బీఎస్పీ టు ఎస్పీ వయా బీజేపీ..! | Sakshi
Sakshi News home page

బీఎస్పీ టు ఎస్పీ వయా బీజేపీ..!

Published Thu, Jan 19 2017 8:31 AM

బీఎస్పీ టు ఎస్పీ వయా బీజేపీ..! - Sakshi

లక్నో: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్లో వలసలు జోరందుకున్నాయి. టిక్కెట్లు రానివారు, అసంతృప్త నేతలు పార్టీ కండువాలు మార్చేస్తున్నారు. ఈ జాబితాలో ఓబీసీ నాయకుడు స్వామి ప్రసాద్‌ మౌర్య చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ ఆర్నెళ్ల క్రితం ఆ పార్టీ నుంచి మౌర్య బయటకు వచ్చారు. తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీ అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తిగా ఉన్న మౌర్య.. ఈ పార్టీని కూడా వీడి అధికార ఎస్పీలో చేరుతారని తెలుస్తోంది. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ను ప్రశింసిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. అఖిలేష్‌తో తాను టచ్లో ఉన్నట్టు మౌర్య చెప్పారు.

‘అఖిలేష్‌ యంగ్‌, డైనమిక్‌ నాయకుడు. ఎస్పీ పేరును, పార్టీ గుర్తు సైకిల్ను గెలుచుకున్నందుకు ఆయనకు అభినందనలు. మా మధ్య మంచి సంబంధాలున్నాయి. నాతో కలసి బీజేపీలో చేరిన ఓబీసీ నాయకులకు మొండిచేయి ఎదురైంది. నా వర్గానికి చెందిన నాయకులకు బీజేపీ టిక్కెట్లు కేటాయించలేదు’ అని మౌర్య అన్నారు. మౌర్య తన వర్గీయులకు 35 టిక్కెట్లు ఇవ్వాలని కోరగా, బీజేపీ ఐదుకు మించి ఇవ్వబోమని చెప్పినట్టు సమాచారం. మౌర్యకు ఇతర పార్టీల నుంచి పిలుపు వచ్చింది. అయితే ఆయన ఎస్పీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Advertisement
Advertisement