పన్ను ఆదా ప్రయోజనాన్ని ఇచ్చే ఫండ్స్‌ | Sakshi
Sakshi News home page

పన్ను ఆదా ప్రయోజనాన్ని ఇచ్చే ఫండ్స్‌

Published Mon, Jan 22 2024 7:30 AM

Tax Saving Funds Details - Sakshi

ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే పన్ను ఆదా పథకాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రారంభించడం మంచి ఆలోచన అవుతుంది. ఎందుకంటే ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చే సరికి ప్రణాళిక మేరకు పెట్టుబడులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. తద్వారా ఆశించిన మేర పన్ను ఆదాకు మార్గం సుగమం చేసుకోవచ్చు. అయితే, ప్రతి నెలా ప్రణాణళికాబద్ధంగా ఇన్వెస్ట్‌ చేయడం కాకుండా, ఆర్థిక సంవత్సరం చివర్లో పన్ను ఆదా సాధనాల్లో ఏకమొత్తంలో ఇన్వెస్ట్‌ చేసే వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. 

అలాంటి వారు ఈ తరుణంలో ఈక్విటీ పెట్టుబడులతోపాటు, పన్ను ఆదా ప్రయోజనాన్ని ఇచ్చే ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో మిరే అస్సెట్‌ ట్యాక్స్‌ సేవర్‌ ఒకటి. మూడేళ్ల లాకిన్‌ ఉండే ఈ పథకంలో రూ.1.5 లక్షల పెట్టుబడిపై సెక్షన్‌ 80సీ కింద పూర్తి పన్ను మినహాయింపులు సొంతం చేసుకోవచ్చు.  

రాబడులు
ఈ పథకం 2015 డిసెంబర్‌లో ప్రారంభం కాగా, నాటి నుంచి నేటి వరకు ఏటా 18.73 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. గడిచిన ఆరు నెలల కాలంలో రాబడులు 14.51 శాతంగా ఉన్నాయి. ఏడాది కాలంలో రాబడి 17.30 శాతంగా ఉంది. మూడేళ్లలో 18 శాతం,  ఐదేళ్లలో 19.21 శాతం, ఏడేళ్లలో ఏటా 18.55 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు రాబడులను తెచ్చి పెట్టింది. ఈ పథకం రాబడులకు ప్రామాణికంగా పరిగణించే బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐ (టోటల్‌ రిటర్న్‌ ఆన్‌ ఇండెక్స్‌)తో పోలిస్తే ఐదు, ఏడేళ్ల కాలంలో ఈ పథకంలో రెండు శాతం అధిక రాబడులు ఉన్నాయి. ఈక్విటీ ఎల్‌ఎస్‌ఎస్‌ విభాగం కంటే కూడా ఇవే కాలాల్లో ఈ పథకమే మెరుగ్గా పనిచేసింది.

పెట్టుబడుల విధానం, పోర్ట్‌ఫోలియో
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో 20431 కోట్ల ఆస్తులు ఉన్నాయి. పెట్టుబడిపై ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే ఎక్స్‌పెన్స్‌ రేషియో 1.58 శాతంగా ఉంది. 2017 నుంచి ఈక్విటీల్లో పూర్తి మొత్తంలో ఇన్వెస్ట్‌ చేస్తూ వస్తోంది.

ప్రస్తుతం తన నిర్వహణలోని ఆస్తుల్లో 98.35 శాతం ఈక్విటీలకు కేటాయించింది. మిగిలిన 1.65 శాతం నగదు నిల్వల రూపంలో ఉంది. ఈక్విటీ పెట్టుబడుల్లోనూ 67 శాతం లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్‌ కంపెనీలకు 25 శాతం కేటాయించగా, స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో 8.41 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 72 స్టాక్స్‌ ఉన్నాయి.

పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ రంగ కంపెనీలకు పెద్ద పీట వేసింది. 30.50 శాతం మేర పెట్టుబడులు ఈ రంగానికి చెందిన కంపెనీలకే కేటాయించింది.

మొదటి నుంచి ఈ పథకం బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. సేవల రంగ కంపెనీలకు 10 శాతం, ఇంధన రంగ కంపెనీలకు 9 శాతం, టెక్నాలజీ కంపెనీలకు 8.57 శాతం, హెల్త్‌కేర్‌ కంపెనీలకు 6.40 శాతం చొప్పు పెట్టుబడుల్లో కేటాయింపులు చేసింది.

Advertisement
Advertisement