IBM Employee On Sick Leave For 15 Years But Sues Company, Know Reason Inside - Sakshi
Sakshi News home page

‘నాకు జీతం పెంచడం లేదు సార్‌’, కోర్టుకెక్కిన ఉద్యోగి..కంగుతిన్న ఐబీఎం!

Published Mon, May 15 2023 12:50 PM

IBM Employee On Sick Leave For 15 Years But Sues Company, Know Why - Sakshi

ప్రముఖ దిగ్గజ టెక్‌ కంపెనీ ఐబీఎంకు భారీ షాకిచ్చాడో ఓ ఉద్యోగి. పనిచేయకుండా 15 ఏళ్ల నుంచి నెల నెలా ఠంచన్‌గా జీతం తీసుకుంటున్నాడు. పైగా సంస్థ తనకు జీతం పెంచడం లేదని, కంపెనీ తన వైకల్యం పట్ల కంపెనీ వివక్ష చూపుతుందని కోర్టు మెట్లెక్కాడు. మరి చివరికి కోర్టులో ఉద్యోగికి న్యాయం జరిగిందా? లేదంటే ఐబీఎంకు అనుకూలంగా తీర్పిచ్చిందా? 

ఇయాన్ క్లిఫోర్డ్ సీనియర్‌ ఐటీ ఉద్యోగి. అనారోగ్యం కారణంగా 2008 సెప్టెంబర్‌ నుంచి సిక్‌ లీవ్‌లో ఉన్నాడు. సహృదయంతో నిబంధనలకు అనుగుణంగా ఐబీఎం ప్రతినెల జీతాన్ని ఇయాన్‌ ఖాతాలో జమ చేసేది. ఈ క్రమంలో 2013లో ఐబీఎంపై ఫిర్యాదు చేశాడు. ఐదేళ్ల నుంచి తన జీతాన్ని ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించాడు. అధికారుల వద్ద మొరపెట్టుకున్నాడు. 

దీంతో కంగుతిన్న ఐబీఎం యాజమాన్యం అతనితో ఓ ఒప్పొందానికి వచ్చింది. సంస్థపై ఫిర్యాదు చేయకూడదు. అందుకు ప్రతిఫలంగా 8,685 పౌండ్లు (సుమారు రూ.9 లక్షలు) అదనంగా చెల్లించింది. పైగా ఉద్యోగిగానే పరిగణిస్తూ వేతన ప్యాకేజీ (72,037 పౌండ్లు)లో 75 శాతం మేర ఏటా 54,000 పౌండ్లు (సుమారు రూ.55.31 లక్షలు) 65 ఏళ్లు వచ్చే వరకు ఐబీఎం వేతనం అందిస్తూ వచ్చింది.  

ఈ తరుణంలో ఇయాన్ మరో సారి ఐబీఎం ఉన్నతాధికారుల్ని ఆశ్రయించాడు. పెరిగిన ఖర్చులతో పోల్చితే హెల్త్‌ ప్లాన్‌ కింద తనకు అందే వేతనం చాలా తక్కువ. కాబట్టి తన వేతనం పెంచాలని కోరారు. అందుకు సంస్థ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. దీంతో చేసేది లేక 2022 ఫిబ్రవరిలో ఎంప్లాయిమెంట్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు. తన వైకల్యం పట్ల ఆ కంపెనీ వివక్ష చూపుతున్నదని ఆరోపించాడు.

ఇయాన్ క్లిఫోర్డ్ ఆరోపణలను కోర్టు ఖంఢించింది. ‘సంస్థ వైద్యం చేయిస్తుంది, ప్రయోజనం చేకూర్చే ప్యాకేజీనీ అందిస్తుందని న్యాయమూర్తి తెలిపారు. కాకపోతే పెరిగిన నిత్యవసర వస్తుల ధరలతో ఇయాన్‌కు సంస్థ ఇచ్చే వేతనం సరిపోకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, సంస్థపై అతను చేసిన వివక్ష ఆరోపణల్ని, శాలరీ పెంచాలన్న అభ్యర్థనను సున్నితంగా తిరస్కరిస్తూ తీర్పిచ్చారు.

చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్‌? అదేంటంటే?

Advertisement
Advertisement