కాలేజీ విహారయాత్రలపై నిషేధం! | Sakshi
Sakshi News home page

కాలేజీ విహారయాత్రలపై నిషేధం!

Published Sun, Aug 31 2014 12:53 AM

ugc ban colleges visiting tours

యూజీసీ వైస్ చైర్మన్ దేవరాజ్ వెల్లడి
 
 సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు కళాశాలల తరఫున విహారయాత్రలకు వెళ్లడాన్ని నిషేధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వైస్ చైర్మన్ హెచ్.దేవరాజ్ తెలిపారు. విద్యార్థులు వివిధ టూర్లకు వెళ్లినపుడు వారి భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై త్వరలో మార్గదర్శకాలు జారీ కానున్నాయని వెల్లడించారు. ఈ అంశంపై కళాశాలలు, విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు స్వీకరించేందుకు.. భద్రతా చర్యలపై అధ్యయనం చేసేందుకు నియమించిన ఉన్నత స్థాయి కమిటీ కొద్ది రోజుల్లో యూజీసీకి నివేదికను అందజేయనుందని ఆయన తెలిపారు. యూజీసీ ఆగ్నేయ రాష్ట్రాల కమిటీ సమావేశం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశంలో దేవరాజ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం యూజీసీ పరిశీలనలో ఉన్న వివిధ అంశాలను ఆయన వివరించారు. యూజీసీ ద్వారా నిధుల విడుదలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని, ఇకపై కాలేజీల నుంచి ఆన్‌లైన్ ద్వారానే ప్రతిపాదనలు స్వీకరిస్తామన్నారు.  
 
 యుటిలైజేషన్ సర్టిఫికెట్లను (యూసీ) అందజేయని కాలేజీలకు ఇక ముందు నిధులు ఇవ్వడం కుదరదని, వర్సిటీలు బాధ్యతతో నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాలేజీలు, వర్సిటీల్లో యూజీసీ నిధులతో కొనసాగించే కార్యక్రమాలపై ఇకపై తరచూ తనిఖీ లు ఉంటాయన్నారు. యూజీసీ నుంచి సెంట్రల్ యూనివర్సిటీలకే అధిక మొత్తంలో నిధులు ఇస్తున్నట్లుగా అభిప్రాయం ఉందని, దీనిపై రాష్ట్ర యూనివర్సిటీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్ర స్థాయి వర్సిటీలకు కూడా అధిక మొత్తంలో నిధులు కేటాయించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.సమస్యలపై యూజీసీకి ఎన్ని లేఖలు రాసినా స్పందనరావడం లేదని, దాని పనితీరు మెరుగుపడడం లేదని సమావేశంలో పలువురు వీసీలు ఆరోపించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement