స్నిఫర్‌ డాగ్స్‌ అడిగారు.. పంపాం | Sakshi
Sakshi News home page

స్నిఫర్‌ డాగ్స్‌ అడిగారు.. పంపాం

Published Sat, Mar 23 2024 4:44 AM

Visakha Police Commissioner Dr Ravi Shankar on drugs case - Sakshi

డ్రగ్స్‌ కేసును సీబీఐ విచారిస్తోంది... అది మా పరిధి కాదు 

స్థానిక అధికారుల వల్ల జాప్యం జరిగిందనడం అవాస్తవం 

సీబీఐ వాడిన టెక్నికల్‌ పదజాలాన్ని తప్పుగా అన్వయించుకోవద్దు 

విశాఖ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ రవిశంకర్‌ 

విశాఖ సిటీ:  డ్రగ్స్‌ కంటైనర్‌ కేసు దర్యాప్తు తమ పరిధిలో లేదని విశాఖ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఏ.రవిశంకర్‌ స్పష్టం చేశారు. ఆ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందని, ఇందులో జిల్లా అధికారులకు ఎటువంటి సంబంధం లేదన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ రిపోర్ట్‌లో పొందుపరచిన సాంకేతిక పదజాలాన్ని కొందరు తప్పుగా అన్వయించుకున్నారని చెప్పారు. రాజకీయ ఒత్తిళ్లతో జిల్లా అధికారులు ఆలస్యంగా రావడంతో దర్యాప్తులో జాప్యం జరిగినట్లు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారన్నారు.

తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున పోలీస్‌ శాఖ ఎన్నికల కమిషన్‌ పరిధిలో పని చేస్తోందని వివరించారు.  ‘బ్రెజిల్‌ నుంచి రవాణా నౌక ద్వారా డ్రగ్స్‌ కంటైనర్‌ విశాఖ పోర్టుకు వస్తున్నట్లు ఇంటర్‌పోల్‌ ఇచ్చిన సమాచారంతో సీబీఐ అధికారులు విశాఖ చేరుకున్నారు. ఆ కంటైనర్‌ను విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (వీసీటీపీఎల్‌)లో జేఎం భక్షి అనే ప్రైవేట్‌ సంస్థ ఆదీనంలో ఉన్న ప్రాంతంలో అన్‌లోడ్‌ చేశారు.

సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో డెలివరీ అయిన కంటైనర్‌లో డ్రగ్స్‌ ఉన్నట్లు సీబీఐకు సమాచారం అందడంతో ఆనవాళ్లు గుర్తించేందుకు స్నిఫర్‌ డాగ్స్‌ కావాలని పోలీస్‌ శాఖను కోరారు. కొంతసేపటి తరువాత వాటిని వెనక్కు పంపించారు. నేను కూడా అక్కడ నుంచి వెళ్లిపోయా. ఆ తరువాత కస్టమ్స్, సీబీఐ అధికారులు కంటైనర్‌లో ఉన్న వాటిని పరీక్షించారు. ఈ తనిఖీలతో విశాఖ పోలీసులకు, అధికారులకు సంబంధం లేనందున ఎవరూ పాల్గొనలేదు.  



తప్పుగా అర్థం చేసుకున్నారు.. 
కంటైనర్‌లో డ్రగ్స్‌ తెరిచినప్పటి నుంచి ఆనవాళ్ల పరీక్ష పూర్తయ్యే వరకు ప్రతి అంశాన్ని రికార్డ్‌ చేసేందుకు సీబీఐ అధికారులు ఓ ప్రైవేటు వీడియోగ్రాఫర్‌ను వెంట తెచ్చుకున్నారు. కంటైనర్‌ను తెరిచే సమయంలో వీసీటీపీఎల్‌తోపాటు ప్రైవేటు సంస్థ సిబ్బంది, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. వీడియో రికార్డింగ్‌కు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నందున వారిని అక్కడి నుంచి పంపించారు.

ఇలా వృథా అయిన సమయాన్ని స్థానిక అధికారులు గుమిగూడటం కారణంగా ప్రొసీడింగ్స్‌లో జాప్యం జరిగినట్లు ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ అధికారులు పేర్కొన్నారు. వీసీటీపీఎల్, ప్రైవేటు సంస్థ అధికారులు రావడాన్ని సీబీఐ ప్రస్తావిస్తే దాన్ని జిల్లా అధికారులకు ముడిపెట్టడం సరికాదు. ఈ విషయంపై సీబీఐ అధికారులతో మాట్లాడి స్పష్టత తీసుకున్నాం. సీబీఐ అధికారులు వినియోగించిన  టెక్నికల్‌ పదాలను తప్పుగా అర్థం చేసుకొని సంబంధం లేని అధికారులపై ఆరోపణలు చేయడం సరికాదు.’ అని సీపీ చెప్పారు.  

స్మగ్లింగ్‌ ముఠాలపై ఉక్కుపాదం 
‘గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా­పై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. పోలీసులతో పాటు ప్రత్యేకంగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను ఏర్పాటు చేసి రాష్ట్రంలో డ్రగ్స్‌ నిరోధానికి చర్యలు చేపట్టింది. విశాఖపట్నంలో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేశాం. ప్రత్యేక బృందాలతో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా శాటిలైట్‌ చిత్రాలను సేకరించి గంజాయి తోటలను ధ్వంసం చేశాం. ప్రసుత్తం విశాఖపట్నంలో గంజాయి లేదా ఇతర డ్రగ్స్‌ లేవు. ఒడిశా, మల్క­న్‌గిరి, జైపూర్, కోరాపుట్‌ లాంటి ప్రాంతాల నుంచి రవాణా జరుగుతోంది.

విశాఖపట్నంలో అన్ని రకాల రవాణా సదుపాయాలు ఉండడంతో ఇతర రాష్ట్రాల గంజాయి, మాదక ద్రవ్యాల స్మగ్లర్లు జిల్లాను ట్రాన్సిట్‌ కేంద్రంగా వినియోగించుకుంటున్నారు. వీరిపై గట్టి నిఘా పెట్టి అంతర్రాష్ట గంజాయి ముఠాలను అరెస్టు చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి విశాఖపట్నం మీదుగా మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్న ముఠాలను అరెస్టు చేస్తుంటే నగరం గంజాయికి కేంద్రంగా మారిందని దు్రష్పచారం చేయడం సరికాదు.’ అని పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌ వివరించారు. 

Advertisement
Advertisement