అనుకున్న దానికంటే ఎక్కువనే... | Sakshi
Sakshi News home page

అనుకున్న దానికంటే ఎక్కువనే...

Published Tue, Sep 2 2014 4:02 AM

One hundred per cent of the production of the four areas

- ఆగస్టు లక్ష్యం సాధించిన సింగరేణి
- వార్షిక లక్ష్య సాధనలో కూడా ముందంజ
- నాలుగు ఏరియాల్లో వంద శాతంపైగా ఉత్పత్తి
- వర్షం అడ్డంకిగా మారినా ఆగని ఉత్పత్తి
కొత్తగూడెం (ఖమ్మం) : సింగరేణి సంస్థ ఆగస్టు నెలలో నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో సాధించింది. అంతేకాక వార్షిక లక్ష్యంలో సైతం ముందంజలో ఉంది. ఆగస్టులో 3.76 మిలియన్ టన్నులకుగాను 3.82 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించి 102 శాతం ఉత్పాదక రేటును నమోదు చేసుకుంది. వార్షిక లక్ష్యంలో భాగంగా ఇప్పటివరకు 17.22 మిలియన్ టన్నులకు గాను 18.88 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించిన 115 శాతంతో విజయపథంలో దూసుకుపోతోంది. జూలైలో వర్షం కారణంగా ఉత్పత్తి తగ్గడంతో ఆ ప్రభావం వార్షిక ఉత్పత్తిపై కూడా పడింది.

కానీ ఆగస్టులో వర్షాలు అంతంతమాత్రంగా పడడంతో ఓపెన్‌కాస్టు గను ల్లో ఉత్పత్తి యధావిధిగా కొనసాగింది. గడిచిన ఐదు నెలల్లో సింగరేణి వ్యాప్తంగా 17.22 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా 19.88 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించగలిగింది. కొత్తగూడెం, మణుగూరు, రామగుండం -3, శ్రీరాంపూర్ ఏరియాలు మాత్రమే ఈ ఏడాదిలో ఇప్పటివరకు వంద శాతం ఉత్పత్తితో ముందుకు సాగుతున్నాయి. మిగిలిన ఆరు ఏరియాల్లో ఉత్పత్తి పూర్తిస్థాయిలో రావడం లేదు.
 
ఆగస్టులో 102 శాతం ఉత్పత్తి
ఆగస్టులో ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల ప్రభావం సింగరేణి సంస్థపై కన్పించలేదు. ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుల్లో 37.64 లక్షల బొగ్గు ఉత్పత్తిని సాధించాల్సి ఉండగా 38.23 లక్షల టన్నుల బొగ్గును వెలికితీశారు. సింగరేణిలోని పది ఏరియాల్లో కేవలం ఐదు ఏరియాలు మాత్రమే నూరు శాతం ఉత్పత్తిని సాధించగలిగాయి. అత్యధికంగా ఇల్లెందు.. మణుగూరు ఏరియా 4.5 లక్షల టన్నులకు గాను 5.77 లక్షల టన్నులతో 128 శాతంతో ముందంజలో నిలిచింది.

కొత్తగూడెం ఏరియా 5 లక్షల టన్నులకు 6 లక్షల టన్నులతో 120 శాతం ఉత్పత్తితో రెండో స్థానంలో నిలిచింది. రామగుండం-1 ఏరియా 4.2 లక్షల టన్నులకుగాను 4.6 లక్షల టన్నులతో మూడో స్థానం, మందమర్రి ఏరియాలో 1.5 లక్షల టన్నులకు గాను 1.53 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించి 102 శాతం ఉత్పత్తితో నాలుగో స్థానంలో నిలిచింది. శ్రీరాంపూర్ ఏరియా 4 లక్షల టన్నులకు గాను 4.01 లక్షల టన్నులతో ఐదో స్థానంలో నిలిచింది. మిగిలిన ఏరియాలు నూరు శాతం ఉత్పత్తిని సాధించలేకపోయాయి.

Advertisement
Advertisement