అర్చకుల వేతనాలకు ప్రత్యేక విభాగం | Sakshi
Sakshi News home page

అర్చకుల వేతనాలకు ప్రత్యేక విభాగం

Published Fri, Sep 4 2015 2:19 AM

Special section to the salaries of priests

ఖజానా నుంచి కాకుండా సర్కారు మధ్యే మార్గం
జేఏసీకి ప్రతిపాదించిన ప్రభుత్వం.. నేడు మరోసారి చర్చలు
సాక్షి, హైదరాబాద్:
దేవాలయ ఉద్యోగులు, అర్చకులకు ఖజానా నుంచి వేతనాలు చెల్లించటం సాధ్యం కాదని దాదాపు తేల్చేసిన ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. ఆర్థిక శాఖ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, దేవాలయ విరాళాలను నిధిగా చేసి దాని ద్వారా ఏకరూప వేతనాలు చెల్లించే యోచనలో ఉంది. దీనిపై శుక్రవారం చర్చల్లో స్పష్టత ఇచ్చే అవకాశముంది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఖజానా నుంచి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆలయ అర్చక, సిబ్బంది జేఏసీ 10 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి జేఏసీ ప్రతినిధులతో చర్చలు జరిపారు.

ఆలయ ఉద్యోగులు, అర్చకుల నియామకాలు ఓ పద్ధతిగా జరగకపోవటం, చాలామందికి కనీసం నియమాక ఉత్తర్వులు కూడా లేనందున ఖజానా నుంచి వేతనాలు చెల్లించటం సాంకేతికంగా సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న దేవాలయ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలనే డిమాండ్ సాధ్యమేనని అధికారులు చెప్పారు. రెగ్యులరైజ్ చేయటమంటే నియామకాలను క్రమబద్ధం చేసినట్లే గదా.. అలాంటప్పుడు ఖజానా నుంచి వేతనాలు చెల్లించటం సాధ్యమే కదా అని ప్రతి నిధులు పేర్కొన్నారు. క్రమబద్ధీకరణ ఆ దేవాలయం వరకే సాధ్యమని, అది ప్రభుత్వ నియామకంగా మార్చటం కాదని అధికారులు స్పష్టం చేశారు.

ఖజానా నుంచి వేతనాల పట్టు వీడితే ప్రభుత్వం వారికి ఆమోదయోగ్యంగా ఉండేలా ప్రత్యామ్నాయాన్ని చూపుతుందని పేర్కొన్న మంత్రి.. ఆర్థిక శాఖ ద్వారా చెల్లించే అంశాన్ని ప్రస్తావించారు. ఆర్‌జేసీ మొదలు ఈఓల వరకు చెల్లిస్తున్న వేతనంతోపాటు వారికి అందుతున్న ఇతర ప్రయోజనాలన్నీ వస్తే తమకు ఆమోదయోగ్యమేనని, దేవాదాయశాఖ అధికారుల పెత్తనం ఉండకూడదని జేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారు. వెంటనే సమ్మె విరమించాలని మంత్రి కోరారు. అయితే ఆ వివరాలను స్పష్టం చేసిన తర్వాత, అవి ఆమోదయోగ్యంగా ఉంటే సమ్మె విరమిస్తామని ప్రతినిధులు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లాల ప్రతినిధులతో తాము భేటీ అవుతున్నామని, ఈ చర్చలకు మంత్రి రావాలని వారు కోరారు. ఈ వ్యవహారంపై ఏర్పాటైన కమిటీ మరో వారంలో నివేదిక ఇచ్చే అవకాశముందని, అది రాగానే తుది నిర్ణయం వెల్లడిస్తామని మంత్రి చెప్పడంతో శుక్రవారం నాటికి విషయం తేలుతుందో లేదో సందిగ్ధంగా మారింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement