రాజధాని రాష్ట్ర పరిధిలోనిదే.. | Sakshi
Sakshi News home page

రాష్ట్ర పరిధిలోనిదే..

Published Fri, Aug 14 2020 4:36 AM

AP Government Reported To High Court About Capital In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర పరిధిలోని విషయమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ మేరకు గురువారంనాడు హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసింది. రాజధాని విషయం తమ పరిధిలోనిది కాదని, రాష్ట్ర పరిధిలోనిదని కేంద్ర ప్రభుత్వం కూడా హైకోర్టుకు తన కౌంటర్‌లో చాలా స్పష్టంగా తెలిపిందని గుర్తుచేసింది. రాజధానితో సహా అన్ని అభివృద్ధి కార్యక్రమాలను, ప్రణాళికలను సమీక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందని అందులో పేర్కొంది. 

ప్రత్యేక హోదా డిమాండ్‌ను విడిచిపెట్టలేదు..
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ హామీని అమలుపరిచేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నామని రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ను తాము విడిచిపెట్టలేదని, ప్రతీ సమావేశంలోనూ, పార్లమెంట్‌లో సందర్భం వచ్చినప్పుడల్లా ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నామని కోర్టుకు తెలిపింది.

ప్రత్యేక హోదా పునర్విభజన చట్టంలో భాగంగా ఉందని, అది లేకుండా రాష్ట్ర విభజన పరిపూర్ణం కాదంది. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయంది. కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం భరించే వ్యయంలో 90 శాతం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, మిగిలిన 10 శాతాన్ని కూడా వడ్డీ లేకుండా రాష్ట్రానికి రుణంగా ఇస్తుందని తెలిపింది. కేంద్ర నిధుల్లో ప్రాధాన్యత ఉంటుందని, ఎక్సైజ్‌ డ్యూటీ రాయితీలు, కస్టమ్స్, కార్పొరేట్, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌లలో పలు మినహాయింపులు ఉంటాయని వివరించింది. ఇందుకోసమే ప్రత్యేక హోదా కోసం కేంద్రం వెంటపడుతూనే ఉన్నామని చెప్పింది. 

కార్యాలయాల తరలించరాదనడం న్యాయసమ్మతం కాదు..
పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దుపై చట్టాలు అమల్లోకి వచ్చాయని, ఇవి అమల్లో ఉండగా కార్యాలయాలను ఎక్కడికీ తరలించరాదని పిటిషనర్‌ కోరడం న్యాయసమ్మతం కాదని తెలిపింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదానివ్వడంతో పాటు పునర్విభజన చట్టంలోని పలు నిబంధనలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన పోలూరి శ్రీనివాసరావు హైకోర్టులో 2018లో పిటిషన్‌ దాఖలు చేశారు. అమరావతిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ఎక్కడికీ తరలించకుండా ఉత్తర్వులివ్వాలంటూ 2020లో ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇటీవల రాజధాని కేసుల విచారణ సందర్భంగా ఈ వ్యాజ్యం విచారణకు రాగా, కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది.

ఈ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్‌ దాఖలు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కౌంటర్‌ వేసింది. ప్రభుత్వం తరఫున పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి వి.రామమనోహరరావు కౌంటర్‌ దాఖలు చేశారు. హైకోర్టు ప్రిన్సిపల్‌ సీటు, బెంచ్‌లు ఎక్కడ ఉండాలన్న విషయం పునర్విభజన చట్టం, వికేంద్రీకరణ చట్టంలో చాలా స్పష్టంగా ఉందన్నారు. ఈ అంశంపై మహారాష్ట్ర వర్సెస్‌ నారాయణ శ్యాంరాం పురాణిక్‌ కేసులో సుప్రీంకోర్టు 1982లో చాలా స్పష్టమైన తీర్పునిచ్చిందన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement