మహిళా సాధికారతకు దన్నుగా నిలిచాం: సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

మహిళా సాధికారతకు దన్నుగా నిలిచాం: సీఎం జగన్‌

Published Tue, Jan 23 2024 2:03 PM

YSR Asara: CM YS Jagan Uravakonda Speech About AP Women Empowerment - Sakshi

అనంతపురం, సాక్షి: మహిళా సాధికారత సాధన.. సంక్షేమం అమలులో ఆంధ్రప్రదేశ్‌.. దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత నిధుల్ని మంగళవారం ఉరవకొండలో విడుదల చేశారాయన. అంతకు ముందు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.  

‘‘చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాల మధ్య ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఉరవకొండ నుంచి చేస్తున్నాం.  నాలుగు సంవత్సరాల క్రితం మనందరి ప్రభుత్వం ప్రారంభించిన వైయస్సార్‌ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడి నుంచి బటన్‌ నొక్కి ఆ వాగ్దానాన్ని ఈరోజు పూర్తి చేయబోతున్నాం. దేశ చరిత్రలోగానీ, మహిళా చరిత్రలోగానీ, మహిళా సాధికారతకు ఇంత బాధ్యతగా ఇంత మమకారం చూపుతూ ఈ 56 నెలల్లో మనం చేసిన ఈ ఒక్క పథకానికి సంబంధించి ఏకంగా ఈరోజు సొమ్ముతో కూడా కలుపుకొంటే అక్షరాలా రూ.25,570 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 

.. ఈరోజు నేను గర్వంగా చెబుతున్నా. దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా 21 శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన గడ్డమీద, గడపగడపలోనూ అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో 56 నెల్లలో ప్రతి అడుగూ మీ బిడ్డ ప్రభుత్వం వేసింది. మహిళా సాధికారతకు దన్నుగా ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా 56 నెలల్లో సంక్షేమం, అభివృద్ధిలో తేడా కనిపించే విధంగా అడుగులు పడుతున్నాయి. అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటే వివక్షకు, లంచాలకు చోటు లేకుండా ప్రతి పథకం మన రాష్ట్రంలో అమలవుతోంది. 

అర్హత కేవలం అదే.. 
ఈరోజు రూ.6,400 కోట్లు నా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు నేరుగా ఇచ్చేలా అడుగులు వేస్తున్నాం. ఈ ఒక్క పథకానికి(వైఎస్సార్‌ ఆసరా) సంబంధించి 25,570 కోట్లు ఈరోజు మనం ఖర్చు చేస్తున్నాం.  79 లక్షల మందికి మంచి జరిగిస్తూ ఇప్పటికే 3 దఫాల్లో రూ.19,178 కోట్లు ఇవ్వడమే కాక, నాలుగో దఫా కింద రూ.6,400 కోట్లు కలుపుకొంటే రూ.25,570 కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా పోతోంది. ఈ 56 నెలల కాలంలో అక్కచెల్లెమ్మలను చేయి పట్టుకొని నడిపిస్తూ సున్నా వడ్డీ కింద 4968 కోట్లు నా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మీ బిడ్డ ప్రభుత్వం నేరుగా అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది. వాళ్ల కాళ్ల మీద నిలబెట్టడం కోసం వైయస్సార్‌ సున్నా వడ్డీ, వైయస్సార్‌ ఆసరా రెండు కార్యక్రమాలు తీసుకుంటే 31వేల కోట్లు నా అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. 

ఈరోజు నేడు విడుదల చేస్తున్న రూ. 6,400 కోట్లతో కలుపుకొంటే మనందరి ప్రభుత్వం 56 నెలల కాలంలో నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కడం, నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పంపిన సొమ్ము రూ.2.53 లక్షల కోట్లు. ఎక్కడా ఎవరూ ఎవరికి ఇస్తున్నాం అనేది వ్యత్యాసం చూపించడం లేదు. గతంలో ఏ పథకం కావాలన్నా మొదట అడిగే ప్రశ్న మీరు ఏ పార్టీ వారు అని? అంతటితో ఆగిపోయేది కాదు జన్మభూమి కమిటీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి దాకా ప్రతి ఒక్కరికీ లంచాలు. ఈరోజు 2.53 లక్షల కోట్లు ఎక్కడా కులం చూడటం లేదు, మతం, ప్రాంతం, వర్గం, చివరికి మీరు ఏ పార్టీ అని కూడా చూడకుండా  మన పార్టీకి ఓటు వేయకపోయినా అర్హత మాత్రమే ప్రమాణికంగా ప్రతి కుటుంబానికి పోతోంది. 

ఇంటింటా అక్కచెల్లెమ్మల మీద ఇంత బాధ్యతగా మమకారం చూపుతున్న ప్రభుత్వం మనది మాత్రమే. 56 నెలల పాలనలోనే ఒక్క జగనన్న అమ్మ ఒడి అనే పథకం ద్వారా అక్షరాలా 57 లక్షల మంది తల్లులకు మంచి జరిగిస్తూ వారికిచ్చిన సొమ్ము రూ.26.67 వేల కోట్లు. వైయస్సార్‌ ఆసరా ద్వారా 79 లక్షల మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రూ.25500 కోట్లు ఇవ్వడం జరిగింది. ఒక్క వైయస్సార్‌ చేయూత పథకం ద్వారా 45-60 సంవత్సరాల మధ్యలో ఉన్న అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఏకంగా 31.23 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ వారు బాగుండాలని, చిరునవ్వులు చూడాలని అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది రూ.14,129 కోట్లు. 31 లక్షల అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు 22లక్షల ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నది కూడా కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే. ఈ కడుతున్న ఇళ్లు పూర్తయితే రూ.2.70 లక్షలతో ఇళ్లు కడుతున్నాం. ఒక్కో ఇంటి విలువ ప్రాంతాన్ని బట్టి రూ.5-20 లక్షల దాకా పలుకుతోంది. వాళ్లకు ఇస్తున్న ఆస్తి విలువ రూ.2-3 లక్షల కోట్లు.

అవ్వా.. బాగున్నావా? అంటూ.. 
అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద తమ కాళ్ల మీద నిలబెట్టేందుకు కోటీ 5 లక్షల మందికి మంచి జరిగిస్తూ ఇచ్చినది రూ.4,968 కోట్లు. 25.40 లక్షల మంది తల్లులకు మంచి జరిగిస్తూ పిల్లల కోసం విద్యాదీవెన కింద రూ.11,900 కోట్లు, వసతి దీవెన కింద రూ.4275 కోట్లు ఇచ్చాం. కాపు అక్కచెల్లెమ్మలకు కాపు నేస్తం కింద రూ.2.28 వేల కోట్లు ఇచ్చాం. ఈబీసీ నేస్తం కింద రూ.1,257 కోట్లు ఇచ్చాం. పేదల పెన్షన్‌ అందుకుంటున్న వారు 66.34 లక్షల మంది. ఇందులో 43,78,000 మంది పెన్షన్లు అందుకుంటున్న వారు నా అవ్వలు, నా అక్కచెల్లెమ్మలే. 

ఏ ఒక్కరూ రోడ్డు మీదకు రావాల్సిన అవసరం లేకుండా, అవస్థలు పడాల్సిన అవసరం లేకుండా పొద్దున్నే గుడ్‌ మార్నింగ్‌ చెబుతూ చిరునవ్వుతో ఏకంగా వాలంటీర్‌ ఇంటికి వచ్చి అవ్వా బాగున్నావా అని అడుగుతూ పెన్షన్‌ సొమ్ము చేతిలో పెట్టి పోతున్నారంటే ఇది జరుగుతున్నది మీ బిడ్డ ప్రభుత్వంలోనే. పెన్షన్ల సొమ్ము కింద ఖర్చు చేసిన సొమ్ము రూ.84,730 కోట్లు. ఇందులో 56,000 కోట్లు అవ్వలు, అక్కచెల్లెమ్మల కోసం ఖర్చు చేశాం. జగనన్న తోడు ద్వారా ఇచ్చిన వడ్డీ లేని రుణాలు రూ.2,610 కోట్లు అయితే, చేదోడు ద్వారా వాళ్లకు ఇచ్చిన సొమ్ము రూ.404 కోట్లు. ఇన్ని కార్యక్రమాలు ఇవన్నీ కూడా గతంలో ఈ మాదిరిగా అక్కచెల్లెమ్మల గురించి ఆలోచన చేసిందిగానీ, పట్టించుకున్నదిగానీ ఎప్పుడైనా చూశామా?. 

గతంలో కూడా ఒక పాలన ఉండేది. అప్పుడు కూడా ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్‌. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. మిగలినవన్నీ మామూలే.అప్పుల గ్రోత్‌ రేటు కూడా అప్పటికన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో తక్కువే. మరి మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి అక్కచెల్లెమ్మ  ముఖాన చిరునవ్వు ఎలా కనిపిస్తోంది. గతంలో ఎందుకు ఈ మంచి జరగలేదనేది ఆలోచన చేయమని అడుగుతున్నా. కారణం ఒక్కటే.గతంలో దోచుకో, పంచుకో, తినుకో. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో బటన్‌ నొక్కుతున్నాడు. నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతున్నాయి. ఎవరూ లంచం అడగడం లేదు, వివక్ష చూడం లేదు. 

దేశం మొత్తం వినిపించాలి.. 
వచ్చే 14 రోజులపాటు ఫిబ్రవరి 5వ తేదీ దాకా పండుగ వాతావరణంలో నాలుగో విడత వైయస్సార్‌ ఆసరా కార్యక్రమం పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రూ.6,400 కోట్లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాలు పంచుకుంటారు. అక్కచెల్లెమ్మల సంతోషాల్లో వీళ్లు ఏకమవుతారు. గ్రామ సచివాలయాల్లో మాట్లాడినప్పుడు అక్కచెల్లెమ్మలకు మైకులిచ్చి ఈ 56 నెలల కాలంలో ఏ రకంగా మహిళా సాధికారత జరిగింది, అక్కచెల్లెమ్మల జీవితాలు బాగుపడ్డాయన్న కథలు.. రాష్ట్రానికే కాదు.. దేశానికే వినిపించాలి. 

చంద్రబాబు చేసిన మోసం గుర్తుంది కదా?
2014 ఎన్నికల ముందు చంద్రబాబు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని, కట్టొద్దని చెప్పాడు. ఆ మాటలు నమ్మి ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశాడు. కనపడకుండా చేశాడు. మాఫీ చేస్తానని చెప్పిన మాట గాలికొదిలేశాడు. అక్టోబర్‌ 2016 నుంచి అక్కచెల్లెమ్మలకు కడుతున్న సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశాడు. అప్పట్లో 14,205 కోట్లు ఉన్న పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు కాస్తా తడిసి మోపెడై వడ్డీలు,చక్రవడ్డీలు కట్టే పరిస్థితిలోకి పోయి 25500 కోట్లకు ఎగబాకాయి. చంద్రబాబు మాటతో ఏ రకంగా అక్కచెల్లెమ్మలు దెబ్బతిన్నారన్నదానికి ఇవే ఉదాహరణలు. ఏ గ్రేడ్‌, బీ గ్రేడ్‌ నుంచి సంఘాలు చంద్రబాబు హయాంలో 19 శాతానికి పడిపోయాయి. 

కానీ, ఇవాళ.. 
ఈరోజు అవే సంఘాలు తలెత్తుకొని నిలబడుతున్నాయి.  ఈరోజు ఏకంగా 91 శాతం అక్కచెల్లెమ్మలు ఏ గ్రేడ్‌, బీ గ్రేడ్‌లో సంఘాలు ఉన్నాయి.ఔట్‌ స్టాండింగ్‌ కింద 18 శాతం అక్కచెల్లెమ్మల రుణాలు ఎన్‌పీఏలుగా పడిపోయే కార్యక్రమం అప్పట్లో జరిగితే.. ఈరోజు పొదుపు సంఘాల్లో రుణాల రికవరీ 99.83 శాతంతో ఎన్‌పీఏలు కేవలం 0.17 శాతం మాత్రమే కనిపిస్తున్నాయి. అక్కచెల్లెమ్మల సాధికారత ఉద్యమానికి మనందరి ప్రభుత్వం ఎంతగా నిలబడగలిగిందని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలే. ప్రతి అడుగులోనూ అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి, వాళ్ల కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని తపన, తాపత్రయంతో అడుగులు పడిన రోజులు ఈ 56 నెలల కాలంలోనే. 
సాధికారత దిశగా అడుగులు వేసే కార్యక్రమం జరిగింది. ఏకంగా అక్కచెల్లెమ్మలకు నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం వారికే ఇచ్చేట్టుగా చట్టం చేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని అడుగులు పడ్డాయి. నామినేషన్‌ పనుల్లో ఇచ్చే కాంట్రాక్ట్‌ పనులు కూడా 50 శాతం అక్కచెల్లెమ్మలకే ఇవ్వాలని చట్టం చేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. 

భద్రత విషయంలోనూ.. 
దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా భద్రతపై ధ్యాస పెట్టిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వమే. ప్రతి గ్రామంలో ఒక సచివాలయం, ఒక మహిళా కానిస్టేబుల్‌ నియమితులయ్యారు. దిశ యాప్‌ తీసుకొచ్చాం. ప్రతి అక్కచెల్లెమ్మల ఫోన్లలో 1.46 కోట్ల మంది ఫోన్లలో దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ అయ్యింది. ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కితే చాలు, ఐదు సార్లు ఫోన్‌ షేక్‌ చేసినా చాలు.. పోలీస్‌ సోదరుడి దగ్గర నుంచి ఫోన్‌ వస్తుంది. 10 నిమిషాల్లోనే పోలీస్‌ సోదరుడు వచ్చి ఏమైందని అడిగే గొప్ప వ్యవస్థ పుట్టుకొచ్చింది కూడా మీ బిడ్డ పరిపాలనలోనే అని సీఎం జగన్‌ ప్రసంగించారు.

ఇదీ చదవండి: రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ.. బాబుకు ప్రచారం: సీఎం జగన్‌ ఫైర్‌

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement