బినామీలుగా సంబంధంలేని వ్యక్తులు! | Sakshi
Sakshi News home page

బినామీలుగా సంబంధంలేని వ్యక్తులు!

Published Sun, Jan 28 2024 5:06 AM

Remand Report On HMDA Former Director Shiva Balakrishna File: ACB Seek Custody - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భూవినియోగ మార్పు, భవన అనుమతుల్లో అక్రమాలతో భారీగా ఆర్జించిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్, రెరా కార్యదర్శి శివబా­ల­కృష్ణ.. చాలా తెలివిగా తనకు బంధుత్వం, దగ్గరి సంబంధమేదీ లేని వ్యక్తులను బినామీలుగా పెట్టు­కు­ని వందల కోట్ల రూపాయల ఆస్తులు కొనుగోలు చేసినట్టు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. తెలిసినవా­రైతే అనుమానం వస్తుందని భావించి ఇలా వ్యవహరించారని.. అధికారులు, రాజకీయ నేతల సహ­కారంతో వందల కోట్ల విలువ చేసే భూము­లను ఆర్జించారని అంటున్నారు. శివబాలకృష్ణపై ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కోర్టులో దాఖలు చేసిన 45పేజీల రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలను వెల్లడించారు.

సహకరించిన అధికారుల పాత్రపైనా విచారణ
శివ బాలకృష్ణ ఇంటితోపాటు పీర్జాదిగూడలో రమాదేవి, జూబ్లీహిల్స్‌ ప్రమోద్‌కుమార్, మాదాపూ­ర్‌లో సందీప్‌రెడ్డి, బాచుపల్లిలో సత్యనారాయ­ణమూర్తి ఇళ్లు, ఇతర కార్యాలయాలు కలిపి మొత్తం 18 చోట్ల సోదాలు చేశామని.. భారీగా స్థిర, చరాస్తుల డాక్యుమెంట్లను గుర్తించామని రిమాండ్‌ రిపోర్టులో అధికారులు వివరించారు. ‘‘బాలకృష్ణ ఇంట్లో స్వాధీనం చేసుకున్న 50 స్థిర, చరాస్తుల డాక్యుమెంట్లను పరిశీలించాం. పట్టణాల్లో విల్లాలు, ఇళ్లతోపాటు నాగర్‌కర్నూల్‌లో 12.13 ఎకరాలు, అబ్దుల్లాపూర్, భువనగిరి, చేవెళ్ల, యాదగిరిగుట్ట, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో భూములు ఉన్నట్టు గుర్తించాం.

స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల మేరకు స్థిరాస్తుల విలువ రూ.4.9 కోట్లుగా ఉంది. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ అంతకు 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగే రూ.83,80,000 నగదు, నాలుగు కార్లు, రూ.8.26 కోట్ల విలువైన బంగారం, వెండితోపాటు పలు వస్తువు­లు సీజ్‌ చేశాం. 155 డాక్యుమెంట్లు, 4 బ్యాంక్‌ పాస్‌బుక్‌లు, ఖరీదైన వాచీలు, సెల్‌ఫోన్లు, లాకర్‌ పత్రాలు, ఎల్‌ఐసీ బాండ్లను స్వాధీనం చేసుకు­న్నాం. వీటిలో బినామీలను విచారించాల్సి ఉంది. అలాగే ఈ ఉదంతంలో ఇతర అధికారుల పాత్రపైనా దర్యాప్తు జరపాల్సి ఉంది..’’ అని అధికారులు పేర్కొన్నారు.

రాజకీయ నాయకులూ సహకరించారు
లేఔట్ల అనుమతుల కోసం శివబాలకృష్ణ పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్‌ చేసేవారని.. రెరా సెక్రటరీ హోదాలోనూ పలు అవకతవకలకు పాల్పడ్డారని ఏసీబీ అధికారులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. బాలకృష్ణ హయాంలో అనుమతులు ఇచ్చిన వాటిపై దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. అక్రమాలకు తనవారు అవసరమని భావించిన బాలకృష్ణ బంధువులను ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు నియమించుకున్నారని.. కొందరు రాజకీయ నాయకులు కూడా సహకరించారని పేర్కొన్నారు. సోదాల్లో పట్టుబడిన ఆస్తులు, వస్తువులకు సంబంధించిన వివరాలపై ఎంత అడిగినా.. బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు సహకరించలేదన్నారు. అన్ని వివరాలు బయటపడాలంటే ఇప్పటికే అరెస్టయి చంచల్‌గూడ జైలులో ఉన్న బాలకృష్ణను తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు.

డ్రైవర్‌ పేరిట రూ.20 కోట్ల ఆస్తులు
బాలకృష్ణ డ్రైవర్‌ పేరిట నగర శివార్లలో రూ.20 కోట్లకుపైగా (మార్కెట్‌ రేట్ల ప్రకారం) విలువైన భూములు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారానికి సంబంధించి పలు జిల్లాల రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు, ఉద్యోగులు, బ్యాంకు లాకర్ల నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు. ఆ ఆధారాలను బట్టి ఈ కేసుతో సంబంధమన్న వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతు­న్నారు. బినామీల్లో ఒకరు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఉన్నట్టు గుర్తించి వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. హెచ్‌ఎండీఏ పరిధిలో ఏ పని జరగాలన్నా తొలుత ఆయన బినామీలను సంప్రదించాకే అధికారుల వద్దకు వెళ్లేలా బాలకృష్ణ ప్రత్యేకంగా ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు కూడా విచారణలో తేలిందని ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement