ఆగని డ్రాగన్‌ దురాశ | Sakshi
Sakshi News home page

ఆగని డ్రాగన్‌ దురాశ

Published Tue, Apr 9 2024 12:09 AM

Sakshi Editorial On China Greed On India

ఇది ఆందోళన రేపే వార్త. తక్షణమే అడ్డుకట్ట వేయడానికి ఆలోచించాల్సిన వార్త. పొరుగు దేశం చైనా ‘వాస్తవాధీన రేఖ’ (ఎల్‌ఏసీ) వెంట తన వైపున మరో 175కు పైగా గ్రామాలను నిర్మిస్తోందట. మన అరుణాచల్‌ ప్రదేశ్‌కు అభిముఖంగా సాగుతున్న ఈ కొత్త నిర్మాణాలు ఇప్పటికే ఎల్‌ఏసీ వెంట డ్రాగన్‌ సాగించిన 628 ‘షియావోకాంగ్‌’ (సంపన్న గ్రామాలు)కు అదనం. ఎల్‌ఏసీ వెంట తన బలం, బలగం పెంచుకొనేందుకు బీజింగ్‌ మరోసారి దుష్టపన్నాగం పన్నుతోంది.

అభిజ్ఞవర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ పత్రిక ప్రచురించిన ఈ కథనం సంచలనం రేపుతోంది. ఈశాన్యంలోని అరుణాచల్‌ ప్రదేశ్‌తో పాటు జమ్ము–కశ్మీర్‌లో లద్దాఖ్‌ ప్రాంతం వెంట కూడా చైనా వైపున కొత్త గ్రామాలు వెలుస్తున్నాయి. ఇది అత్యంత ఆందోళనకరమైన పరిణామం. వెరసి, రానురానూ ఎల్‌ఏసీ మరింత వివాదాస్పదం కానుంది. ఇది మన బలగాలు, స్థానికులు తక్షణం జోక్యం చేసుకోవాల్సిన అంశం. 

నిజానికి, వాస్తవాధీన రేఖ అనేది భూతలంపై స్పష్టంగా నిర్ణయించిన సరిహద్దు ఏమీ కాదు. చైనీయుల నియంత్రణలో ఉన్న భూభాగాన్నీ, భారత నియంత్రిత భూభాగాన్నీ వేరుపరచే ఊహాత్మక సరిహద్దు రేఖ. దీన్ని వాటంగా చేసుకొని, ఊహాత్మక సరిహద్దయిన ఎల్‌ఏసీ వెంట సైనిక సన్నద్ధతను పెంచుకోవాలనీ, ఆ క్రమంలో అక్కడ మరింత భూభాగంపై తమ హక్కును ప్రకటించుకోవా లనీ చైనా కుటిల ప్రయత్నం.

అందుకే, ఆ జగడాలమారి దేశం ఎల్‌ఏసీ వెంట తన వైపున గ్రామాలకు గ్రామాలు నిర్మిస్తూ వస్తోంది. దాదాపుగా 900 ఎల్‌ఏసీ గ్రామాలను నిర్మించాలనేది చైనా వ్యూహం. అందులో 200 దాకా గ్రామాలు భారత సరిహద్దుకు సమీపంలో కట్టాలని దాని ప్రయత్నం. ఆ భారీ ప్రయత్నంలో భాగమే ఇప్పుడీ కొత్త నిర్మాణాలు. ఆ గ్రామాలు ఇటు గస్తీ పాయింట్లుగా, అటు భారత్‌తో ఘర్షణ తలెత్తితే చేతికి అందివచ్చే సైనిక స్థావరాలుగా ఉపకరిస్తాయనేది బీజింగ్‌ ఎత్తుగడ. 

చైనా సైనిక వ్యూహం మాట అటుంచితే, కొత్త ఆవాసాలతో అనేక దీర్ఘకాలిక ప్రభావాలున్నాయి. అది మన దేశాన్ని మరింత కలవరపెడుతోంది. గమనిస్తే, భారత – చైనాల మధ్య 2005 నాటి ‘సరి హద్దు రక్షణ సహకార ఒప్పందం’ (బీడీసీఏ) ఉంది. ‘‘సరిహద్దు ప్రాంతాల్లో స్థిరపడ్డ ప్రజానీకం ప్రయోజనాలను ఇరుపక్షాలూ సంరక్షించాలి’’ అని బీడీసీఏలోని ఏడో ఆర్టికల్‌ పేర్కొంటోంది.

ఎప్పుడైనా ఎల్‌ఏసీని కచ్చితంగా నిర్ణయించాల్సిన పరిస్థితి వస్తే, అప్పటికి జనావాసాలైన ఈ కొత్త గ్రామాలను కదిలించడానికి వీలుండదు. ఆ అంశాన్ని అడ్డం పెట్టుకోవాలనేది డ్రాగన్‌ దురా లోచన. అలా తన ప్రాదేశిక హక్కుల వాదనకు బలం చేకూర్చేలా ఈ కొత్త గ్రామాలు, అక్కడ తెచ్చి పెట్టిన జనాభాను వాడుకోవాలనేది దాని పన్నాగం. చైనా వైపు కడుతున్న ఈ కొత్త గ్రామాలకు ఎదురుగా భారత్‌ వైపున కూడా గ్రామాలు లేకపోలేదు. అయితే, వాటిలో జన సంఖ్య అంతంత మాత్రమే! 

విస్తరణ కాంక్షతో ఊగుతున్న చైనా ఈ గ్రామాల నిర్మాణంతో ఆగడం లేదు. టిబెట్‌లో, ఎల్‌ఏసీ సమీప ప్రాంతాల్లో పెద్దయెత్తున ప్రాథమిక వసతి కల్పన ప్రాజెక్టులను చేపడుతోంది. ఇప్పటికే తన 14వ పంచవర్ష ప్రణాళిక (2021 –25)లో భాగంగా సిచువాన్‌ – టిబెట్‌ రైల్వేలైను సహా హైస్పీడ్‌ రైల్వే వ్యవస్థను విస్తరించే పని పెట్టుకుంది. అలాగే, వాస్తవాధీన రేఖ వెంట, భారత భూభాగానికి సమాంతరంగా సాగే రెండు జాతీయ రహదారులను (జీ–219, జీ–318) అప్‌గ్రేడ్‌ చేసే పనులూ కూడా ఆ ప్రణాళికలో భాగమే. వాటిలో ఒకటి (జీ–219) లద్దాఖ్, హిమాచల్‌ ప్రదేశ్‌లకు ఎదురుగా ఉంటే, మరొకటి (జీ–318) అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిమ్‌లకు అభిముఖమైనది కావడం గమనార్హం.

తద్వారా ఒకపక్క టిబెట్‌ను తమలో భాగంగా ప్రచారం చేసుకోవడం, మరోపక్క ప్రాథమిక వసతుల పెంపు అనే రెండూ చైనా పెట్టుకున్న లక్ష్యాలు. అసలు 1959 మార్చి 28న దలైలామా నేతృత్వంలోని టిబెటన్‌ ప్రభుత్వాన్ని అక్రమంగా రద్దు చేసి, టిబెట్‌ను ఆక్రమించుకున్న చరిత్ర బీజింగ్‌ది. కానీ, మొన్న షిజాంగ్‌ (టిబెట్‌)లో ప్రజాస్వామ్య సంస్కరణకు 65వ వార్షికోత్సవం అంటూ ఎల్‌ఏసీ వెంట డ్రాగన్‌ సంబరాలు జరపడం ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నమే!

టిబెట్‌ నుంచి తైవాన్‌ దాకా అన్నీ తమవేననే డ్రాగన్‌ రాజ్య విస్తరణ వాదం ప్రపంచానికి కొత్త కాదు. చైనా సాగిస్తున్న ఈ కొత్త గ్రామాల నిర్మాణం నాటకాన్ని సైతం భారత్‌ గతంలోనే గమనించకపోలేదు. అందుకనే ఆ జనావాసాలను బీడీసీఏ కింద సరిహద్దు చర్చల నుంచి మినహాయించా లని తేల్చిచెప్పింది. డ్రాగన్‌ మాత్రం తన వంకర బుద్ధి వదులుకోలేదు.

భారత్‌లోని లద్దాఖ్‌కు అభి ముఖంగా తాను చట్టవిరుద్ధంగా దురాక్రమణ చేసిన ప్రాంతాల్లోనూ చకచకా గ్రామాలు కట్టే పని చేస్తూనే ఉంది. ఇందుకు ప్రతిగా మన దేశం ఎదురుదాడికి దిగింది. ‘సచేతన గ్రామాల పథకం’ పేర ఆ సరిహద్దులోని మన జనావాసాలను ఏడాది పొడుగూతా జనంతో ఉండే ఆధునిక పర్యాటక ఆకర్షణలుగా మార్చాలని ప్రయత్నిస్తోంది. అయితే అదింకా పూర్తి కాలేదు. పనులు సాగుతూనే ఉన్నాయి. 

తరచూ కయ్యానికి కాలుదువ్వే చైనాకు ముకుతాడు వేయడానికి మనం చేయాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయి. క్లిష్టమైన హిమాలయ ప్రాంతాల్లో మనం మనవైపు నిర్మిస్తున్న గ్రామాలు సైతం నిర్మానుష్యంగా మిగలకుండా స్థానిక ప్రజలు ఆవాసం ఉండేలా చూడాలి. దురాక్రమణలు జరగకుండా ఉండాలంటే, స్థానికులు ప్రతి ఒక్కరిలో తామే సరిహద్దును కాపాడే సైనికులమనే భావన కల్పించాలి.

మాతృభూమి పరిరక్షణ స్ఫూర్తి రగిలించాలి. అది జరగాలంటే, ముందుగా లద్దాఖ్‌ లాంటి ప్రాంతాల్లో నిరసన తెలుపుతున్న ప్రజానీకపు న్యాయమైన కోరికలను మన్నించాలి. ప్రాంతీయ సంస్కృతి, ఆకాంక్షలకు అనుగుణంగా మన ఢిల్లీ పాలకులు వ్యవహరించాలి. సొంత ఇంటిని చక్కదిద్దు కొని, పొరుగు ప్రత్యర్థిపై పోరాడే క్రమంలో దేశ ప్రయోజనాల దృష్ట్యా అన్ని పక్షాలూ కలసిరావాలి.  

Advertisement
Advertisement