చెన్నుపాటి విద్యకు జమ్నాలాల్ బజాజ్ అవార్డు | Sakshi
Sakshi News home page

చెన్నుపాటి విద్యకు జమ్నాలాల్ బజాజ్ అవార్డు

Published Sat, Nov 29 2014 1:12 AM

కైలాష్ సత్యర్థి, రాహుల్ బజాజ్ నుంచి అవార్డు అందుకుంటున్న చెన్నుపాటి విద్య

* నోబెల్ గ్రహీత కైలాష్ ప్రత్యర్థిచే అవార్డుల ప్రదానం

సాక్షి, ముంబై: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య జమ్నాలాల్ బజాజ్ అవార్డును అందుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఇక్కడ జరిగిన 37వ జమ్నాలాల్ బజాజ్ అవార్డుల ప్రదానోత్సవంలో జానకీదేవి బజాజ్ స్మృతి చిహ్నంగా అందించే మహిళ, శిశు సంక్షేమం విభాగం అవార్డును ఆమె అందుకున్నారు.

నిర్మాణాత్మక పనుల విభాగంలో కర్ణాటకకు చెందిన జన్‌పద్ సేవా ట్రస్ట్ ఫౌండర్ సరేంద్ర కౌలగి, సైన్స్, టెక్నాలజీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ విభాగంలో గుజరాత్‌కు చెందిన సురుచి శిక్షణ్ వసాహత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, డెరైక్టర్ రామ్‌కుమార్ సింగ్‌లు అవార్డులు అందుకున్నారు. అంతర్జాతీయ విబాగంలో ఇతర దేశాల్లో గాంధేయవాదాన్ని ప్రోత్సహించే వారికి ఇచ్చే అవార్డును థాయ్‌లాండ్‌కు చెందిన ఇంటర్నేషనల్ నెట్‌వర్క్ ఆఫ్ ఎంగేజ్డ్ బుద్దిస్ట్ సంస్థ సంస్థాపకులు సులక్ సివారస్కా అందుకున్నారు.

నోబెల్ అవార్డు గ్రహిత కైలాష్ సత్యర్థి ఈ అవార్డులను అందజేశారు. జమ్నాలాల్ బజాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాహుల్ బజాజ్, ఫౌండేషన్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్, రిటైర్డ్ న్యాయమూర్తి సీఎస్ ధర్మాధికారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జమ్నాలాల్ బజాజ్ 125వ జయంతిని పురస్కరించుకుని ఈ సారి అవార్డు గ్రహీతలకు అందించే ప్రైజ్‌మనీని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచారు.

మహిళలకు గౌరవం లభిస్తేనే సమాజంలో మార్పులు: విద్య
మహిళలకు సమాన హక్కులతో పాటు గౌరవం లభిస్తేనే సమాజంలో మార్పులు సాధ్యమని చెన్నుపాటి విద్య చెప్పారు. జమ్నాలాల్ బజాజ్ అవార్డు అందుకున్న విద్య ‘సాక్షి’తో మాట్లాడుతూ మహిళలకు సమాన హక్కుల సాధన లక్ష్యంతో వాసవ్య మహిళా మండలిని స్థాపించి నట్లు చెప్పారు. సామాజికంగా, రాజకీయంగా మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళల్లో అక్షరాస్యతతోపాటు అనేక విషయాలపై అవగాహన కల్పించి వారి అభివృద్ధికి  పాటుపడుతున్నట్టు చెప్పారు. పలు జిల్లాల్లో తమ సంస్థ సేవా కార్యక్రమాలు చేస్తోందన్నారు.

సైన్స్, టెక్నాలజీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ విభాగం అవార్డు గ్రహీత రామ్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలు, అక్కడి వనరుల అభివృద్ధికి తమ సంస్థ కృషి చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా రైతులకు పనులు, శ్రమ తగ్గించే విధంగా చవకైన పనిముట్లను రూపొందిస్తున్నట్లు చెప్పారు. తాము డిజైన్ చేసిన ‘పార’తో కూలీల శ్రమ చాలా తగ్గుతుందని, వారి మోకాళ్లు, నడుంపై కూడా భారం పడదని తెలిపారు.
 

Advertisement
Advertisement