పోరాటాలకు సిద్ధం కావాలి | Sakshi
Sakshi News home page

పోరాటాలకు సిద్ధం కావాలి

Published Sun, Mar 29 2015 12:44 AM

పోరాటాలకు సిద్ధం కావాలి - Sakshi

పూలే జయంతి నుంచి అంబేద్కర్ జయంతి
వరకు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు
పార్టీ శ్రేణులకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పిలుపు
ఉద్యోగుల పీఆర్‌సీ బకాయిలను జీపీఎఫ్‌లోనే జమ చేయాలని డిమాండ్

 
హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడిని తెచ్చేందుకు పోరాటాలకు సన్నద్ధం కావాలని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అమలు కోసం వచ్చేనెల 11న పూలే జయంతి నుంచి 14న అంబేద్కర్ జయంతి వరకు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ శ్రేణులను కోరారు. ప్రభుత్వ రంగం క్రమంగా తగ్గిపోతూ, ప్రైవేట్ సంస్థలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంగంలో రిజర్వేషన్లు అమలుకాకపోవడం వల్ల రాజ్యాంగస్ఫూర్తి దెబ్బతింటుందన్నారు. శనివారం ఎంబీ భవన్‌లో పార్టీనాయకుడు డీజీ నరసింహారావు అధ్యక్షతన జరిగిన ప్రజాసంఘాల బాధ్యుల సమావేశంలో తమ్మినేని మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల గురించి పట్టించుకోకపోగా, ఆ కుటుంబాలను పరామర్శించి, వారికి ధైర్యాన్ని కూడా కల్పించలేదన్నారు.

ముందస్తు అరెస్ట్‌లకు ఖండన

సీఎం కేసీఆర్ భద్రాచలం పర్యటన నేపథ్యంలో సూర్యాపేటలో పోలీసుల అత్యుత్సాహం వల్ల ప్రజల దైనందిన జీవనానికి తీవ్ర ఇబ్బందులు కలిగాయని సీపీఎం పేర్కొంది. ముందస్తుగా సీపీఎం నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఖండించింది. నాయకులు, మంత్రుల పర్యటనల సందర్భంగా పోలీసులు భద్రత పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయొద్దని కోరింది. ఉద్యోగుల పీఆర్‌సీ బకాయిలను జీపీఎఫ్‌లోనే జమచేయాలని డిమాండ్ చేసింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement