరించిన నా ఇంటిని చూసిన వాళ్లు ప్రపంచ మ్యాప్‌లా ఉంటుందని అంటారు. ఈ జ్ఞాపకాలు అన్నీ ఇప్పటి వరకు నేను చేసిన సాహసాలను గుర్తుచేస్తాయి. ఇంకా నా ఇంటి గోడలపై మిగిలిన ఖాళీ స్థలాలు రాబోయే చిహ్నాల కోసం నాతో సవాల్‌ చేస్తున్నట్టుగా కనిపిస్తాయి. 

కల వెనకాల రహస్యం
నాకు ప్రయాణాల పట్ల ఆసక్తి కలగడానికి స్కూల్‌ రోజుల్లోనే బీజం పడింది. స్కూల్‌కి సైకిల్‌పై వెళుతుండగా ప్రమాదానికి గురై ఎడమ కాలు విరిగింది. ఫిజియోథెరపీ సెషన్‌లతో పాటు నెలల తరబడి బెడ్‌రెస్ట్‌లో ఉండిపోయాను. ఇతర పిల్లలు స్కూల్లో ఉంటే నేను గదికి పరిమితం అయ్యాను. అప్పుట్లో వినోదానికి టీవీ లాంటి ఏ సాధనమూ లేదు. దీంతో పడకగదిలోని కిటికీలోంచి బయటకు చూస్తూ గంటల తరబడి కాలం గడపవలసి వచ్చింది. అక్కడ నుంచి ఆకాశం కేసి చూస్తూ ఉండేదాన్ని. ప్రపంచాన్ని అన్వేషించాలనుకునేదాన్ని. దాదారు ఆరు దశాబ్దాల తరువాత అలా నా కల నిజమైంది. 

ప్రేమ వారసత్వం
కాలేజీలోప్రోఫ్రెసర్‌గా ఉద్యోగ నిర్వహణ, భార్యగా విధులు, తల్లిగా బాధ్యతలు, ఇంటి నిర్మాణం.. అన్నీ నిర్వర్తించాను. నా పిల్లలు స్థిరపడ్డారు. నా భర్తతో కలిసి చాలా టూర్లకు వెళ్లేవాళ్లం. ఆయన నాకు భర్త మాత్రమే కాదు నా ట్రావెలర్‌ ఫ్రెండ్‌ కూడా. 2010లో ఆయన మరణించడంతో మా ప్రేమ వారసత్వాన్ని నేను కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. స్నేహితులు, కుటుంబ సభ్యుల రాక కోసం ఎదురుచూస్తూ ఉండలేను. ఆ విధంగా ఎనభైకి పైగా దేశాలను చుట్టొచ్చాను. ప్రపంచాన్ని అన్వేషించగలగడం ఒక అదృష్టంగా భావించకూడదు. అదొక ప్రయాణం. 

దృష్టి కోణాన్ని మార్చింది
మొదటి ఒంటరి ప్రయాణం మాత్రం నాకు ఒక సాహసమే అని చెప్పగలను. 2014లో యూరప్‌ క్రిస్మస్‌కి క్రూయిజ్‌ ద్వారా వెళ్లాను. ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను. ఒంటరిగా ప్రయాణించడం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ యాత్రతో నాకు అర్ధమైంది. నిరుత్సాహమైనదని కొందరు అంటుంటారు. కానీ, నేనది అంగీకరించను. ప్రయాణ ప్రణాళికను బాగా ΄్లాన్‌ చేసుకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముందు తెలుసుకున్నాను.

మనతో ఒకరు తోడు కావాలనుకుంటే మాత్రం మార్గంలో ఎంతో మంది కొత్త స్నేహితులు కలుస్తారు. కాబట్టి నిజంగా ఒంటరిగా ఉన్నాననే ఆలోచనే రాదు. ఈ యాత్ర నా దృష్టి కోణాన్ని పూర్తిగా మార్చింది. ఒంటరిగా ప్రయాణించడం, గన్యాలను, ప్రయాణ మార్గాలను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇదే ఒక సమూహం, కుటుంబ పర్యటన అయితే ఒక సమయపాలనకు కట్టుబడి ఉండాలి. ఆ గ్రూప్‌లో ఎవరు ఏం చేస్తారో మీరూ అదే చేయాల్సి ఉంటుంది. కానీ, ఒంటరి యాత్రికుల విషయంలో అలాంటి డిమాండ్స్‌ ఏవీ ఉండవు. 

అడుగడుగునా ఉత్సుకత
నా జీవితంలో అతి ఎక్కువగా గుర్తుండిపోయేది 2017 చలికాలంలో స్వీడన్‌ పర్యటన. నార్తర్న్‌ లైట్స్‌కు ప్రసిద్ధి చెందిన స్టాక్‌ హోమ్‌ నుండి అబిస్కోకు రైలు ఎక్కడం ద్వారా ఇది ప్రారంభమైంది.  మన దేశం రైళ్లకు, అక్కడి రైళ్లకు ఏ మాత్రం పోలిక లేదు. బోర్డింగ్‌లో ప్రతి వ్యక్తికీ వాష్‌రూమ్‌కి ఒక కీ ఇస్తారు. అదొక ఖరీదైన హోటల్‌ లాంటిది. అక్కడి బాత్రూమ్‌లో ఒక గంట సమయం గడపాలనుకున్నాను. తిరిగి కంపార్ట్‌మెంట్‌కు వచ్చినప్పుడు అది లాక్‌ అయిపోయింది. ఎవరూ సాయం చేసేవాళ్లు లేరు. కంగారు పడ్డాను. కానీ, చివరకు మార్గాన్ని కనుక్కోగలిగాలను.

ఇలాంటి ఎన్నో ఉత్కంఠలు, ఉత్సుకతలు, సాహసాలు.. ఒక్కరోజులో చెప్పలేను. అబిస్కోలో ఒక మంచు గదిలో బస. అక్కడ అది ఎంతో అందంగా, సహజంగా ఉంది. కానీ, బాత్‌రూమ్‌లు లేవని ఆలశ్యంగా తెలసింది. అక్కడ పడిన పాట్లు ఒక్క మాటలో చెప్పలేను. మాస్కో నుండి బీజింగ్‌ వరకు ట్రాన్స్‌ –సైబీరియన్‌ రైలు ప్రయాణం.. అదొక ప్రపంచం. మెల్‌బోర్న్‌లో 12 వేల అడుగుల నుండి స్కై డైవింగ్‌ చేయడం అత్యంత ఉత్కంఠను కలిగించింది. ఇలా చెబుతూ పోతే ఎన్నో జ్ఞాపకాలు. ఒక స్వేచ్ఛ విహంగమై చేస్తున్న ప్రయాణం నాకు ఎన్నో తీరాలను పరిచయం చేస్తోంది’’ అని వివరిస్తుంది ఈ ట్రావెలర్‌.

Advertisement
Advertisement