నువ్వా.. నేనా...! | Sakshi
Sakshi News home page

నువ్వా.. నేనా...!

Published Sat, Jan 24 2015 4:09 AM

What was yesterday ... ..!

వనపర్తి నియోజకవర్గంలో అధికార దర్పం నువ్వా.. నేనా అన్న రీతిలో సాగుతోంది. అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన చిన్నారెడ్డి... టీఆర్‌ఎస్ పార్టీ నాయకుడిగా ఉండి ప్రణాళికాసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిలు తమ మాటే నెగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎవరి మాట వినాలో.. ఎవరికి అనుకూలంగా ఉండకుంటే ఏమవుతుందోనని అధికారులు హడలిపోతున్నారు.
 
వనపర్తి : వనపర్తిలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైంది. టీఆర్‌ఎస్ గాలి బలంగా వీస్తున్న తరుణంలో వనపర్తిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన చిన్నారెడ్డి అనూహ్య విజయం సాధించారు. దీంతో చిన్నారెడ్డిపై అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన నిరంజన్‌రెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి వరించడంతో ఆయనకు రాష్ట్ర కేబినెట్ మంత్రి హోదా లభించింది. దీంతో వనపర్తి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీలో, ప్రజల్లో తన ప్రాబల్యం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అన్ని అధికార, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల్లో మమేకం అవుతున్నారు. అయితే అధికార యంత్రాగం ఎమ్మెల్యేను కాదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడైన నిరంజన్‌రెడ్డికి ప్రాధాన్యతనిస్తున్నారన్న విమర్శలు కాంగ్రెస్ నేతలు చేస్తుండడంతో ఎమ్మెల్యే చిన్నారెడ్డి అధికారులను మందలిస్తున్నారు. ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇవ్వాలని.. లేకుంటే అందుకు ప్రతిఫలం చవి చూస్తారంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.  నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటిస్తున్న నేతలిద్దరూ ఆది నుంచే పంతాలకు పోతుండడంతో ఇది అభివృద్ధికి అవరోధంగా మారుతుందేమోనని నియోజకవర్గ ప్రజలు భయపడుతున్నారు.

వనపర్తిలో కొంత కాలంగా అధికార పార్టీ అభ్యర్థి ఓడి ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న సంప్రాదాయం కొనసాగుతోంది. ఇది అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగా మంత్రి హోదాలో చిన్నారెడ్డి ఓటమి పాలై తెలుగుదేశం అభ్యర్థి రావుల చంద్రశేఖర్‌రెడ్డి గెలిచారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా ఆ పార్టీ నుంచి పోటీ చేసిన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్నారెడ్డి విజయం సాధించారు. ఓడినవారు.. గెలిచిన వారు ఇద్దరూ అధికారులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తుండడంతో తమ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైందని నియోజకవర్గ అధికారులు భావిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement