Sakshi News home page

శత్రు సైన్యానికి చెక్‌ పెట్టేలా.. రంగంలోకి దిగిన మస్క్‌

Published Sun, Mar 17 2024 11:38 AM

Elon Musk's Spacex Is Developing Spy Satellites For Usa - Sakshi

అపర కుబేరుడు, టెస్లా సీఈవో ఎలోన్‌ మస్క్‌ అమెరికా మిలటరీ విభాగంలో అత్యంత కీలకంగా మారారు. ఇప్పటికే ప్రపంచంలోనే పలు దేశాలకు శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల్ని అందిస్తున్న ఆయన తాజాగా అమెరికా సైన్యానికి స్పేస్‌ ఎక్స్‌ స్పై శాటిలైట్‌లను తయారు చేసే పనిలో పడ్డారు.  

రాయిటర్స్‌ నివేదిక ప్రకారం.. మస్క్‌ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్‌ స్పై శాటిలైట్‌ కార్యకలాపాలు నిర్వహించే అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ యూఎస్‌  నేషనల్ రికనైసెన్స్ ఆఫీస్ (ఎన్‌ఆర్‌ఓ)తో కలిసి వందలాది స్పై శాటిలైట్‌లను నిర్మిస్తున్నారు. 2021లో స్పేస్ టెక్‌ దిగ్గజం , ఎన్‌ఆర్‌ఓల మధ్య 1.8 బిలియన్ల భారీ ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా స్పేస్‌ఎక్స్‌ స్టార్‌షీల్డ్ బిజినెస్ యూనిట్ ఈ స్పై శాటిలైట్లను తయారు చేస్తోంది.  

స్ప్పై శాటిలైట్ల వల్ల ఉపయోగం
అమెరికా ఇంటెలిజెన్స్‌, ఆర్మీ నిర్వహించే పలు ప్రాజెక్ట్‌లలో స్పేస్‌ ఎక్స్‌ తయారు చేస్తున్న స్పై శాటిలైట్‌లు కీలక పాత్ర పోషించనున్నాయి. ముఖ్యంగా ప్రత్యర్ధి దేశాలు నిర్వహించే అణు పరీక్షలను గుర్తించడం, సైనికుల పహారా, బాంబుల వల్ల కలిగే నష్టాన్ని అంచనా వేయడం, శత్రు సామర్థ్యం గురించి పసిగట్టడంలో ఈ స్పై శాటిలైట్‌లు పనిచేస్తాయి. ఇలా శత్రు సైన్యాలు ఎత్తుల్ని ముందే పసిగట్టి అమెరికా ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందిస్తాయి.  

మిలటరీ సామ్రాజ్యాన్ని పటిష్ట పరిచేలా 
మస్క్‌ నిర్వహిస్తున్న ఈ కీలక ప్రాజెక్ట్‌ విజయవంతమైతే అగ్రరాజ్యం అమెరికా ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల సైనికుల కదలికల్ని గుర్తిస్తుంది. తద్వారా మిలటరీ సామ్రాజ్యాన్ని మరింత అభివృద్ది చేసుకోవాలని భావిస్తోంది. 

Advertisement

What’s your opinion

Advertisement