వెంకయ్యకు పదవీ గండం..? | Sakshi
Sakshi News home page

వెంకయ్యకు పదవీ గండం..?

Published Tue, Dec 1 2015 9:08 AM

వెంకయ్యకు పదవీ గండం..? - Sakshi

బీజేపీ 'సూత్రప్రాయ నిర్ణయం'తో ప్రశ్నార్థకంగా వెంకయ్య నాయుడు భవిష్యత్తు

(సాక్షి వెబ్ ప్రత్యేకం)
కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకు పదవీ గండం ఉందా? భారతీయ జనతా పార్టీ తీసుకున్న 'సూత్రప్రాయ నిర్ణయం' కారణంగా మరో ఆరు నెలల్లో వెంకయ్య నాయుడు పదవి నుంచి తప్పుకోవలసిన పరిస్థితులు ఉన్నాయని ఆ పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశం అనేక కీలక నిర్ణయాలు చేసింది. అధికార పదవుల విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలని పార్టీ అంతర్గత సమావేశంలో నిర్ణయించింది. అందులో భాగంగానే ఒక వ్యక్తికి మూడు విడతలకు మించి రాజ్యసభకు అవకాశం ఇవ్వరాదన్న 'సూత్రప్రాయ నిర్ణయం' కూడా జరిగినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఈ పరిస్థితుల్లో బీజేపీ తరఫున ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తూ మోదీ మంత్రిమండలిలో కొనసాగుతున్న వారిలో అరుణ్‌జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, వెంకయ్యనాయుడు వంటి నేతల విషయం చర్చనీయాంశంగా మారింది. వీరిలో రవిశంకర్ ప్రసాద్, అరుణ్ జైట్లీల రాజ్యసభ పదవీ కాలం 2018లో ముగుస్తుంది. కానీ వెంకయ్యనాయుడు రాజ్యసభ పదవీ కాలం వచ్చే జూన్ నెలతో ముగుస్తుంది. బీజేపీ తాజా 'సూత్రప్రాయ నిర్ణయం'తో వెంకయ్యనాయుడు పదవి ప్రశ్నార్థకంగా మారింది. ఆయన సేవలను ఏ రకంగా ఉపయోగించుకోవాలన్న అంశం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. ఒకవేళ మరోసారి రాజ్యసభ సభ్యత్వం దక్కకపోతే మాత్రం వెంకయ్య నాయుడు ప్రస్తుతం అనుభవిస్తున్న కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పదవిని వదులుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తుత దశలో జాతీయ నాయకత్వం అనూహ్య నిర్ణయాలు తీసుకుంటే తప్ప వెంకయ్యనాయుడికి మరోసారి రాజ్యసభ అవకాశం ఇవ్వరని పార్టీ నేతలు చెబుతుంటే, ఆయన సన్నిహితులు మాత్రం ఆ వాదనను తోసిపుచ్చుతున్నారు. 2002-04 మధ్య కాలంలో పార్టీ జాతీయాధ్యక్షుడిగానే కాకుండా ప్రస్తుతం మోదీ కేబినేట్లో గురుతర బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున వెంకయ్యనాయుడికి మినహాయింపు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పైగా బీజేపీ గతంలో నాలుగుసార్లు అవకాశం కల్పించిన సందర్భాలున్నాయని గుర్తుచేస్తున్నారు.

జస్వంత్, ప్రమోద్‌లకు నాలుగుసార్లు
గతంలో జస్వంత్సింగ్, ప్రమోద్ మహాజన్లకు మాత్రమే బీజేపీ నాలుగుసార్లు అవకాశం కల్పించింది. జస్వంత్సింగ్‌కు రాజస్థాన్ నుంచి (1980 నుంచి 2010 వరకు) ఎంపిక చేయగా 2009లో లోక్‌సభకు ఎన్నికకావడంతో రాజ్యసభకు రాజీనామా చేశారు. ఇక ప్రమోద్ మహాజన్ను మహారాష్ట్ర నుంచి (1986 నుంచి 2010 మధ్య కాలంలో) నాలుగుసార్లు రాజ్యసభకు ఎంపిక చేసింది. అయితే ఆయన 2006లోనే సోదరుడు జరిపిన కాల్పుల ఘటనలో మరణించిన విషయం తెలిసిందే. అయితే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వారికి నాలుగు సార్లు అవకాశం వచ్చిందని, ఇప్పుడాపరిస్థితి లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు.

జనసంఘ్ తరఫున అద్వానీ
పార్టీలో కురువృద్ధుడు లాల్కృష్ణ అద్వానీ నాలుగుసార్లు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. అయితే తొలి రెండుసార్లు ఆయన జనసంఘ్ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. జనసంఘ్ తరఫున 1970లో ఢిల్లీ నుంచి ఒకసారి, 1976లో గుజరాత్ నుంచి మరోసారి ఎంపికయ్యారు. ఆ తర్వాత 1982-1994 మధ్య కాలంలో మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున మరో రెండుసార్లు రాజ్యసభలో ప్రాతినిథ్యం వహించారు.


మూడోసారి ఎవరెవరు?
ఇకపోతే ఎస్ఎస్ అహ్లువాలియా (జార్ఘండ్, బీహార్) నాలుగుసార్లు రాజ్యసభలో ఉన్నప్పటికీ రెండుసార్లు కాంగ్రెస్ తరఫున ఎంపికకాగా మరో రెండుసార్లు (బీహార్, జార్ఘండ్ రాష్ట్రాల నుంచి 1986-2012 మధ్యకాలంలో) బీజేపీ అవకాశం కల్పించింది. ఇలా కాంగ్రెస్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు అనంతర పరిణామ క్రమంలో బీజేపీలో చేరిన తర్వాత ఆ పార్టీ సైతం రాజ్యసభకు అవకాశం లభించినవారు పలువురున్నారు. మొదటి నుంచి కేవలం బీజేపీలో కొనసాగుతున్న వారిలో... మధ్యప్రదేశ్ నుంచి లక్కిరామ్ అగర్వాల్ (1990-2002), రాజస్థాన్ నుంచి రామ్ దాస్ అగర్వాల్ (1990-2012), యూపీ నుంచి రాజ్నాథ్ సింగ్ (1994-2008 మధ్య కాలంలో), దిలీప్ సింగ్ జుదేవ్ (చత్తీస్గఢ్ నుంచి 1992-2010 మధ్య కాలంలో), ప్రస్తుత లోక్‌సభ సభ్యురాలు కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ (1990 నుంచి 2012 మధ్య కాలంలో) లకు మాత్రమే మూడు దఫాలుగా రాజ్యసభ అవకాశం లభించింది.

ఈ ఇద్దరికి ఇప్పట్లో ప్రమాదం లేనట్టే
ప్రస్తుతం 15 మంది బీజేపీ రాజ్యసభ సభ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రిమండలిలో కొనసాగుతున్నారు. తావర్‌చంద్ గెహ్లాట్, పీయూష్ గోయల్, నజ్మా హేప్తుల్లా, స్మృతీ ఇరానీ, అరుణ్ జైట్లీ, ప్రకాష్ జవదేకర్, ముక్తార్ అబ్బాస్ నక్వీ, నిర్మలా సీతారామన్, మనోహర్ పరికర్, సురేష్ ప్రభు, ధర్మేంద్ర ప్రధాన్, రవిశంకర్ ప్రసాద్, బీరేంద్ర సింగ్‌లు కేంద్రమండలిలో ఉన్నారు.


వీరిలో వరుసగా మూడుసార్లు రాజ్యసభ అవకాశం దక్కిన వారు ప్రస్తుత మోదీ ప్రభుత్వంలో ముగ్గురున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఉన్నారు. ఈ ముగ్గురిలో అరుణ్‌జైట్లీ, రవిశంకర్ ప్రసాద్‌ల పదవీ కాలం 2018 వరకు ఉన్నందున వీరి అంశం ఇప్పుడు చర్చకు రావడంలేదు. ఇకపోతే, నజ్మాహేప్తుల్లా అయిదవసారి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ నాలుగుసార్లు మహారాష్ట్ర శాసనసభ నుంచి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. బీజేపీలో చేరిన తర్వాత ఆ పార్టీ మరో రెండుసార్లు 2004లో రాజస్థాన్ నుంచి, 2012లో మధ్యప్రదేశ్ నుంచి (1980 నుంచి 2018 వరకు మధ్యకాలంలో మొత్తం ఆరుసార్లు) అవకాశమిచ్చారు.


అనుమానమే...
బీజేపీ చారిత్రక పరిణామాలు గమనిస్తే చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే రాజ్యసభకు మూడోసారి అవకాశం కల్పించింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత బీజేపీ పదవులు అప్పగించే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.

ఇదీ బీజేపీ రాజ్యసభ లెక్క
ఇతర పార్టీల తరఫున రాజ్యసభకు ఎంపికై పదవీ కాలం ముగిసిన తర్వాత బీజేపీలో చేరి మరోసారి అవకాశం దక్కించుకున్న వారి జాబితాను పక్కనపెట్టి తొలినుంచి బీజేపీలోనే  ఉంటూ రాజ్యసభకు ఎంపికైన వారి వివరాలను పరిశీలిస్తే... పస్తుత రాజ్యసభలో మూడోసారి ఎన్నికైన సభ్యులు ముగ్గురు మాత్రమే ఉండగా, రెండోసారి కొనసాగుతున్న వారు 8 మంది ఉన్నారు. తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టిన వారు 32 మంది సభ్యులున్నారు. ఇకపోతే, బీజేపీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుల జాబితా పరిశీలిస్తే.. మొదటి నుంచి పార్టీలో కొనసాగుతూ నాలుగుసార్లు పెద్దల సభకు ఎంపికైన వారు ముగ్గురు, మూడుసార్లు ఎన్నికైన వారు అయిదుగురు, రెండుసార్లు అవకాశం దక్కించుకున్న వారు 31 మంది నేతలున్నారు. 102 మంది నేతలకు ఒకేసారి మాత్రమే అవకాశం లభించింది.


నజ్మాహెప్తుల్లా రికార్డు...
- ఆరోసారి పెద్దల సభలో అడుగుపెట్టిన నజ్మాహెప్తుల్లా ప్రస్తుతం బీజేపీలో ఉన్నప్పటికీ  1986-2004 వరకు నాలుగుసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత (2004-10, 2012-18) బీజేపీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
- అలాగే ఆరోసారి రాజ్యసభ సభ్యత్వం దక్కించుకున్న డాక్టర్ మహేంద్ర ప్రసాద్ ప్రస్తుతం జేడీ(యూ) తరఫున కొనసాగుతున్నారు. ఆయన కాంగ్రెస్ నుంచి రెండుసార్లు, ఒకసారి నామినేటెడ్ సభ్యుడిగా, ఆ తర్వాత జేడీ(యూ) తరఫున ఎన్నికయ్యారు.

-కె. సుధాకర్‌రెడ్డి

Advertisement

తప్పక చదవండి

Advertisement