గాంధీ ఆస్పత్రిలో ఏసీబీ దాడులు | Sakshi
Sakshi News home page

గాంధీ ఆస్పత్రిలో ఏసీబీ దాడులు

Published Tue, Sep 1 2015 4:48 AM

గాంధీ ఆస్పత్రిలో ఏసీబీ దాడులు - Sakshi

- పట్టుబడ్డ అడిషనల్ డెరైక్టర్ రమేశ్‌బాబు
- సెక్యూరిటీ బిల్లులు చెల్లించేందుకు రూ.40 వేలు డిమాండ్
హైదరాబాద్:
సెక్యూరిటీ సంస్థకు చెందిన బకాయి బిల్లులు చెల్లించేందుకు లంచం తీసుకున్న సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి  అడిషనల్ డెరైక్టర్ ఎన్‌వీ రమేశ్‌బాబును అవినీతి నిరోధకశాఖ అధికారులు సోమవారం వలపన్ని పట్టుకున్నారు. లంచంగా తీసుకున్న రూ. 20 వేలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీ ఆస్పత్రిలో శ్రీసాయి సెక్యూరిటీ సంస్థ ద్వారా అవుట్‌సోర్సింగ్ పద్ధతిని 96 మంది సెక్యూరిటీ గార్డులు విధులు నిర్వహిస్తున్నారు. సదరు సంస్థకు ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల బిల్లులు ప్రభుత్వం నుంచి మంజూరు కాలేదు.

బకాయి బిల్లులు మంజూరయ్యేలా చూడమని శ్రీసాయి సెక్యూరిటీ సంస్థ ఎండీ డీ. శ్రీకాంత్ కోరారు. రూ.44 లక్షల బకాయి బిల్లులను మంజూరు చేసేందుకు తనకు రూ. 40 వేలు ఇవ్వాలని రమేశ్‌బాబు డిమాండ్ చేశారు. అప్పటికి సరేనని.. ముందు రూ.20 వేలు.. బిల్లులు మంజూరు అయిన తర్వాత మిగతా సొమ్ము ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈనెల 27న శ్రీకాంత్ అవినీతి నిరోధక శాఖ అధికారులను కలసి పరిస్థితి వివరించాడు. దీంతో అధికారులు పకడ్భందీగా వలపన్ని కొన్ని నోట్లను శ్రీకాంత్‌కు ఇచ్చారు.

సోమవారం మధ్యాహ్నం గాంధీ కళాశాల క్రీడామైదానం వద్దకు చేరుకున్న ఏడీ రమేశ్‌బాబు.. శ్రీకాంత్ నుంచి సొమ్ము తీసుకుని వెళ్లిపోయాడు. కార్యాలయంలోకి వెళ్లి భోజనం చేస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఏడీ జేబులు సోదా చేశారు. తాము రసాయనాలు కలిపి ఇచ్చిన రూ. 20 వేలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏడీ, అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాల్లోని రికార్డు పుస్తకాలను పరిశీలించారు. ఏసీబీ డీఎస్పీ రవికుమార్‌తోపాటు ఐదుగురు ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ దాడుల్లో పాల్గొన్నారు. గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఏడీగా విధులు నిర్వహించిన రమేష్‌బాబు 2013 మే 15న గాంధీ ఆస్పత్రి ఏడీగా పదవీబాధ్యతలు చేపట్టాడు.

Advertisement
Advertisement