విస్తారా ఎయిర్‌లైన్స్ తాత్కాలికంగా తన విమాన కార్యకలాపాలను తగ్గించుకోనుంది. పైలెట్లు, ఫస్ట్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడం ఇందుకు కారణమని తెలుస్తుంది.
వేతన సవరణకు వ్యతిరేకంగా వీరంతా అనారోగ్య సెలవులో ఉండడంతో, సోమవారం దాదాపు 50 సర్వీసులు రద్దు అయినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. మంగళవారం ఈ సంఖ్య 70కి చేరొచ్చని అంచనా. తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో పాటు పలు కారణాల వల్ల విమానాల రద్దు, ప్రయాణాల్లో ఆలస్యం చోటు చేసుకుంటోందని విస్తారా ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. విమాన సర్వీసుల రద్దుపై ప్రయాణికులకు సంస్థ క్షమాపణలు తెలిపింది. సర్వీసుల రద్దుకు కారణాలను వెల్లడించలేదు. త్వరలోనే సాధారణ స్థాయిలో కార్యకలాపాలను చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. రద్దు అయిన సర్వీసులకు చెందిన ప్రయాణికులకు ఛార్జీలు రీఫండ్ చేస్తామని చెప్పారు.
విస్తారా ఎయిర్ ఇండియాతో విలీనానికి ముందు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుండడం గమనార్హం. విస్తారా 300 కంటే ఎక్కువ దేశీయ, అంతర్జాతీయ విమానాలను నడుపుతుంది. ప్రయాణాల్లో అవాంతరాలు ఎదుర్కొంటున్న ప్యాసింజర్లను తమ గమ్యస్థానం చేర్చడానికి వైడ్-బాడీ డ్రీమ్‌లైనర్‌లు, ఎయిర్‌బస్ A321లను వాడుతున్న కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: యాపిల్ కొత్త ఆవిష్కరణల గురించి తెలుసుకోవాలా..?
గత 2-3 రోజులుగా ప్యాసింజర్ల ప్రయాణాల్లో మరింత ఆలస్యం అవుతుందని, సోషల్ మీడియాలో ఫిర్యాదులు వచ్చినట్లు తెలిసింది. దానికితోడు సోమవారం ప్రధాని మోదీ ముంబై నగర పర్యటన ఉండడంతో వీవీఐపీలు రాకపోకలు సాగించారు. దాంతో విస్తారాతోపాటు ఇతర సంస్థల విమానాలు కూడా సోమవారం 30-40 నిమిషాలు ఆలస్యం అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment