ఓటమి భయంతో టీడీపీ కవ్వింపు చర్యలు | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతో టీడీపీ కవ్వింపు చర్యలు

Published Tue, May 14 2024 2:10 PM

-

వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు

మాజీ కార్పొరేటర్‌ రోకళ్ళ

సత్యకు గాయాలు

ఘటనా స్థలాన్ని సందర్శించిన ఎస్పీ

కాకినాడ: ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో ఓటమి భయంతో టీడీపీ నేతలు కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాడులకు తెగబడ్డారు. ఏదో ఒక విధంగా అలజడులు సృష్టించి పోలింగ్‌కు అంతరాయం కలిగించి ఓటర్లను భయపెట్టే లక్ష్యంతో చేసిన వీరి ప్రయత్నం ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఘర్షణలో కాకినాడ వైఎస్సార్‌ సీపీకి చెందిన మాజీ కార్పొరేటర్‌ రోకళ్ళ సత్యనారాయణ(సత్య) గాయపడ్డారు.

కాకినాడలో టీడీపీ కవ్వింపు చర్య

కాకినాడ రామకృష్ణారావుపేట ప్రాంతంలో పోలింగ్‌ సరళి తమకు వ్యతిరేకంగా కనిపించడంతో కొంతమంది టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన కొంతమంది వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. ఉదయం నుంచి ఈ తరహాలో రెచ్చగొడుతున్న నేపథ్యంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం సాగింది. ఓ దశలో జగన్నాథపురం ప్రాంతానికి చెందిన వనమాడి ఉమామహేశ్వరరావు, చింతా కామేష్‌ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు రోకళ్ళ సత్యపై దాడి చేశారు. ఘటనలో రోకళ్ళ చేతికి గాయమై ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, జేసీఎస్‌ కన్వీనర్‌ సుంకర విద్యాసాగర్‌ రోకళ్ళను కలిసి పరామర్శించారు. ఘర్షణ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ ఆస్పత్రికి వెళ్లి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

కరపలో దౌర్జన్యం

కాకినాడ రూరల్‌ కరప మండలం పెదకొత్తూరు గ్రామంలో జనసేన నాయకులు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై పోలింగ్‌బూత్‌ వద్ద దాడికి దిగారు. చేతిలోని సెల్‌ఫోన్‌ లాక్కుని దౌర్జన్యం చేశారు. స్థానిక నాయకులు చింతా సత్యనారాయణపై ఈ దాడి జరిగింది. జనసేన అభ్యర్థి పంతం నానాజీ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలంతా వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులను చంపుతామంటూ బెదిరింపులకు పాల్పాడ్డారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.

కృష్ణునిపాలెంలో లాఠీచార్జి

జగ్గంపేట నియోజకవర్గంలోని సమస్యాత్మక ప్రాంతమైన కృష్ణునిపాలెంలో టీడీపీ నేతల కవ్వింపు చర్యలు కారణంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. క్యూలో ఉన్న ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి కొట్లాటకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘర్షణను నివారించేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.

Advertisement
 
Advertisement
 
Advertisement