నష్టాలు తగ్గుతాయి! దేశీయ ఎయిర్‌లైన్స్‌కు ఊరట | Sakshi
Sakshi News home page

నష్టాలు తగ్గుతాయి! దేశీయ ఎయిర్‌లైన్స్‌కు ఊరట

Published Tue, Aug 15 2023 9:27 AM

Indian airlines expected to report net loss Rs 5000 7000 crore in FY24 - Sakshi

ముంబై: దేశీయ ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు మరింత తగ్గుతాయని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. నష్టాలు రూ.5,000–7,000 కోట్లకు పరిమితం అవుతాయని పేర్కొంది. ప్రయాణికుల రద్దీ పెరుగుదల సానుకూలంగా ఉండడం ఎయిర్‌లైన్స్‌ ఆదాయ వృద్ధికి సాయపడుతుందని తెలిపింది.

ఏవియేషన్‌ టర్బయిన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌) ధరలు పెరిగిపోవడంతోపాటు, డాలర్‌తో రూపాయి క్షీణించడం వల్ల క్రితం ఆర్థిక సంవత్సరం (2022–23)లో ఎయిర్‌లైన్స్‌ నష్టాలు రూ.11,000–13,000 కోట్లుగా ఉండడం గమనార్హం. ప్రయాణికుల రద్దీ మెరుగ్గా ఉన్నప్పటికీ ఏటీఎఫ్‌ ధరలు త్రైమాసికం వారీగా పెరగడం, రూపాయి విలువ క్షీణించడం అనే సవాళ్లను దేశీ ఎయిర్‌లైన్స్‌ పరిశ్రమ ఎదుర్కొన్నట్టు ఇక్రా నివేదిక తెలిపింది.

ఈ ఏడాది జూలై నెలలో ప్రయాణికుల సంఖ్య 1.22 కోట్లుగా నమోదైందని, క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 26 శాతం అధికంగా ఉన్నట్టు పేర్కొంది. ఏవియేషన్‌ రంగానికి స్టెబుల్‌ రేటింగ్‌ (స్థిరత్వం) ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం వేగంగా రికవరీ కావడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే ధోరణి కొనసాగుతుందన్న అంచనాతో స్థిరత్వం రేటింగ్‌ను ఇచ్చింది.

గణనీయంగా తగ్గిన నష్టాలు 
ఎయిర్‌లైన్స్‌ పరిశ్రమ 2021–22లో రూ.23,500 కోట్లు నష్టపోవడం గమనార్హం. దీంతో పోలిస్తే 2022–23లో నష్టాలు గణనీయంగా తగ్గాయి. తొలుత రూ.17,000 కోట్ల వరకు రావచ్చని ఇక్రా అంచనా వేయగా, వాస్తవ నష్టాలు రూ.11,000–13,000 కోట్లకు పరిమితం అయ్యాయి.

ఎయిర్‌లైన్స్‌ సంస్థలు కాస్ట్‌ ఆఫ్‌ అవైలబుల్‌ సీట్‌ కిలోమీటర్‌ను మెరుగుపరుచుకున్నాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు క్రితం ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే సగానికి తగ్గుతాయని అంచనా. పరిశ్రమలో టారిఫ్‌ల పరంగా క్రమశిక్షణ నెలకొనడంతో ఈ ధోరణి కొనసాగుతుందని ఇక్రా తెలిపింది. ఏటీఎఫ్‌ ధరలు కొంత తగ్గడం కలిసొస్తుందని పేర్కొంది.

జూలైలో విమానయానం 25 శాతం అప్‌.. 
దేశీయంగా విమాన ప్రయాణీకుల సంఖ్య జూలైలో 25 శాతం ఎగిసింది. 1.21 కోట్లుగా నమోదైంది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం గతేడాది జూలైలో విమాన ప్రయాణికుల సంఖ్య 97.05 లక్షలుగా నమోదైంది. తాజాగా గత నెల విమానయాన సంస్థ ఇండిగో 76.75 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా 63.4 శాతం మార్కెట్‌ వాటా దక్కించుకుంది.

టాటా గ్రూప్‌లో భాగమైన ఎయిరిండియా 11.98 లక్షల మంది ప్రయాణికులు 9.9 శాతం మార్కెట్‌ వాటాతో తర్వాత స్థానంలో ఉంది. ఇక టాటా సన్స్, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ జాయింట్‌ వెంచర్‌ అయిన విస్తార 10.20 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి 8.4 శాతం మార్కెట్‌ వాటా దక్కించుకుంది.

ఎయిరిండియా అనుబంధ సంస్థ ఎయిర్‌ఏషియా ఇండియా (ఏఐఎక్స్‌ కనెక్ట్‌) 9.01 లక్షల ప్రయాణికులు (7.5 శాతం వాటా), ఆకాశ ఎయిర్‌ 6.24 లక్షల మంది ప్యాసింజర్లను (5.2 శాతం వాటా) గమ్యస్థానాలకు చేర్చాయి. సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్‌ 5.04 లక్షల మంది ప్రయాణికులు, 4.2 శాతం మార్కెట్‌ వాటా నమోదు చేసింది. సమయ పాలన విషయంలో ఇండిగో 86.8 శాతంతో అగ్ర స్థానంలో నిల్చింది.  

Advertisement
Advertisement