పచ్చి పులుసు.. పాయ షోరువా | Sakshi
Sakshi News home page

పచ్చి పులుసు.. పాయ షోరువా

Published Sat, Apr 25 2015 2:02 AM

పచ్చి పులుసు..  పాయ షోరువా

హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్లీనరీలో తెలంగాణ వంటకాలు ఘుమఘుమలాడాయి. నోరూరుంచే రుచులతో కట్టిపడేశాయి. గంగవాయిలి కూర పప్పు వంటి శాకాహార వంటకాలు, పాయ షోరువా, బోటీ వేపుడు వంటి మాంసాహార వంటకాలు తెలంగాణ ప్రత్యేకతను చాటుకున్నాయి. రాష్ర్టం నలుమూలల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులు, పార్టీ ప్రతినిధుల కోసం నిజాం కళాశాల మైదానంలో భోజన ఏర్పాట్లు చేశారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ స్వీయ పర్యవేక్షణలో వంటకాలను ప్రత్యేకంగా వండి వడ్డించారు. 30 వేల మందికిపైగా కార్యకర్తలు, నాయకులు భోజనాలు ఆరగించారు. టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఇష్టపడే పచ్చిపులుసు వంటకాల్లో ప్రత్యేకంగా నిలిచింది.

 కనిపించని బిర్యానీ!

హైదరాబాద్ సంస్కృతికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన బిర్యానీ ఈ వంటకా ల్లో లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తెలంగాణ పిండివంటలైన సర్వపిండి, మలిద ముద్దలు, సకినాలు, జొన్న రొట్టెలు, మక్క గారెలు కూడా కనిపించకపోవడం గమనార్హం. కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన భోజనశాలలో వంటకాలు త్వరగా అయిపోవడంతో వారిని వీఐపీల భోజనశాలకు తరలించారు. దీంతో అప్పటి వరకు ప్లేట్ పట్టుకొని క్యూలో నించున్న వేలాది మంది...ప్రముఖుల భోజనశాలకు తరలివెళ్లడం ఇబ్బందికరంగా మారింది. అందరూ ఒక్కసారిగా ముందుకు వచ్చినా తొక్కిసలాట జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన స్పందన కేటరర్స్ మాస్టర్ చెఫ్ మోహిన్ నేతృత్వంలో 350 మంది వంటగాళ్లు వంటలు వండారు.

మెనూ అదుర్స్..
 
సుమారు 8 టన్నుల మటన్ కర్రీ
8 టన్నుల చికెన్ ఫ్రై
5 టన్నుల బోటీ ఫ్రై
2 టన్నుల లివర్ ఫ్రై
2 టన్నుల పొట్టేలు తల మాంసం
పాయ షోరువా
80 వేల గుడ్లతో ఎగ్ పులుసు
80 వేల కిలోల బగారా రైస్
80 వేల కిలోల వైట్ రైస్
గంగవాయిలి కూర పప్పు
పచ్చి పులుసు, పప్పు చారు
ఆలు, టమాట, వంకాయ కూర
పెరుగు, మజ్జిగ, రైతా
బాదుషా స్వీటు
 
 

Advertisement
Advertisement