రామ్‌నాథ్‌ కోవింద్‌ ఘన విజయం

రామ్‌నాథ్‌ కోవింద్‌ ఘన విజయం


న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో  అనుకున్నట్లే జరిగింది. రామ్‌నాథ్‌ కోవింద్‌కే పట్టం కట్టారు. తొలి నుంచి భారీ ఆధిక్యంతో దూసుకెళ్లిన ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌.. యూపీఏ అభ్యర్థిగా మీరాకుమార్‌పై ఘన విజయం సాధించారు. కోవింద్‌కు 65.65, మీరాకుమార్‌కు  34.34 శాతం ఓట్లు పోలయ్యాయి.


ఇక రామ్‌నాథ్‌కు వచ్చిన ఓట్ల విలువ 7,02, 644 కాగా, మీరాకుమార్‌కు వచ్చిన ఓట్లు విలువ 3,67, 314. ఈనెల 25న దేశ 14వ రాష్ట్రపతిగా కోవింద్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఎన్నికల్లో విజయం సాధించిన కోవింద్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు కోవింద్‌ గెలుపుతో బీజేపీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు.



కోవింద్‌ ప్రొఫెల్‌...


వివాద రహితుడిగా, పేద బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా పేరొందిన కోవింద్‌ 1945 అక్టోబర్‌ ఒకటో తేదీన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దెహత్ జిల్లా డేరాపూర్‌లో జన్మించారు. కామర్స్‌లో డిగ్రీ పూర్తిచేసి... కాన్పూర్ యూనివర్సిటీ నుంచి న్యాయవాద పట్టా పుచ్చుకున్నారు. తర్వాత సివిల్‌ సర్వీసెస్‌కు వెళ్లాలన్న ఆశతో ఢిల్లీ చేరుకున్నారు. మూడో ప్రయత్నంలో సివిల్స్‌కు ఎంపికయ్యారు. అయితే ఐఏఎస్‌ రాకపోవడంతో... న్యాయవాదిగా స్థిరపడిపోయారు. ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో 16 ఏళ్లపాటు అడ్వకేట్‌గా పనిచేశారు రామ్‌నాథ్‌ కోవింద్‌. రెండుచోట్లా కేంద్ర ప్రభుత్వ కౌన్సిల్‌గా సేవలందించారు.  పేద, బడుగు బలహీన వర్గాలకు ఉచితంగా న్యాయసేవలు అందించేవారు.



దేశసేవపై ఉన్న మక్కువతో తొలుత సంఘ్‌ పరివార్‌లో చేరారు రామ్‌నాథ్‌ కోవింద్‌. ఢిల్లీలో స్థిరపడిన తర్వాత డేరాపూర్‌లోని తన పాత ఇంటిని ఆర్‌ఎస్‌ఎస్‌కే రాసిచ్చారు. 1991లో బీజేపీలో చేరిన కోవింద్‌... బీజేపీ నుంచి ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి రెండుసార్లు  పోటీచేసి ఓటమిపాలయ్యారు. తర్వాత బీజేపీ దళిత మోర్చా అధ్యక్షులుగా, బీజేపీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. 1994లో తొలిసారి ఎగువసభకు ఎంపికైన కోవింద్‌... రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యులుగా సేవలందంచారు.


1994 నుంచి 2006 వరకూ రాజ్యసభ ఎంపీగా... పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యులుగా, ఒక కమిటీకి ఛైర్మన్‌గానూ పని చేశారు. ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి.. 2002లో ఐరాస సాధారణ అసెంబ్లీలో ప్రసంగించారు. 2015 ఆగస్టు 16న బీహార్‌ గవర్నర్‌గా నియమితలైన కోవింద్‌...  ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యేవరకూ ఆ పదవిలో కొనసాగారు. రామ్‌నాథ్ కోవింద్‌ భార్య పేరు స‌వితా కోవింద్‌. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top