ఓర్వలేకే ప్రభుత్వంపై టన్నుల కొద్దీ విషం | Sakshi
Sakshi News home page

ఓర్వలేకే ప్రభుత్వంపై టన్నుల కొద్దీ విషం

Published Tue, Nov 28 2023 4:38 AM

Sajjala Ramakrishna Reddy Fires On Yellow Media Fake News - Sakshi

సాక్షి, అమరావతి: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రభుత్వంపై  పచ్చ మీడియా విషం చిమ్ముతోందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. మీడియా ముసుగేసుకుని రోజూ టన్నుల కొద్దీ కథనాలు అచ్చేస్తున్న రెండు పచ్చ పత్రికలను నమ్మవద్దంటూ ప్రజలకు సూచించారు.

ఉగ్రవాదం కంటే నీచమైన స్థాయికి పచ్చ పత్రికలు దిగజారి­పోయాయని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేశ్, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలపై విరుచు­కు­పడ్డారు. సెప్టిక్‌ ట్యాంక్‌లో చేపలు పట్టే స్థాయికి దిగజారి అభూతకల్పనలతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న ఆ పత్రికలను చూసి చంద్రబాబు ఊహల్లో విహరిస్తున్నారంటూ దెప్పి­పొడిచారు.

ప్రభుత్వంపై తాము చేస్తున్న విషప్రచారాన్ని బలవంతంగానైనా ప్రజలపై రుద్దేందుకు ఈనాడు పత్రికను రామోజీరావు కొంత మందికి ఉచితంగా వేస్తున్నారని.. ఆ పత్రిక మిగతా పాఠకులు తమకు కూడా ఉచితంగా వేయాలని డిమాండ్‌ చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని ప్రజలు భూస్థాపితం చేయడం.. వైఎస్సార్‌సీపీని మరోసారి తిరుగులేని ఆధిక్యంతో గెలిపించడం ఖాయమన్నారు. మీడియాతో మాట్లాడుతూ సజ్జల ఇంకా ఏమన్నారంటే...

మీ పార్టీ వారికి సంక్షేమం ఆగిందా..
సీఎం వైఎస్‌ జగన్‌ మేనిఫెస్టో హామీల్లో ఇప్పటికి 99.5 శాతం అమలు చేశారు. చంద్రబాబులా హామీలు ఇచ్చి తర్వాత అమలు చేయకుండా పారిపోయే పద్ధతిని మార్చేశారు. అర్హత ఉన్న టీడీపీ వారికి ఒక్కరికైనా సంక్షేమ పథకాలు ఆగాయా? అని చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ, పవన్‌లను ప్రశ్నిస్తున్నా. గతంలో జన్మభూమి కమిటీల ద్వారా దోచుకున్నారేగానీ ప్రజలకు టీడీపీ సర్కార్‌ చేసిందేమీ లేదు. టీడీపీ హయాంలోని వంద పథకాలను ఆపేశారని రెండు పచ్చ పత్రికల్లో దుష్ప్రచారం చేస్తున్నారు. అప్పట్లో ఏవైనా పథకాలు అమలు చేసి ఉంటే కదా మేం ఆపడానికి? 

ఉచిత ఇసుకైతే జరిమానా ఎందుకు?
చంద్రబాబు హయాంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేశారు. ఆ విధానంలో కేవలం ట్రాన్స్‌పోర్ట్‌ చార్జీలే వసూలు చేయాలి. మరి పెద్ద పెద్ద బిల్డర్లకు ఇసుక ఎవరిచ్చారు? ఆనాడు చంద్రబాబు ఇంటి పక్కనే డ్రెడ్జర్లు, జేసీబీలు, క్రేన్లు పెట్టి ఇసుకను తరలించడం రాష్ట్రమంతా చూసింది. ఉచితమే అయితే దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఎమ్మార్వో వనజాక్షిపై దాడి ఎందుకు చేశాడు? ఎన్జీటీ ఎందుకు చంద్రబాబు సర్కార్‌కు రూ. వంద కోట్ల పెనాల్టీ వేసింది? అప్పట్లో వాటిపై ఒక్క కథనమైనా పచ్చ పత్రికలు రాశాయా?. ఇప్పుడు అత్యంత పారదర్శకంగా.. రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో టెండర్లు నిర్వహిస్తూ ఇసుక తవ్వకాలను అప్పగిస్తున్నాం.

పచ్చళ్ల వ్యాపారం చేసే రామోజీరావును కూడా ఈ టెండర్లలో పాల్గొనమని చాలా సార్లు చెప్పాం. అయినా.. ఇసుక తవ్వకాలపై తప్పుడు కథనాలు అచ్చేస్తూనే ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు వేలాదిగా హాజరవుతున్న.. వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార యాత్రలపైనా విషం చిమ్ముతున్నారు. వాళ్లు రాస్తున్న అబద్ధపు రాతలపై రోజూ ఫ్యాక్ట్‌ చెక్‌ ద్వారా నిజమేంటో ప్రజలకు చెబుతున్నాం. 

దోపిడీ దొంగ చంద్రబాబు హీరోలా కనిపిస్తున్నాడా?
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు టెండర్ల వ్యవస్థను నీరుగార్చి.. 4.95 శాతం అధిక ధరలకు కాంట్రాక్టర్లకు కట్టబెట్టి భారీ ఎత్తున కమిషన్లు వసూలు చేసుకున్నారు. పోలవరంలో ట్రాన్స్‌­ట్రాయ్‌కు ఇంప్రెస్ట్‌ అమౌంట్‌ పేరుతో రూ. 250 కోట్లు, బ్యాంకు గ్యారెంటీలు, మొబిలైజేషన్‌ అడ్వాన్సు పేరుతో రూ. 700 కోట్లు ఇచ్చేశారు. ఆ తర్వాత నవయుగకు నామినేషన్‌పై రూ. 3 వేల కోట్లు పనులు అప్పగించారు. చేయని పనులకు రూ. 106 కోట్లు బిల్లులు చెల్లించారు. ఆఖరకు మజ్జిగ టెండర్‌ను కూడా హెరిటేజ్‌ పేరుతో కొట్టేశారు.

అలాగే చంద్రన్న కానుకలో చెడిపోయిన నెయ్యిని సరఫరా చేసిన హెరిటేజ్‌కు రూ. కోట్లు కట్టబెట్టారు కదా. ప్రస్తుత ప్రభుత్వం జగనన్న ఇళ్ల పథకానికి సిమెంట్‌ ధరలు తగ్గించి, లబ్ధిదారులకు మేలు చేసింది. దానిలో భాగంగా అన్ని సిమెంట్‌ కంపెనీలతోపాటు భారతి సిమెంట్స్‌ కూడా తక్కువ ధరకు సిమెంటును లబ్ధిదారులకు అందించింది. మరుగుదొడ్ల నిర్మాణంలో పసుపు రంగు వేయడం నుంచి నీరు–చెట్టు వరకూ అడ్డంగా దోచేసిన చంద్రబాబు.. రామోజీ, రాధాకృష్ణలకు హీరోలా కనిపిస్తున్నాడు.

 చంద్రబాబు, దత్తపుత్రుడు, ఉత్తపుత్రుడు రాష్ట్రంలో కాపురం ఉండరు. రామోజీ, రాధాకృష్ణ కూడా పక్క రాష్ట్రంలోనే ఉంటారు. కానీ పెత్తనం ఇక్కడ చేయాలనుకుంటారు. వీళ్ల వ్యాపారాలు బాగుండాలి. రాజకీయం చేయాలి.. రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకోవాలనేదే వారి కోరిక.

జోకర్‌ మళ్లీ వచ్చాడని జనం భావిస్తున్నారు
లోకేశ్‌ మళ్లీ పాదయాత్రను మొదలు పెట్టి.. భయాన్ని పరిచయం చేస్తానంటున్నాడు. మీ నాన్న అరెస్టయిన రోజు ఏడ్చుకుంటూ ఢిల్లీ వెళ్లి ఇన్నాళ్లు ఎందుకు దాక్కున్నావ్‌ లోకేశ్‌? అసలు భయం, భయపడటం అనే ప్రశ్న రాజకీయాల్లో ఎందుకొస్తుంది? జగన్‌ పరిపాలనలో ఎత్తి చూపడానికి లోపమంటూ ఏమీ లేదు. ఇక లోకేశ్‌కు బూతులు తప్ప ఏమొస్తాయి? నవ్వుకోడానికి ఒక జోకర్‌ దూరం అయ్యాడని జనం అనుకున్నారు.. ఇప్పుడు మళ్లీ వచ్చాడు. 

Advertisement
Advertisement