గురువు సందేశం తర్వాత..ఇంత నిశబ్దమా! ఇదేలా సాధ్యం? | Sakshi
Sakshi News home page

గురువు సందేశం తర్వాత..ఇంత నిశబ్దమా! ఇదేలా సాధ్యం?

Published Mon, Sep 25 2023 9:45 AM

Bhikshu Sangha Was Silent After Buddhas Preaching Finished - Sakshi

అది చంపానగర సమీపంలో ఉన్న గర్ఘరా పుష్కరిణీ తీరం. ఆ పుష్కరిణి దక్షిణపు ఒడ్డున సువిశాలమైన మర్రిచెట్టు. ఆ చెట్టుకింద బుద్ధుడు తన భిక్షుసంఘంతో కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో ఏనుగులకు శిక్షణ ఇచ్చే పేస్సుడు, కందరకుడు అనే పరివ్రాజకుడు ఇద్దరూ వచ్చారు. వారు వచ్చి మౌనంగా ఒకపక్క కూర్చున్నారు. కొంతసేపటికి బుద్ధుని ప్రబోధం ముగించాడు. అప్పుడు వారిద్దరూ బుద్ధుని దగ్గరకు వెళ్ళారు.  కొన్ని అనుమానాలు అడిగి నివృత్తి చేసుకున్నారు. అప్పటికి చాలా సమయం గడిచింది. భిక్షుసంఘం అంతసమయం నిశ్శబ్దంగానే ఉండటం చూసి వారిద్దరూ ఆశ్చర్యపడ్డారు. 

వారు అనేక ఇతర పరివ్రాజక సంఘాల్ని చూశారు. గురువులు చెప్పే సందేశాలు ముగిశాక గానీ ఇంత ప్రశాంతత కానరాదు. ఎవరో ఒకరు మాట్లాడుకుంటూనో, గుసగుసలాడుకుంటూనో, గొణుక్కుంటూనో ఉంటారు. ఆ గురువులు ‘నిశ్శబ్దం నిశ్శబ్దం’ అని అరుస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ అలాంటిదేమీలేదు. ఎవ్వరూ అసహనంగా లేరు. ఇతరుల్ని సహనాన్ని చెడగొట్టడం లేదు. తాము బాధపడటం లేదు, ఇతరుల్ని బాధపెట్టడం లేదు. అప్పుడు కందరకుడు ‘‘భగవాన్‌! విచిత్రం!  మనుషుల ప్రవర్తన రకరకాలుగా ఉంటుంది. కానీ, ఇక్కడ అందరూ ఒకే శ్రద్ధతో ఉన్నారు’’ అని ఆశ్చర్యంగా అడిగాడు.

అప్పుడు బుద్ధుడు–‘‘కందరకా! మనుషుల్లో ముఖ్యంగా తాపసుల్లో నాలుగు రకాల వారు ఉంటారు. మొదటి రకం వారు, తమని తామే బాధించుకుంటారు. తాము బాధపడుతూ తమ శరీరాల్ని అతిగా బాధలకి గురిచేస్తారు. నిరాహారంతో శుష్కింపచేస్తారు. అతి చలికి, అతి వేడిమికి గురిచేస్తారు. తినకూడని  పదార్థాల్ని తింటారు. అలా తమని తాము శిక్షించుకోవడమే సరైన శిక్షగా భావిస్తారు. ఇంకొందరు ఇతరుల్ని బాధించి తాము సుఖంగా బతకాలనుకుంటారు. దొంగలూ దోపిడీదారులు, ఇతర జీవుల్ని పట్టి చంపి వాటి మాంసాన్ని అమ్మేవారు. ఇలా పరుల్ని నష్టపరచి తాము లాభాలు పొందాలనుకునే వారంతా ఈ కోవలోకి వస్తారు.

అలాగే తాము దుఃఖపడుతూ ఇతరుల్ని దుఃఖపరిచే వారు మూడోరకం. ఒక మహారాజు గొప్ప యజ్ఞం చేయాలనుకుంటాడు. దాని నిర్వహణ కోసం ఎంతో సొమ్ము... ఎన్నో జంతువులూ కావాలి. కాబట్టి ఆజ్ఞలు జారీ చేస్తాడు. ఆ ఆజ్ఞల్ని అమలు చేయడానికి ఉద్యోగుల్నీ, సైనికుల్నీ నియమిస్తాడు. వారు గ్రామాల మీద పడి పేద ప్రజల నుండి, సామాన్య రైతుల నుండి పశువుల్ని, డబ్బుల్నీ బలవంతాన లాక్కు వస్తారు. అలా వారు తమకి ఇష్టం లేకపోయినా బాధపడుతూనే... బలవంతంగా ఆ పనులు చేస్తారు. తాము బాధపడుతూ, ఇతరుల్నీ బాధపెడతారు.’’

ఇక కొందరు తమ శరీరాన్ని, తమ మనస్సునీ తాము బాధించుకోరు. తమ సుఖం కోసం పరుల్నీ బాధించరూ– ఇలాంటి వారు స్వీయ క్రమశిక్షణతో నడుచుకుంటారు. అలా ఉంటే ఆ వినేది తామూ శ్రద్ధతో వింటారు. పక్కనున్న వారినీ విననిస్తారు. అది ఉభయులకీ శ్రేయస్సునిస్తుంది. నా భిక్షువులు అలాంటి వారు’’ అన్నాడు బుద్ధుడు. శ్రద్ధ, స్వీయ క్రమశిక్షణ ఎంత అవసరమో వారికర్థమయ్యింది. ఇద్దరూ బుద్ధునికి ప్రణమిల్లి ‘‘మమ్మల్ని, మీ సంఘంలో చేర్చుకోండి’’ అని ప్రార్థించారు. బుద్ధుడు అంగీకరించాడు. 
– డా. బొర్రా గోవర్ధన్‌

(చదవండి: "కృష్ణ భక్తి" ఎంతపనైనా చేస్తుంది అంటే ఇదే కదా..ఏకంగా 88)

Advertisement

తప్పక చదవండి

Advertisement