వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు మరో ఐటీ కంపెనీ మంగళం! | Cognizant Asks India Employees To Work From Office Thrice A Week, Know What CEO Said In Memo - Sakshi
Sakshi News home page

Cognizant Work From Home Update: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు మరో ఐటీ కంపెనీ మంగళం! కొత్త యాప్‌ కూడా సిద్ధం..

Published Thu, Feb 29 2024 7:53 AM

Cognizant asks India employees to work from office - Sakshi

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న ఐటీ ఉద్యోగులకు మరో కంపెనీ ఆఫీసుకి పిలిచింది. ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ భారత్‌లోని తమ ఉద్యోగులను వారానికి కనీసం మూడురోజులు ఆఫీసుకి వచ్చి పని చేయాలని కోరినట్లు ఒక నివేదిక తెలిపింది. దీంతో రిమోట్ వర్కింగ్‌ను ముగించిన తాజా కంపెనీగా కాగ్నిజెంట్‌ అవతరించింది. 

వారానికి సగటున మూడు రోజులు ఆఫీసులో ఉండాలని, టీమ్ లీడర్ సూచన మేరకు నడుచుకోవాలంటూ భారత్‌లోని ఉద్యోగులకు గత వారం కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ పంపిన మెమోను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ కథనం పేర్కొంది. అయితే ఎప్పటి నుంచి ఈ ఆదేశాలు అమలవుతాయన్నది కంపెనీ పేర్కొనలేదని నివేదిక తెలిపింది.

ఆఫీసు నుండి పని చేయడం వల్ల కంపెనీ సంస్కృతిపై మంచి సహకారం, అవగాహన లభిస్తుందని కాగ్నిజెంట్ చెబుతోంది. అయితే దీని వల్ల ఫ్లెక్సిబులిటీ, వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌ దెబ్బతింటాయని చాలా మంది ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఆఫీస్‌లో కలిసి పనిచేస్తూ సహకార ప్రాజెక్ట్‌లు, ట్రైనింగ్‌, టీమ్ బిల్డింగ్ వంటి అంశాలకు సమయం కేటాయించాలని కంపెనీ సీఈవో కోరుతున్నారు.

కొత్త యాప్‌
భారత్‌ కోసం కొత్త హైబ్రిడ్-వర్క్ షెడ్యూలింగ్ యాప్‌ను కూడా కాగ్నిజెంట్ ప్రారంభించనుంది. ఇది మేనేజర్‌లకు షెడ్యూల్‌లను సమన్వయం చేయడంలో, వారి టీమ్‌ల కోసం ఆఫీస్‌లో స్పేస్‌ను రిజర్వ్ చేయడంలో సహాయపడుతుందని మెమోలో పేర్కొన్నారు.

కాగ్నిజెంట్ 3,47,700 మంది ఉద్యోగులను కలిగి ఉంది. వారిలో దాదాపు 2,54,000 మంది భారతదేశంలోనే ఉన్నారు. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్‌తో సహా అనేక భారతీయ ఐటీ కంపెనీలు ఆఫీస్‌కి వచ్చి పనిచేయాలని ఉద్యోగులను ఇప్పటికే కోరాయి. మార్చి 31 నాటికి ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయడాన్ని టీసీఎస్‌ తప్పనిసరి చేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement