పూచీకత్తు చెల్లించలేనివారి నిర్బంధం వద్దు: సుప్రీంకోర్టు | Sakshi
Sakshi News home page

పూచీకత్తు చెల్లించలేనివారి నిర్బంధం వద్దు: సుప్రీంకోర్టు

Published Sat, Apr 25 2015 12:58 AM

పూచీకత్తు చెల్లించలేనివారి నిర్బంధం వద్దు: సుప్రీంకోర్టు - Sakshi

న్యూఢిల్లీ: బెయిల్ పొందిన వ్యక్తి జైలు నుంచి విడుదల కాకపోవడానికి అతడి పేదరికం కారణం కాకూడదని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పూచీకత్తు మొత్తం చెల్లించకపోవడం వల్ల బెయిల్ వచ్చినప్పటికీ నిర్బంధంలో కొనసాగించడం సరికాదని పేర్కొంది. బెయిల్ వచ్చినా పేదరికంతో పూచికత్తు డబ్బు చెల్లించలేక చాలామంది జైళ్లలోనే మగ్గుతున్నారని సామాజిక న్యాయ ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. అలాంటి వారి విడుదలకు సత్వరమే చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల న్యాయసేవా కేంద్రాలను ఆదేశించింది.

రాజీకి వీలున్న నేరారోపణలు ఎదుర్కొంటున్న ఖైదీల కేసులనూ  పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. నేరం నిర్ధారణ అయితే విధించే గరిష్ట శిక్షలో సగం శిక్షాకాలాన్ని విచారణ ఖైదీలుగా ఉండగానే అనుభవించిన నిందితులను సీఆర్‌పీసీలోని సెక్షన్ 436ఏ ప్రకారం విడుదల చేయడంపై జిల్లా జడ్జి, జిల్లా ఎస్పీ, కలెక్టర్‌లతో కూడిన కమిటీ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఆ కమిటీలు జూన్ 30న సమావేశమై కేసులపై సమీక్షించాలని ఆదేశించింది.

Advertisement
Advertisement